రద్దున సాగు చట్టాలు తిరిగి తెచ్చే యోచనలేదు
పెడార్థాలతో కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోంది
న్యూఢిల్లీ : సాగు చట్టాలపై కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి స్వరం మార్చారు. రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్ళీ తెచ్చే ఆలోచన లేదని, అదంతా పెడార్థాలు తీసి కాంగ్రెస్‌పార్టీ సృష్టిస్తున్న గందరగోళమేనని చెప్పుకొచ్చారు.ఇటీవల రద్దు చేసిన ఆ చట్టాలను తిరిగి తీసుకువచ్చే ఉద్దేశాలు ఏమీ ప్రభుత్వానికి లేవని ఆయన అన్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్ సృష్టించిన గందరగోళంపై ఏ విధంగానూ ఆందోళన చెందవద్దని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తోమర్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, మూడు వ్యవసాయ చట్టాలను రైతుల సంక్షేమాన్ని ఆశించే ప్రభుత్వం తీసుకువచ్చిందని, కానీ ఢిల్లీలో రైతుల ఆందోళన కారణంగా ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకోవాలని మోడీ నిర్ణయించుకున్నారని చెప్పారు. ఈ సమ్యపై నాగపూర్‌లో ఇటీవల తన ప్రసంగం సందర్భంగా తాను ప్రస్తావించిన అంశానికి తప్పుడు భాష్యం చెప్పారని, తన అసలు ఉద్దేశ్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదని వివరణ ఇచ్చారు. ‘రైతుల వ్యవసాయ చట్టాలకు సంబంధించి మేం ఒక అడగు వెనక్కు వేశాం, కానీ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల సంక్షేమం కోసం పాటు పడటంలో ముందంజలో ఉంటుంది’ అని నేను ఆనాడు ప్రసంగంలో చెప్పానని, అందువల్ల ఈ సమస్యపై రైతులు తప్పుగా అర్థం చేసుకోవద్దని వివరణ ఇచ్చారు. ఒక అడుగు వెనక్కు వేశామని చెప్పడంతో తన ఉద్దేశం మాత్రం మళ్ళీ చట్టాలను తీసుకురావడమనే అర్థం కాదని ఆయన అన్నారు. తన మాటలకు పెడార్థాలు తీశారని అన్నారు. కాంగ్రెస్ ప్రతికూల ధోరణితో వ్యవహరిస్తోందని, అన్నిటికీ పెడార్థాలు తీస్తోందని, గందరగోళం సృష్టించి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోందని ఆయన కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌పార్టీ పట్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. 2006లో సమర్పించిన స్వామినాథన్ కమిటీ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. గురునానక్ జయంతి సందర్భంగా నవంబరు 19వ తేదీన నరేంద్రమోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటిరోజు నవంబరు 29న వాటిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. దాంతో ఏడాదికాలంపాటు ఢిల్లీ సరిహద్దుల్లో మూడుచోట్ల కొనసాగిన రైతుల చారిత్రాత్మకమైన ఆందోళన ఉద్యమం ముగిసింది. 2020 సెప్టెంబరులో ఈ చట్టాలకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. తిరిగి 2021 నవంబరు 29న రద్దు చేస్తూ మరో తీర్మానం చేసింది. రైతులకు స్వావలంబన, సంరక్షణ ఇచ్చే ధరలర్రోసా, వ్యవసాయ సేవా చట్టం., రైతుల ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక చట్టం, నిత్యావసర వస్తువుల సవరణ చట్టం…అనే మూడు చట్టాలను కేంద్రం తీసుకురావడంతో వీటికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వచ్చింది.
కేంద్ర వ్యవసాయమంత్రి తోమర్ స్వరం మారింది
RELATED ARTICLES