HomeNewsBreaking Newsస్టాలిన్‌తో కెసిఆర్‌ భేటీ

స్టాలిన్‌తో కెసిఆర్‌ భేటీ

తాజా రాజాకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చ
ప్రజాపక్షం/హైదరాబాద్‌  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం నాడు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలిశారు. వారిరువురు మధ్య తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే అంశంలో వ్యవహరించాల్సిన తీరు, కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ఉమ్మడి ఏజెండా తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. అలాగే యాదాద్రి ఆలయ పునః ప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సిఎం కెసిఆర్‌ ఆహ్వానించారు. మార్చి 22న సుదర్శన యా గంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి వరకు ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకోవాలని ఆయన స్టాలిన్‌ను కోరినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ భేటీలో దేశ రాజకీయాలతో పాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సిఎంలు చర్చించినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి, బిజెపి నేతల తీరును కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. కేంద్రంలో బిజెపి వ్యవహరిస్తున్న తీరు, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల తీరు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీల పరిస్థితులపై కూడా కెసిఆర్‌, స్టాలిన్‌ మధ్య చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. బిజెపేతర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కేంద్రం వివక్షత, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ముఖ్యభూమిక, కొత్త రాజకీయ కూటమి ఇలా వారిద్దరూ పరస్పర అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. అలాగే గోదావరి, కావేరి నదుల అనుసంధానం సైతం చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తమిళనాడు డిఎంకె పార్టీ సంస్థాగత నిర్మాణం, ఆ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలను కూడా సిఎం కెసిఆర్‌ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
కుటుంబసమేతంగా..
కాగా స్టాలిన్‌ నివాసానికి వెళ్ళిన సిఎం కెసిఆర్‌ కుటుంబ సమేతంగా వెళ్ళారు. కెసిఆర్‌కు, ఆయన సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కెటి.రామారావు,ఎంపి సంతోష్‌కుమార్‌, కెటిఆర్‌ సతీమణి, పిల్లలకు సిఎం స్టాలిన్‌ సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం కెసిఆర్‌ కుటుంబంతో స్టాలిన్‌, ఆయన కుమారుడు, డిఎంకె ఎమ్మెల్యే ఉదయనిధి, పరిశ్రమల మంతి తంగమ్‌ తెన్నరసు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఉదయనిధితో కెటిఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు.
అత్యంత ఆసక్తి
తమిళనాడు సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాలిన్‌ను సిఎం కెసిఆర్‌ కలువడం ఇదే మొదటిసారి. పైగా బిజెపి వ్యతిరేకంగా దూకుడు పెంచిన టిఆర్‌ఎస్‌ తాజాగా తమిళనాడు సిఎంతోభేటీ కావడంతో రాజకీయంగా అత్యంత ప్రధాన్యత సంతరించుకుంది. వారి మధ్య రాజకీయ పరంగా ఎలాంటి చర్చలుజరిగిందనే విషయమై ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సిఎం మమత బెనర్జీ ఎన్‌సిపి అధినేత శరద్‌పవర్‌ను కలువడం, ప్రస్తుతం యుపిఎ ఎక్కడుందని వ్యాఖ్యానించడం, బిజెపి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం చేసే పరిస్థితి లేదని పలు సందర్భాల్లో మమత బెనర్జీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళనాడు సిఎం స్టాలిన్‌ కాంగ్రెస్‌ కూటమితోనే కొనసాగడం, ఈ క్రమంలో సిఎం కెసిఆర్‌ స్టాలిన్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, స్టాలిన్‌ ప్రతిపక్షంలో ఉండగా సిఎం కెసిఆర్‌ 2018లో చెన్నైకి వెళ్ళి ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments