విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప
అనుకూలంగా 106… వ్యతిరేకంగా 99 ఓట్లు
సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు రెబల్ ఎంఎల్‌ఎలు
బెంగళూరు: కర్నాటకలో బిఎస్ యడియూరప్ప సారథ్యంలో మూడురోజులుగా కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గింది. విశ్వాస తీర్మానంపై మూజువాణి ఓటింగ్ సునాయాసంగా ముగిసింది. బిజెపి కి ఉన్న 105 మందితో పాటు ఓ స్వతంత్ర ఎంఎల్‌ఎతో కలుసుకుని మొత్తం బలం 106కి చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 104 కంటే రెండు ఓట్లను ఎక్కువగా సాధించి బలపరీక్షలో నెగ్గింది. ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విజయం సాధించిందని ఒక్క మాట తీర్మానాన్ని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. అనంతరం సిఎం యడియూరప్ప సభలో సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల విజయమన్నారు. సభ సమావేశం అరగంట జరిగిందో లేదో… యడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గాక స్పీకర్ తన రాజీనామా ప్రకటించారు. బిజెపి తనపై అవిశ్వా తీర్మానాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తోందన్న వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్పీకర్ తన రాజీనామాను ప్రకటించారని సమాచారం. ‘నేను నా బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా…రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నా’ అని చెప్పిన రమేశ్ కుమార్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ కృష్టా రెడ్డికి అందజేశారు. ‘నా సామర్థ్యం మేరకు కార్యాలయం హుందాతనాన్ని పరిరక్షించాను’ అని కూడా కుమార్ చెప్పారు. విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముండు యడియూరప్ప మాట్లాడుతూ ‘ప్రతీకార రాజకీయాలకు’ పాల్పడను, క్షమించడం, మరచిపోవడం అనేదే తమ సిద్ధాంతమని అన్నా రు. ‘ప్రజల కోరిక మేరకే నేను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాను’ అని యడియూరప్ప చెప్పారు. రాష్ట్రం కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిలో తాను బాధ్యతలు చేపడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. విపక్షం కూడా తనకు సహకరించాలని ఆయన కోరారు. ఇదిలావుండగా సిఎల్‌పి నాయకుడు సిద్దరామయ్య ‘యడియూరప్ప ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం, అనైతికం’ అన్నారు. అంతేకాక ఈ ప్రభుత్వం ఎంత కాలముంటుందో కూడా చెప్పలేమన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘మీకు అనుకూలంగా ప్రజల తీర్పు లేదు’ అని యడియూరప్పను ఉద్దేశించి సిద్దరామయ్య అన్నారు. ‘మీరెంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూస్తాను… పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేయలేరని నేననుకుంటున్నాను’ అని కూడా ఆయనతో చెప్పా రు. పరిపాలన యంత్రాంగం కుప్పకూలినందునే గత ప్రభుత్వం పడిపోయిందన్న యడియూరప్ప అభియోగాన్నిమాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఖండించారు. ‘మీరు ఏరీతిలో అధికారంలోకొచ్చారో దానిపై నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ కుట్ర ద్వా రా మీరు అధికారంలోకి వచ్చారు. మా పాలనా యంత్రాంగం ఏవిధంగా కుప్పకూలిందో వివరించండి. మీ అభియోగాలన్నీ నిరాధారమైనవి’ అని కు మారస్వామి చెప్పారు. మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్‌ను కోరుతూ ప్రవేశపెట్టిన వినిమయ బిల్లును సభ ఆమోదించింది. ఆర్థిక బిల్లు(వినిమయ బిల్లు)ను వెంటనే ఆమోదించాలి, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులకు కూడా నిధులు డ్రా చేయలేమని యడియూరప్ప ఆదివారమే చెప్పా రు.