కరుణించని కేంద్రం
రూ.350 కోట్ల కోసం మున్సిపల్ ఎదురుచూపు
రాష్ట్రంపై వివక్ష చూపుతుందనే విమర్శ
ప్రజాపక్షం/హైదరాబాద్; స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బిఎం) నిధుల కోసం రాష్ట్ర మున్సిపల్ శాఖకు నిరీక్షణ తప్పడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేకుండాపోయిందని సాక్షాత్తు అధికార వర్గాలే చెబుతున్నాయి. ఒకవైపు దగ్గరపడుతున్న ఆర్థిక సంవత్సరం, మరోవైపు డిపిఆర్‌లో పొందపర్చిన పనుల పురోగతి పరిశీలన గడువు దగ్గరపడుతున్నప్పటికీ ‘స్వచ్ఛత’ నిధులకు మాత్రం మోక్షం లభించడం లేదు. డిపిఆర్ ప్రకారం నిధులను సకాలంలో రాకపోయినప్పటికీ పనుల పురోగతిని పరిశీలించేందుకు మాత్రం జనవరి మొదటి వారంలో ‘సర్వేక్షణ్’ తనిఖీలు మొదలుకానున్నాయి. ఎస్‌బిఎంలో భాగంగా రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో స్వచ్ఛత పనులను చేపట్టేందుకు మున్సిపల్ శాఖ సుమారు రూ. వెయ్యి కోట్లతో డిపి ఆర్‌ను రూపొందించింది. దీనికి రెండు సంవత్సరాల క్రితమే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ప్రతిపాదించగా దీనికి ఆమోదముద్ర కూడా పడింది. దీంతో చెత్తను తరలించేందుకు వాహనాలు, చెత్త వ్యర్థాల నిర్వహణకు మున్సిపల్ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే చెత్తను తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలను కొనుగోలు చేసింది. మరో 100 వాహనలు టెండరింగ్ దశలో ఉన్నాయి. ఎస్‌బిఎం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో పనులను కూడా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది వరకే సుమారు రూ. 160 నుంచి రూ. 170 కోట్ల నిధులను మంజూరు చేసింది. మరో రూ.350 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇది వరకే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కూడా దాఖలు చేసినట్లు మున్సిపల్ శాఖాధికారులు పేర్కొంటున్నారు. అయితే తడి, పొడి చెత్తను వేరు, ఇంటి నుంచి చెత్తను తరలించడంతో పాటు డంపింగ్ యార్డులలో రీ సైకిలింగ్ పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించుకుంది. అయితే ఇది వరకే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిదులతో కలిపి వాహనాలను కొనుగోలు చేశారు. చెత్త తరలింపు, దీనికి సంబంధించిన పలు కార్య క్రమాల కోసం ఇతర నిధులను కూడా స్వచ్ఛతకు కేటాయించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో స్వచ్ఛత పనులకు నత్తనడకన సాగుతున్నాయి. మరో వైపు ఇప్పటి వరకు ఎస్‌బిఎం ద్వారా మంజూరైన పనులను పర్యవేక్షించి పరిశీలించేందుకు సర్వేక్షణ్ బృందం జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి రానుంది. ఒక వైపు నిధులను విడుదల చేయలేదని అధికార వర్గాలు చెబుతుంటే అర కొర నిధులు విడుదల చేసిన పనులను ఎలా పరిశీలిస్తారని మున్సి పాలిటీ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.