సాగు చట్టాలపై ఎగసిపడిన ప్రజాగ్రహం
బలగాల మోహరింపు… డ్రోన్ల పహరానూ పట్టించుకోని ఉద్యమకారులు
దేశవ్యాప్తంగా ‘చక్కాజామ్’ గ్రాండ్ సక్సెస్
న్యూఢిల్లీ/ చండీగఢ్: కేంద్రం ఆమోదించిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుతో యావత్ దేశం మూడు గంటలపాటు స్తంభించిపోయింది. రైతు ప్రయోజనాలను దెబ్బకొడుతున్న ఈ నల్ల చట్టాలపై ప్రజాగ్రహం ఎగిసిపడింది. బలగాల మోహరింపులు, డ్రోన్ల పహారాలు నిరసనకారులను అడ్డుకోలేకపోయాయి. వారి ఆత్మవిశ్వాసాన్ని, అకుంఠిత దీక్షను దెబ్బతీయలేకపోయా యి. రైతు సంఘాలు, వామపక్షాలు సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సమాఖ్యలు, ఆందోళనకు మద్దతునిస్తున్న అన్ని వర్గాలు ఒక్కటిగా నిలవడంతో, ‘చక్కా జామ్’ కార్యక్రమం విజయవంతమైంది. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డగించి, అరెస్టు చేసి, బలవంతంగా తరలించే ప్రయత్నాలు చేసినప్పటికీ, పోలీస్‌లు, భద్ర తా బలగాలేవీ రాస్తారోకోను సమర్థంగా అడ్డుకోలేక పోయాయి. సుమారు రెండున్నర నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం ‘చక్కా జామ్’కు పిలుపునివ్వగా, దేశవ్యాప్త మూడు గంటల పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో రహదారులు స్తంభించిపోయాయి. అడ్డంకులను అధిగిమస్తూ, ఈ కార్యక్రమం ఘనంగా విజయవంతమైంది. సాగు చట్టాలపై నిరసన వ్యక్తమైంది. ఢిల్లీ సరిహద్దుల్లో 50,000 భద్రతా బలగాలను దించినప్పటికీ, డ్రోన్లతో పహరా కాసినప్పటికీ పట్టించుకోకుండా రైతులు రెట్టించిన ఉత్సాహంతో రాస్తారోకో నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. కాగా, భారీ భద్రతను ఛేదించుకుని దేశ రాజధానిలోకి ప్రవేశించిన దాదాపు 50 మంది ఉద్యమకారులను షహీదీ పార్కు దగ్గర నిర్బంధించారు. భద్రత పెంచడంతో పాటు ప్రధాన నిరసన స్థలాలైన సింఘు, ఘాజీపుర్, టిక్రీ, వాటి పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరికొంత మంది నిరసనకారులను కూడా పోలీస్‌లు కొంత సమయం వరకు నిర్బంధంలో ఉంచారు. కాగా, ప్రధాన నిరసన రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలే కాకుండా మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఉద్యమకారులు ట్రాఫిక్‌ను నిలువరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకపోవడం గమనార్హం.
హోరెత్తిన పంజాబ్, హర్యానా
ఇక పంజాబ్, హర్యానాల్లో వివిధ ప్రదేశాల్లో నిరసనలు, రహదారి దిగ్బంధనలు కొనసాగాయి. రైతులు నినాదాలు హోరెత్తించారు. తమ ట్రాక్టర్లను ట్రాలీలతో సహా రోడ్ల మధ్య నిలిపి ఉంచారు. చండీగఢ్ జిరాక్‌పుర్, అమృత్‌సర్ పఠాన్‌కోట్, తర్నతరన్ కపుర్తలా, ఫిరోజ్‌పుర్ ఫజిల్కా, ముక్తసర్ కోట్కాపురా, బఠిండా చండీగఢ్, లూధియానా జలంధర్, పంచ్‌కులా పింజోర్, అంబాలా చండీగఢ్ జాతీయ రహదాలరులను రైతులు దిగ్బంధించారు. కుండ్లి మనేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై మైకుల ద్వారా నినాదాలను హోరెత్తించారు. త్రివర్ణ పతాకాలను ఎగరవేసిన ట్రక్ ట్రాక్టర్లపైకి ఎక్కిన జనసందోహం, బిగ్గరగా రైతు గీతాలను ఆలపించారు. రోడ్డుపై బైఠాయించిన రైతులకు బిస్కిట్లు, పళ్లు పంపిణీ చేశారు. రోడ్డుపైకి వచ్చిన వారికి వెనక్కి వెళ్లాలని నిరసనకారులు విజ్ఞప్తిచేశారు. ఎవ్వరికీ అసౌకర్యం కలిగించ వద్దనే కేవలం మూడు గంటల రాస్తారోకోకు పిలుపునిచ్చాం అని ఓ రైతు పేర్కొన్నారు. రాజస్థాన్‌లో గంగానగర్, హనుమాన్‌గఢ్, ధోల్‌పుర్, ఝాలావర్ లాంటి ఎన్నో ప్రదేశాల్లో జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులను రైతులు దిగ్బంధనం చేశారు.
ఇతర ప్రాంతాల్లోనూ సంఘీభావం
చక్కా జామ్‌కు మద్దతుగా కొన్నిరాష్ట్రాల్లో వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు కూడా నిరసనలు నిర్వహించాయి. మహారాష్ట్రలోని కరాడ్, కొల్హాపుర్ నగరాల్లో రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ భార్య సత్వశీలా చవాన్‌తో సహా కనీసం 40 మంది నిరసనకారులను నిర్బంధించారు. తెలంగాణలో కూడా రాస్తారోకోలో రైతులో జత కలిసిన ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక కురుబూరు శాంతాకుమార్ ఆధ్వర్యంలో వివిధ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కర్నాటకలోనూ చక్కా జామ్‌కు సంఘీభావంగా వివిధ ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధనం చేశారు. బెంగళూరు, మైసూరు, కోలార్, కొప్పల్, బాగలకోటె, తుమకూరు, దావణగెరె, హసన్, మంగళూరు, హవేరీ, శివమొగ్గ, చిక్కబళ్లాపుర తదితర ప్రదేశాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో కొంతమందిని పోలీస్‌లు అరెస్టు చేశారు. కర్నాటకకు చెందిన కేంద్రమంత్రి సదానంద గౌడ నిరసనలను ఖండించారు.
రైతులను రానీయకపోతే మోడీనీ రానీయం
చక్కా జామ్ పిలుపునకు తమిళనాడు రైతులు కూడా సంఘీభావం ప్రకటించారు. రాజధాని నగరం చైన్నై, ఇంకా ఇతర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. తమిళనాడు ఆల్ ఫార్మర్స్ అసోసియేషన్ సమన్వయ సంఘం అధ్యక్షుడు పి.ఆర్.పాండియన్ మాట్లాడుతూ, ‘ఇదంతా రైతులకు న్యాయం జరిగేందుకే, రాజకీయ ప్రయోజనాలకో లేదంటే సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగించేందుకో కాదు’ అన్నారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలు తెచ్చారని, వాటిని రద్దు చేయాలని పాండియన్ విజ్ఞప్తిచేశారు. రైతులను ఢిల్లీలోకి రానివ్వకపోతే, తమిళ రైతులు ఆయనను తమ రాష్ట్రానికి రానివ్వరని ఆయన పేర్కొన్నారు. ఈ నెలలో ప్రధానమంత్రి తమిళనాడులో కొన్ని పథకాలను ప్రారంభించడం, ఎన్నికల ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. తిరుచిరాపల్లిలో జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం అధ్యక్షుడు పి.అయ్యకణ్ను నాగళ్లతో ర్యాలీ నిర్వహించడం విశేషం.
భయంతో భయపెడుతున్నారు…
ఇక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రైతు చట్టాలు దేశానికి ‘చెడుపు చేసేవి’ అని విమర్శించారు. అన్నదాతల శాంతియుత సత్యాగ్రహం దేశ ప్రయోజనాల కోసమే అని పేర్కొన్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా రైతుల అంశంపై కేంద్రం వైఖరిపై విరుచుకుపడ్డారు. రైతుల నిరసన స్థలాల్లో ఉంచిన బహుళ వరసల బారికేడ్లను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అందులో ‘భయం అనే గోడతో మమ్మల్ని ఎందుకు జడిపిస్తున్నారు’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. చక్కా జామ్‌కు మద్దతు ఇస్తున్నామని, రైతులతో భుజం భుజం కలిపి నడుస్తామని కాంగ్రెస్ శుక్రవారం స్పష్టంచేసింది.
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు 70 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త చట్టాలు కనీస మద్దతు ధరకు గండికొట్టి, తమను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవి రైతులకు మెరుగైన అవకాశాలను తీసుకువస్తాయని, వ్యవసాయంలో కొత్త సాంకేతికతను ప్రవేశపెడతాయని ప్రభుత్వం వాదిస్తోంది.
స్తంభించిన భారత్
RELATED ARTICLES