హైదరాబాద్‌లో తెలంగాణ సాయుధ పోరాట
ప్రభుత్వానికి సిపిఐ నేతలు, ప్రముఖుల విజ్ఞప్తి
తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయుధ పోరాటయోధులకు ఘనంగా నివాళి
ప్రజాపక్షం/హైదరాబాద్
మహత్తర తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటాన్ని భావి తరాలకు అందించేందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో స్మారక చిహ్నం ఏర్పాటు చేయడంతోపాటు తెలంగాణ విలీనం దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సిపిఐ నేతలు, ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన 76వ వార్షికోత్సవాల సభ నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకట రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ సభ్యులు ఉజ్జని రత్నాకర్ రావు, మాజీ ఎంఎల్‌ఎలు ఉజ్జని యాదగిరి రావు, రాజిరెడ్డిలతో పాటు సిపిఐ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధులు బత్తిని యాదగిరి, కందిమళ్ల ప్రతాపరెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ నారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర ఎవరో చెరిపేస్తే చెరిగి పోయేదికాదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఈ భూమి మీద ఉన్నంత కాలం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మరవబోదన్నారు. భూర్జువా పాలకవర్గాలు పిరికి పందలని విమర్శించారు. అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించేందకు జంకుతున్నాయన్నారు. తాను ఎవరికీ భయపడనని, జంకబోననిచెబుతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 17న తెలంగాణ విలీనం దినోత్సవ వేడులను అధికారికంగా నిర్వహించాలని నారాయణ డిమాండ్ చేశారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొత్తం సమాజంపై ప్రభావం చూపిందన్నారు. ఆ స్ఫూర్తే దేశ వ్యాప్తంగా మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులతో సహా అనేక మందిలో కమ్యూనిస్టు భావాజాలం నేటికి వారి మనుస్సులో నిండి ఉందన్నారు. ఎప్పటికైనా అంతిమగా నిలబడిదే త్యాగం మాత్రమేనని, అది ఎర్రజెండాలోనే ఉంటుందని, ఎప్పటికీ ఈ జెండా రెపరెపలాడుతూనే ఉంటుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఏ సంబంధం లేదని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నాయని, ఎవరికో భయపడి ప్రభుత్వం విలీనం దినోత్సం ప్రభుత్వ అధికారంగా నిర్వహించపోతే అది రాజకీయంగా కాంగ్రెస్‌కే నష్టమని చెప్పారు. ఇప్పటికైనా సిఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ విలీన దినోత్సం అధికారికంగా నిర్వహించాలని కోరారు. కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టులంతా ఏకం కావాలనే తపన దేశంలోని అన్ని వర్గాల ప్రజలలో నిత్యం పెరుగుతోందని, వారి ఆకాంక్షలను నేరవేర్చిన నాడే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు ఘన నివాళి అని అన్నారు. చరిత్రను తుడిపివేయడం జరగదని, కేవలం ప్రయత్నాలు మాత్రమే జరుగుతాయని తెలిపారు. ప్యూడల్ రాచరికం, పెత్తందారితనం, భూస్వామ్య వ్యవస్థల్లో అత్యంత దుర్మార్గమైంది పూడ్యల్ వ్యవస్థ అన్నారు. ఈ వ్యవస్థను కమ్యూనిస్టులు మహాత్తరమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో కూలదోస్తే, ఈ చరిత్రను మనంతా ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో సంస్కృతితో పేరుతో కనుమరుగు చేసే ప్రయత్నం చేశారని శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 10 ఏళ్ల కాలంలో బజార్లలో నినాదాలిచ్చిన వారంతా నేడు స్వాతంత్ర సమరయోధులు కాగా, ప్యూడల్ వ్యవస్థను తుదముట్టించిన నాటి సమరయోధుల చరిత్ర పాఠ్యాపుస్తకాలలో లేకుండా కుట్రలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కమ్యూనిస్టులంతా ఏకం కావాలని ఆయన ఆకాంక్షించారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం జరిగి ఉండకపోతే హైదరాబాద్ సంస్థానం మరో పాకిస్తాన్ అయ్యేదన్నారు. నాటి నిరంకుశ నిజాం రాజు ఆరాచకమైన పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు ఇచ్చిన పిలుపునకు మట్టి మనుషులు ఓ ప్రభంజనమై కదలివచ్చి దోపిడిదారులను తరిమి తరిమి కొట్టారన్నారు. అంతంటి మహాత్తర పోరాటం వారోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తారో లేదో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను భావి తరాలకు అందజేసేందుకు హైదరాబాద్‌లో సృతి వనం నిర్మించాలన్నారు.
ఆకట్టుకున్న ప్రజానాట్యమండలి ఆట పాట మాట
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధర్యంలో నిర్వహించిన కళాకారుల ఆట, పాట, మాట ఆకట్టుకుంది. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను స్మరిస్తూ ఆలాపించిన గీతాలు సభికుల్లో ఉత్తేజాన్ని నింపాయి. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా నేతృత్వంలో వివిధ కళాకారులు తమ ఆట పాటలతో హోరేత్తించారు.