కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
నవంబరు 10న ఫైనల్స్
యుఎఇ వేదికగా టోర్నమెంటు
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు కకావికలమైన క్రీడారంగం మళ్లీ ఊపిరిపోసుకోనున్నది. ప్రపంచంలోనే అత్యంత క్రేజీ క్రికెట్ టోర్నమెంటుగా అవతరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంటుకు రంగం సిద్ధమైంది. బిసిసిఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఈ టోర్నీకి కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. అయితే ఈ టోర్నమెంటు భారత్‌లో కాకుండా విదేశీగడ్డపై అంటే యుఎఇ వేదికగా ఐపిఎల్-13వ సీజన్ జరుపుతామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) చేసిన విజ్ఞప్తికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దాంతో ఐపిఎల్‌కు మార్గం సుగుమం అయ్యింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకూ ఐపిఎల్ నిర్వహణకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో బిసిసిఐ ఊపిరిపీల్చుకుంది. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకున్న బిసిసిఐ.. కేంద్రాన్ని ఒప్పించడానికి ముమ్మర కసరత్తు చేసిన విషయం తెల్సిందే. ఇది ఫలించడంలో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక పాత్ర వహించాడు. ఐపిఎల్ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు (2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యుఎఇలో) ఐపిఎల్ మ్యాచ్‌లు దేశం బయట జరిగాయి. అలాగని ఇది కూడా అంత సులభమే అనుకుంటే పొరపాటు. ఆ టోర్నీలకు ఇప్పటి టోర్నీకి చాలా తేడా. ఆటగాళ్లు, సిబ్బంది రక్షణ కత్తిమీద సాములా తయారైంది. అయితే ఇంగ్లాండ్‌లో సాఫీగా జరిగిన విండీస్ పర్యటనతో క్రికెటర్లకు ఉత్సాహం వెల్లివిరిసిన విషయం తెల్సిందే. అయితే ఎనిమిది ఫ్రాంచైజీలు ఆడే ఐపిఎల్‌కు విండీస్ టూర్‌కు తేడా వుంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌ఓపీ)లోని నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వచ్చే వారం ఐపిఎల్ మ్యాచ్‌ల తేదీలను ఖరారు చేయనున్నారు. మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య ఎంత గ్యాప్ ఉండాలనేది నిర్ణయించడంతో పాటు డబుల్ హెడర్ మ్యాచ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బిసిసిఐ వెల్లడించింది. కరోనా వైరస్ ప్రబలిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రీడలకు విరామం ఏర్పడింది. అయితే ఫుట్‌బాల్, ఇతర క్రీడలను నెమ్మదిగా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆడటం ప్రారంభించిన తర్వాత వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించి, క్రికెట్‌కు ఊపిరిపోసింది. తాజాగా ఐపిఎల్‌కు అనుమతి లభించడంతో అభిమానుల్లో ఆసక్తి మళ్లీ మొదలైంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో సంక్లిష్టమైన ఈ టోర్నీని ఎలా నిర్వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
సెప్టెంబర్ 19 నుంచి ఐపిఎల్
RELATED ARTICLES