-ట్రంప్ సర్కారుకు ఆర్థిక కష్టాలు
-ఫెడరల్ వ్యయ బిల్లుకు మోకాలడ్డిన డెమోక్రాట్లు
-మెక్సికో సరిహద్దు గోడకు అడ్డంకులు
-ప్రతినిధుల సభ,సెనెట్లు వాయిదా
-పలు శాఖలకు నిధుల చెల్లింపుల నిలిపివేత
-క్రిస్మస్ పండగ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులే
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. నిధుల మంజూరు లేక ట్రంప్ సర్కార్ పాలన వ్యవహారాలు స్తంభించిపోయాయి. అమెరికా దేశాల సరిహద్దులో గోడను నిర్మించేందుకు ప్రభుత్వానికి అవసరమైన నిధులను కాంగ్రెస్ మంజూరు చేయకపోవడంతో శనివారం ఖజానా చెల్లింపులు నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డోనార్డ్ ట్రంప్ మెక్సికో సరిహద్దులో వలసవాదులను నియంత్రించేందుకు అవసరమైన నిధుల మంజూరును కోరుతూ.. ఆ దేశ కాంగ్రెస్‌లో ఫెడరల్ వ్యయ బిల్లును ప్రవేశపెట్టగా.. దాన్ని డెమెక్రాట్లు సెనెట్‌లో అడ్డుకున్నారు. అంతేకాక అమెరికా కాంగ్రెస్‌కు సంబంధించిన ప్రతినిధులు సభ, సెనెట్లు శుక్రవారం వాయిదా పడ్డాయి. దీంతో పాలన వ్యవహారాలకు నిధుల కేటాయింపులు లేక ఆ దేశంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 12:01 గంటల నుంచే ఆ దేశంలోని పలు కీలక శాఖల పాలన వ్యవహారాలు నిలిచిపోయాయి. ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు క్రిస్మస్ పర్విదినాన్ని పురస్కరించుకొని.. ప్రభుత్వం జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందక ఇళ్లకే పరిమితం కానున్నారు. నాసా ఉద్యోగులు కూడా విధులు నిర్వహించకుండా ఇళ్లలోనే ఉండనున్నారు. అంతర్గత భద్రత, న్యాయ, వ్యవసాయ విభాగాలకు చెందిన ఉద్యోగులు సైతం విధులు నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. ఇక జాతీయ పార్కులను ప్రభుత్వం తెరిచే ఉంచనున్నప్పటికీ… వాటి పర్యవేక్షణ బాధ్యతలను చూసే ఉద్యోగులు విధులకు హాజరయ్యే పరిస్థితి లేదు. దీంతో ఆయా విభాగాలకు సంబంధించిన కనీస నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం చూడలేడని స్థితి ఏర్పడింది. అయితే దేశంలోని పలు శాఖల పాలన వ్యవహారాలు నిలిచిపోయినప్పటికీ… కొన్ని శాఖలు మాత్రం తమ విధులను అందించనున్నాయి. మిలటరీ, ఆరోగ్య, మానవ సంబంధిత శాఖలకు నిధులు పుష్కలంగా ఉన్నాయి. ఈ శాఖలకు సెప్టెంబర్ 2019 వరకు నిధుల కొరత లేకపో వడంతో… ఆయా మంత్రిత్వ శాఖలు తమ విధులను యధాతధంగా నిర్వహించనున్నాయి.
పరిస్థితి త్వరలోనే సమసిపోతుంది: ట్రంప్
అమెరికాలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్లో స్పందించారు. అమెరికాలో పాలన వ్యవహారాలు స్థంభించడానికి డెమోక్రాట్లే కారణమని ఆరోపించారు. వారు సెనెట్‌లో తమకు సహకరించకపోవడంతోనే దేశంలో ఇలాంటీ స్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే దేశంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులు త్వరలోనే సద్దుమణు గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.