65 బంతుల్లో టి20 సెంచరీ
ఇది కోహ్లీ, గేల్, రోహిత్‌లకూ అసాధ్యం
వెల్లింగ్టన్: అంతర్జాతీయ టీ20ల్లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. దిగ్గజ క్రికెటర్లు బ్రెండన్ మెకల్లమ్, క్రిస్ గేల్, కోహ్లి, రోహిత్ శర్మలకు సాధ్యం కాని ఘనతను న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ సాధించింది. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో సోఫీ (65 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 105) సెంచరీతో చెలరేగింది. అయితే వరుసగా యాభైకి పైగా పరుగుల్ని సాధించడం సోఫికి ఐదోసారి కాగా.. ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఫలితంగా టీ20ల్లో ఈ ఘనత సాధించిన పురుషుల, మహిళల కేటగిరీల్లో తొలి క్రికెటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. తాజా మ్యాచ్‌లో 105 పరుగులు సాధించిన డివైన్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో 54 నాటౌట్, 61, 77 పరుగులు చేసింది.ఇక మిథాలీ రాజ్, బ్రెండన్ మెకల్లమ్‌లు వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలను మాత్రమే సాధించగా, ఆ రికార్డునే డివైన్ బద్దలు కొట్టింది. సోఫీ సెంచరీ ధాటికి 69 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ మహిళలు.. ఒక్క మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకున్నారు. ఈ మ్యాచ్‌లో కివీస్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేశారు. సుజీబెట్స్‌తో కలిసి డివైన్ రెండో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ఇది న్యూజిలాండ్‌కు అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా మహిళలు 17 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటై ఓటమిపాలయ్యారు.
సోఫీ.. సూపర్!
RELATED ARTICLES