HomeNewsBreaking Newsస్వాతంత్య్ర వేడుకల్లోఉగ్రదాడులకు కుట్ర!

స్వాతంత్య్ర వేడుకల్లోఉగ్రదాడులకు కుట్ర!

బలగాలు అప్రమత్తం
న్యూఢిల్లీ :
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న సైనిక స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబ, జైషే మహమ్మద్‌ కుట్రలు పన్నిట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా ఢిల్లీ లక్ష్యంగా ఈ ఉగ్రసంస్థలు దాడులకు యత్నించవచ్చని చెబుతున్నాయి. దీంతో దేశ రాజధానిలో భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. దేశంలోని కొన్ని ఉగ్ర సంస్థలు కూడా దాడులకు తెగబడే అవకాశాలను కొట్టిపారేయలేమని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఢిల్లీ, దాని చుట్టుపక్కల పలు పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని కొన్ని సంస్థలు పనిచేస్తున్నట్లు ఫిబ్రవరిలో తొలిసారి ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలకు సమాచారం అందింది. మే నెలలో పాక్‌లోని లష్కరే ఆపరేటీవ్‌ ఒకరు ఢిల్లీలోని కీలక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించమని ఇక్కడి ఉన్న అతడి సహచరులకు సూచించిన విషయాన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. వీటిల్లో కొన్ని కీలక మార్గాలు, రైల్వే స్టేషన్లు, ఢిల్లీ పోలీసు కార్యాలయాలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రధాన కార్యాలయం ఉన్నాయి. భారత్‌లోని ఢిల్లీ సహా పలు నగరాల్లో జైషే సంస్థ దాడులు చేస్తుందని ఈ ఏడాది మేలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ వేర్పాటువాది ప్రకటించాడు. ఇక అంతర్గత వామపక్ష తీవ్రవాదులు, సిక్కు మిలిటెంట్‌ సంస్థలు, ఈశాన్య భారత్‌లోని వేర్పాటు వాద సంస్థల నుంచి కూడా ముప్పు పొంచిఉంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దాదాపు 10,000 మంది సిబ్బందితో నగర వ్యాప్తంగా భద్రతా చర్యలను చేపట్టారు. దాదాపు 1,000 ఫేషియల్‌ రికగ్నైషన్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను కీలక ప్రదేశాల్లో మోహరించారు.
కశ్మీర్‌లో మూడంచెల భద్రత..
శ్రీనగర్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కశ్మీర్‌లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు కీలక ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్‌లతో నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గతంలో మాదిరిగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయబోమని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌ఒజి) జవాన్లతోపాటు, ఇతర బలగాలు భద్రతను చేపడతాయని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే లాల్‌ చౌక్‌, బక్షి మైదానం ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగని ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లను బ్లాక్‌ చేయడం, బారికేడ్ల ఏర్పాటు లాంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడిక్కడ పోలీసులను మోహరించారు. విస్త్రృత తనిఖీలను నిర్వహించి అనుమాస్పద వ్యక్తులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments