బిజెపి, దానికి మద్దతిచ్చే పార్టీలను ఓడించడం అనివార్యం
కడప రోడ్‌షోలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం
ప్రజాపక్షం/కడప; ఎన్‌డిఎ పాలనలో దేశంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో పార్లమెంటుతో సహా అన్ని స్వతంత్ర సంస్థలైన ఆర్‌బిఐ, సిబిఐ, ఇడి, ఐటి, న్యాయ వ్యవస్థ తదితరాలను మోడీ సర్కారు తత ప్రభుత్వ శాఖలుగా మార్చేసిందని దుయ్యబట్టారు. బిజెపితో సహా ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చేవారిని ఓడించాలని పిలుపునిచ్చారు. మోడీ కార్పొరేట్లకే చౌకీదారని, ఆయనను తక్షణం అధికారం నుంచి తొలగించాలని అన్నారు. సిపిఐ, జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్‌లో కడప నగరంలో భారీ రోడ్‌షో జరిగింది. స్థానిక కళాక్షేత్రం నుంచి పాతబస్టాండు మీదుగా పలు ప్రధాన కూడళ్ళలో రోడ్‌షో కడప సిపిఐ ఎంపి అభ్యర్థి గుజ్జుల ఈశ్వరయ్యను, కడప అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి సుంకర శ్రీనివాస్‌లను గెలిపించాలని సురవరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో వున్న దళితు లు, మైనార్టీలపై దాడులు పెరిగాయని, అనేక మంది మేధావులపై హిందుత్వ శక్తులు దారుణ హత్యాకాండకు పాల్పడ్డారని అన్నారు. ప్రజలు తమ పట్ల చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని, విజయం సాధిస్తామన్న విశ్వాసం కలుగుతోందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపిలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు.రాజకీయాల్లో మా ర్పు తీసుకువచ్చేందుకే సిపిఐ, సిపిఐ(ఎం), జనసేన, బిఎస్‌పిలు కలిసి ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు. నాలుగున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశ వాద రాజకీయాలు నడిపారని ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం నిబద్ధతతో నిరంతరంగా పోరాడింది కేవలం వామపక్షాలు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెప్పారు. పేద ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, నిరుద్యోగుల వాణి చట్ట సభలలో వినిపించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.