తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచి చరిత్ర
రాజ్‌కోట్: సౌరాష్ట్ర రంజీ జట్టు నయా రికార్డు సృష్టించింది. సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. 2019-20 సీజన్‌లో భాగంగా సౌరాష్ట్ర, బెంగాల్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కారణంగా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనున్న విషయం తెలిసిందే. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. బెంగాల్ 381 రన్స్ మాత్రమే చేసింది. ఫలితం తేలకపోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (44 పరుగులు) సాధించిన సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. శుక్రవారం చివరి రోజు ఆటలో బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌లు డ్రా అయిన పక్షంలో విజేతను తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ప్రకటిస్తారు.
ఆసక్తికరంగా సాగినా..
రంజీ ట్రోఫీని ఎవరు గెలుస్తారనేది గురువారం వరకూ ఆసక్తికరంగా ఉంది. గురువారం ఆట ముగిసే సమయానికి బెంగాల్ 6 వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. దాంతో శుక్రవారం ఆటలో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోరును బెంగాల్ అధిగమిస్తుందనుకున్నారు. కానీ సౌరాష్ట్ర బౌలర్లు చెలరేగడంతో 27 పరుగుల వ్యవధిలో బెంగాల్ నాలుగు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ ఆటగాడు మజుందార్ (63) ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత అమాబ్ నంది (40 నాటౌట్) అజేయంగా నిలిచినా మిగతా వారు సహకరించకపోవడంతో బెంగాల్‌కు ఆధిక్యం దక్కలేదు. దాంతో అక్కడే సౌరాష్ట్రకు టైటిల్ ఖాయమైంది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో సౌరాష్ట్ర ట్రోఫీని ముద్దాడింది. టైటిల్ కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న సౌరాష్ట్రకు ఎట్టకేలకు జయదేవ్ ఉనద్కత్ నేతృత్వంలోని జట్టు ట్రోఫీని అందించింది. టైటిల్ గెలిచిన ఆనందంలో సౌరాష్ట్ర ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. 1989- సీజన్‌లో బెంగాల్ టైటిల్ సాధించింది. 30 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలువాలన్న బెంగాల్ ఆశ నెరవేరలేదు.
ఇన్నింగ్స్ వివరాలు..
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్:425
బెంగాల్ తొలి ఇన్నింగ్స్:381
సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్:105/4
సౌరాష్ట్ర సరికొత్త రికార్డు
RELATED ARTICLES