సిపిఐ, సిపిఎం ప్రతినిధుల బృందం డిమాండ్
హత్రాస్ అత్యాచార బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వామపక్ష నాయకులు
బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో అత్యాచారానికి గురై మృతి చెందిన దళిత యువతి కుటుంబాన్ని సిపిఐ, సిపిఐ(ఎం) సంయుక్త ప్రతినిధుల బృందం మంగళవారం కలుసుకొని పరామర్శించింది. ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్, పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గిరీశ్ శర్మ, సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్, పార్టీ యుపి రాష్ట్ర కార్యదర్శి హీరాలాల్ యాదవ్‌లతో కూటిన సంయుక్త ప్రతినిధుల బృందం హత్రాస్‌కు వెళ్లి బాధితురాలు కుటుంబాన్ని ఓదార్చింది. వారికి సానుభూతిని తెలియజేసింది. దారుణమైన అత్యాచార ఘటన గురించి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బాధితురాలి మృతదేహానికి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తమ వద్ద గోడును వెల్లుబోసుకున్నారని వామపక్ష ప్రతినిధులు తెలిపారు. 21వ శతాబ్దంలోనూ ఇంలాటి దారుణమైన ఘటనలు చవిచూడడం అత్యంత విషాదకరమని, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హామీలను ఉల్లంఘించడమేనన్నారు. బాధిత కుటుంబానికి తాము సంఘీభావం తెలిజేశామని ప్రతినిధులు పేర్కొన్నారు. కేవలం సానుభూతిని తెలియజేయడమే కాకుండా మన బిడ్డకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని, బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. దళిత మహిళ అత్యాచారానికి గురై మృతి చెందిన ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని, దోషులను గుర్తించి వారిని శిక్షించాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఇది కుల ఘర్షణ లేదా కొంత కుట్ర అంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయని ఆ వాదనలన్నింటినీ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అన్నింటినీ పరిష్కరించేందుకు చట్టాలు ఉన్నాయని చెప్పారు. అయితే న్యాయం చేయడంలో ఆలస్యం చేసేందుకు గానీ, తిరస్కరించడాకి గానీ చట్టాలను సాకుగా చూపొద్దొన్నారు. ఏది ఏమైనా బాధితురాలికి న్యాయం చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఐ, సిపిఎం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సమస్య అంశం ఒక్క హత్రాస్ ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదని, దానిపై యావత్ దేశం ఆందోళన చెందుతుందని వారు వ్యాఖ్యానించారు. ‘ఇది భారతదేశంలోని ప్రతిఒక్కరికీ సంబంధించిన సమస్య. ఇది అఖిల భారత సమస్య. ఇలాంటివి పునరావృతం కాని వాతావరణాన్ని మనం సృష్టించేలా చూసుకోవాలి. న్యాయం చేసేందుకు తిరస్కరించడానికి లేదా న్యాయం చేయడంలో ఆలస్యం చేయడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవరోధాలు సృష్టిస్తే అది ఆమోదయోగ్యం కాదు’ అని ప్రతినిధులు ఉద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు రక్షణకరువైందన్న అభిప్రాయాన్ని బాధిత కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారని, కేసును సిబిఐకి సిఫార్సు చేయడంపై వారు అసంతృప్తితో ఉన్నారన్నారు. కేసుపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుపాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. నేరం జరిగింది అని యుపి సిఎం ఇప్పటికీ చెప్పకపోవడం తమకు ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. బాధిత మహిళ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అంతకన్నా సిగ్గుపడేది మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ గత మంగళవారం మృతి చెందింది. అయితే బాధిత మృతిదేహానికి మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. అర్ధరాత్రే అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాల్సిందే
RELATED ARTICLES