HomeNewsBreaking Newsసౌరజ్వాలల వల్లే మండుటెండ

సౌరజ్వాలల వల్లే మండుటెండ

ప్రజాపక్షం/హైదరాబాద్‌/న్యూఢిల్లీ భానుడు బుధవారం భగభగా మండాడు. ఉదయం 9.27 నిమిషాలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో సౌరజ్వాలలతో విరుచుకుపడ్డాడు. సమాచార ఉపగ్రహాలు, జిపిఎస్‌ వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో ఈ సౌరజ్వాలలు ఉన్నాయని కోల్‌కతా కేంద్రంగా పనిచేసే సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సైన్సెస్‌ ఇండియా- సెస్సీ వెల్లడించింది. ‘సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్‌12992 నుంచి ఉదయం 9.27 గంటలకు ఎక్స్‌2.2 తరగతి సౌరజ్వాలలు వెలువడ్డాయి. భారత్‌, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో దీని ప్రభావం ఉంది. హైఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు స్తంభించిపోవడం, ఉపగ్రహాలు, జిపిఎస్‌ పనితీరులో లోపాలు, ఎయిర్‌లైన్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ ప్రభావితం కావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సెస్సీ సమన్వయకర్త, కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ దివ్యేందు నంది వివరించారు. దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని తెలిపారు. సౌర వ్యవస్థ నుంచి ఒక్కసారిగా శక్తి వెలువడడాన్ని సౌరజ్వాలలు అంటారు. వీటి వల్ల రేడియా సిగ్నళ్లు, విద్యుత్‌ గ్రిడ్స్‌, నేవిగేషన్‌ సిగ్నల్స్‌ ప్రభావితమై.. విమానాలకు, వ్యోమగాములకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇలాంటి సౌరజ్వాలలు వస్తాయని ఏప్రిల్‌ 18నే దివ్యేందు బృందం అంచనా వేసింది. భూకంపాల తరహాలో సౌరజ్వాలలనూ నాసా తీవ్రతను బట్టి వర్గీకరిస్తుంది. ఏ నుంచి మొదలుపెట్టి బి, సి, ఎం, ఎక్స్‌ వంటి తరగతులుగా విభజించింది. బుధవారం వచ్చిన ఎక్స్‌ తరగతి సౌరజ్వాల.. అన్నింటికన్నా తీవ్రమైనది. ఇంకా చెప్పాలంటే ఎం తరగతి సౌరజ్వాల కన్నా 10 రెట్లు, సీ వర్గం సౌరజ్వాల కన్నా 100 రెట్లు తీవ్రతతో ఎక్స్‌ క్లాస్‌ సౌరజ్వాల ఉగ్రరూపం చూపిస్తుంది.
తెలంగాణలో భానుడు ప్రతాపం
భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. బయట అడుగు వేస్తేనే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. దీంతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు. ప్రధానంగా మధ్యాహ్నాం సమయంలో రోడ్లపై వచ్చే వారి సంఖ్య విపరీతంగా తగ్గింది. వడగాల్పుల భయంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలూ అసాధారణంగా పెరుగుతున్నాయి. కొమురం బీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాలలో అత్యధికంగా 44.9డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌, నిజామాబాద్‌,జిల్లా జక్రాన్‌పల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా బోరాజ్‌, కొమురం బీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కీరమెర్రీ,నిజామాబాద్‌లోని పల్దాలో 44.7 డిగ్రీలు, నిజామాబాద్‌ జిల్లా నిజామాబాద్‌ నార్త్‌లో 44.6 డిగ్రీలు, హనుమకొండ జిల్లాలో శ్యాయంపేట,ధర్మసాగర్‌, జయశంకర్‌ జిల్లా రేగొండ, నిజామాబాద్‌ జిల్లాలోని లక్మపూర్‌ ప్రాంతాల్లో 44.5డిగ్రీలు, యాదాద్రి భువనగిరిజిల్లాలోని వెంకిర్యాలలో 44.2 డిగ్రీలు, జనగాం జిల్లా ఘన్‌పూర్‌ స్టేషన్‌, యాదాద్రి భువనగిరిలోని బిజిలాపూర్‌లో 44.1 డిగ్రీలు, మహబూబాబాద్‌ జిల్లా అయ్యగిరిపల్లెలో 44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments