పౌరసత్వ సవరణ చట్టం
సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపేలా స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఆ చట్టం మతపరమైన పీడనకుగురై పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడిన ముస్లిమేతరులకు భారత పౌసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్లపై జనవరి రెండో వారంలోగా స్పంద న ఇవ్వాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణను 2020 జనవరి 22కు వాయిదా వేసింది. సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అసోం గణ పరిషత్, మక్కల్ నీది మయం(కమల్‌హాసన్‌పార్టీ), పీస్ పార్టీ, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, న్యాయవాది ఎంఎల్ శర్మ, జామియత్ ఉలామా ఎన్‌జిఒ సంస్థలు రిహాయి మంచ్, సిటిజెన్స్ ఎగనెస్ట్ హేట్ సహా పలు రాజకీయ పార్టీలు, వ్యక్తులు, న్యాయవిద్యార్థులు, సంస్థలు సుప్రీంకోర్టులో దాదాపు 59 పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పౌరసత్వ సవరణ చట్టం లక్ష్యం, విషయాల ను సామాన్య ప్రజలను తెలపాలని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సమర్పించిన పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఆడియో వీడియోల ద్వారా పౌరసత్వ చట్టం వివరాలను ప్రజల్లో జాగృతం చేయాలని కేంద్రానికి ప్రాతినిధ్యం వహించిన అటారీ జనరల్ కెకె వేణుగోపాల్‌ను ధర్మాసనం కోరిం ది. ఆ సూచనను వేణుగోపాల్ అంగీకరించి ప్రభుత్వం ఆ మేరకు కావలసింది చేస్తుందని తెలిపారు. విచారణ సమయంలో కొందరు పిటిషనర్ల తరఫున వాదించిన కొద్ది మంది న్యాయవాదులు కొత్త చట్టాన్ని అమలుపరచకుండా స్టే ఇవ్వాలని కోరారు. దానికి అటార్నీ జనరల్ వ్యతిరేకత తెలిపారు. ప్రకటనపై స్టే ఇవ్వడం కుదరదని ఇప్పటికే నాలుగు తీర్పులు వచ్చాయన్న విషయాన్ని తెలిపారు. దాంతో ధర్మాసనం స్టే ఇవ్వబోవడంలేదని స్పష్టంచేసింది. తదుపరి విచారణ 2020 జనవరి 22న ఉండగలదని పేర్కొంది. ఒక పక్షానికి ప్రాతినిధ్యం వహించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ పౌరసత్వ సవరణ చట్టం ఇంకా అమలులోకి రానందున స్టే కోరాల్సిన అవసరంలేదన్నారు. పైగా ఇంకా ఆ చట్టం కింద ఇంకా నియమాలు రూపొందించాల్సి ఉందని కూడా పేర్కొన్నారు. ఇదిలావుండగా పిటిషనర్లలో ఒకటైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ చట్టం సమానత్వ ప్రాథమిక హక్కుకు విరుద్ధంగా ఉందని, మతం ఆధారంగా ఓ వర్గాన్ని వేరుగా ఉంచుతోందని తన పిటిషన్‌లో వాదించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫు న్యాయవాది పల్లవి ప్రతాప్ పౌరసత్వ చట్టంపై తాత్కాలిక స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశారు. పౌరసత్వ(సవరణ)బిల్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 12న ఆమోదం తెలుపడంతో అది చట్టంగా మారింది. మరోవైపు ఈ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో మొదలైన ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు పాకాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో విద్యార్థులు గత ఆదివారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. అటు సీలంపూర్‌లోనూ స్థానికులు నిరసనకు దిగి పోలీసులపైకి రాళ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కాగా, ఆందోళనల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు.
స్టే ఇవ్వలేం
RELATED ARTICLES