రైతు సంఘాల జాతీయ ఐక్యవేదికల పిలుపు
26న జిల్లా కేంద్రాలలో ట్రాక్టర్ ర్యాలీలు
కార్మిక జాతి వ్యతిరేక విధానాలపై
వచ్చే 16న గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా వివిధస్థాయిల్లో ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె సహా వివిధ రంగాల వారీగా సమ్మెకు జాతీయ కార్మిక, కర్షక ఐక్యవేదికలు పిలుపు ఇచ్చాయి. ప్రజల మౌలిక సమస్యలను తప్పుదారి పట్టించి, కార్పొరేట్ శక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధానాలను ఈ వేదికలు తీవ్రంగా వ్యతిరేకించాయి. “సేవ్ డెమోక్రసీ, సేవ్ అవర్ నేషన్, సేవ్ ద పీపుల్” అనే నినాదాలతో కార్మిక సంఘాల ఐక్యపోరాటాలకు కలిసి రావాలని లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు, పౌర సంఘాలకు ఈ రెండు జాతీయ ఐక్యవేదికలు పిలుపు ఇచ్చాయి. బుధవారం ఢిల్లీలో జరిపిన సంయుక్త సమావేశం అనంతరం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యలు, సంస్థల ఐక్యవేదిక (సిటియు) ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈనెల 26వ తేదీన దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన ట్రాక్టర్, ఇతర వాహనాల ప్రదర్శనకు సిటియు ఇప్పటికే మద్దతు ఇచ్చింది. అదేవిధంగా ఈనెల 10 వ తేదీ నుండి 20వ తేదీ వరకూ “జన జాగరణ్” ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దాని కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వ ఉన్మాద దాష్టీకాలను ప్రతిఘటిస్తూ కార్యాచరణ రూపొందించినట్లు వేదిక తెలియజేసింది. రాజకీయ స్వప్రయోజనాలకోసం అత్యంత నీచాతినీచంగా మతోన్మాదాన్ని, వెర్రితలలు వేసే నిర్హేతుకమైన
ఆర్భాటాలను, స్వదేశాధిపత్యాన్ని అత్యంత ప్రమాదకరమైస్థాయిలో మోడీ ప్రభుత్వం రెచ్చగొడుతున్నదని, దీనిని ప్రతిఘటించి ప్రజల నిజమైన జీవన సమస్య ఎజెండాను దేశం ముందుకు తీసుకువచ్చి పరిష్కారాలు సాధించడమే కార్మిక సంఘాల జాతీయ ఐక్యవేదికల ప్రధాన లక్ష్యమని సమావేశం ప్రకటించింది. పలు చట్టాలను, శాసనాలను అడ్డంపెట్టుకుని విధాన ప్రకటనలు చేస్తూ జాతి ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ధనికులు, ప్రైవేటు పెట్టుబడిదారులకు దోచిపెడుతూ కార్మికులు, కర్షకుల జీవితాలను బలి పెడుతున్నదని ప్రకటన పేర్కొంది. 2020 నుండి ఇప్పటివరకూ నాలుగు సంవత్సరాలుగా కార్మిక ఐక్యవేదికలు దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలపై చేస్తున్న పోరాటాలను ఈ సమావేశంలో సమీక్షించాయి. ప్రజాస్వామ్యం, సెక్యులరిజ, సోషలిజం వంటి దేశ మౌలిక సూత్రాలకు ఆలంబనగా ఉన్న భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికే ఈ సమైక్య ప్రతిఘటన కొనసాగుతోందని సమావేశం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియతృత్వ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు,యువకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పౌర సంఘాలు సహా విభిన్న వర్గాలకు చెందిన ప్రజా బాహుళ్యం ఈ పోరాట కార్యాచరణకు కలిసి రావాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం గడచిన పదేళ్ళుగా విరామం లేకుండా అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఈ రెండు సంయుక్త జాతీయ వేదికలూ ఎక్కడికక్కడ ప్రాంతీయంగా, జాతీయస్థాయీలోనూ కొనసాగిస్తున్న పోరాట ఫలితాలను సమీక్షించారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపట్ల ఈ సంయుక్త సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలలో, వివిధ సాంఘిక ఉద్యమాలలో ఉన్న భావసారూప్యతగల విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, మహిళలు జాతీయస్థాయిలో జరుగుతున్న ఈ సంయుక్త ప్రచార కార్యక్రమంలో కలిసి రావాలని, మద్దతుగా ఉండాలని సమావేశం కోరింది. కార్పొరేట్‌శక్తులు, మతశక్తుల అండదండలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియంతృత్వ విధానాలు అనుసరిస్తున్నదనీ, ఆ ప్రభుత్వాన్ని తొలగించి ఆ స్థానంలో ప్రజానుకూల, కార్మిక శ్రేయస్సును, రైతుల బాగోగులను కోరుకునే జనరంజకమైన ప్రభుతాన్ని స్థాపించాలని సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆ సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశాయి.
సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్
RELATED ARTICLES