కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశంలో సోనియా, రాహుల్‌గాంధీ
రాఫెల్ ఒప్పందం మాత్రమే కాదు, రక్షణ బలగాల నుంచి ‘పద్ధతి ప్రకారం దోపిడీ’
ప్రతి ఒప్పందంలోనూ దోచుకున్నారు
న్యూఢిల్లీ: తన బడాయిలో ఒక్కదానిపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిలుచోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. సైద్ధాంతిక పోరులో బిజెపిపై కాంగ్రెస్ విజయం సాధిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్యుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విష యం చెప్పారు. రాఫెల్ ఒప్పందం మాత్రమే కాదు. అది రక్షణ బలగాల నుంచి ‘పద్ధతి ప్రకారం దోపిడీ’ అని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి ఒప్పందంలో ఇదే విధంగా దోచుకున్నారన్నారు. ఒక వ్యక్తి ఎంపిక చేశాక మొత్తం విధానాలనే ఉల్లంఘించేశారని రాహుల్ ఆరోపించారు. ‘రాఫెల్ ఒప్పందంలో రోజుకో కొత్త కథనం వెలువడుతోంది..నేటి హిందు దినపత్రికను చూడండి. కొత్త ఒప్పందధర, త్వరగా యుద్ధవిమానాల అందజేత కోసం చేసిందని వాదిస్తున్నారు. ఒప్పందాన్ని ముగించేశారు’ అన్నారు. ‘మోడీ బడాయిలో ఒక్కటి నిలవడంలేదు. ఆయన బడాయి అంతా ఇప్పుడు పోయింది. దీనికి రాహుల్ కారణం కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు, మీరందరు కారణం’ అని రాహుల్ శాసనకర్తలను ఉద్దేశించి చెప్పారు. ‘ప్రతి పార్టీ భారత సమాజంలోని ఏదో ఒక ప్రాంతం కోసం మాట్లాడుతుంది. కానీ మొత్తం దేశం గురించి మాట్లాడే పార్టీ ఒకటే ఒకటుంది..అది కాంగ్రెస్ పార్టీ. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి దేశాన్ని విభజించి ఒక ప్రాంతం గురించే మాట్లాడుతుంటాయి. రాజ్యాంగ సంస్థలను కాపాడ్డం విధిగా భావించే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ మాత్రమే’ అని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శాసనకర్తల నిలకడను ఆయన ప్రశంసించారు. ‘బిజెపిలో సీనియర్ నాయకులెవరినీ మాట్లాడనివ్వరు. లోక్‌సభలో బిజెపి నాయకుడొకరే మాట్లాడతారు. అది నరేంద్ర మోడీ. ఒకవేళ ఎవరైనా ఆ పార్టీ నాయకులు మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ఏమనుకుంటారో, ఏమంటారో అని ఆలోచిస్తారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టులపై దాడులు జరుగుతున్నాయి’ అని రాహుల్ చెప్పారు. ‘మోడీ అంటే ఏమిటో, ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటో సామాన్యుడు గుర్తిస్తున్నాడు. వారు చెప్పినట్లు నడుచుకోవడంలేదు. వారు వాస్తవంలో భారత సిద్ధాంతంపైనే దాడి చేస్తున్నారు. భారతీయ సిద్ధాంతాన్ని కాపాడేదంటూ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే’ అన్నారు. ‘లోక్‌సభలో కాంగ్రెస్‌కు కేవలం 40 సీట్ల బలమే ఉందని, 280 మంది సభ్యుల బలమున్న ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పేది వినిపించుకోదని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ శాసనకర్తలు ముందుకొచ్చి తమ వాదన వినేలా చేస్తున్నారు’ అని రాహుల్ వివరించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్యుల సమావేశంలో పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్ తదితరులు పాల్గొన్నారు.