ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ కమాండర్ కాల్చివేత
పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
పింగ్లాన్ ప్రాంతంలో ఎదురు కాల్పులు
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన బలగాలు
ఆర్మీ మేజర్ సహా నలుగురు జవాన్లు, పోలీసు మృతి
ప్రాణాలు కోల్పోయిన ఓ పౌరుడు
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈనెల 14న సిఆర్‌పిఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనలో కీలక పాత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్‌సహా ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోమవారం జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో 16 గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్ ఉగ్రవాదులతో పాటు ఓ ఆర్మీ మేజర్ సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పా రు. బ్రిగేట్ కమాండర్, ఓ లెఫ్ట్‌నెంట్ కల్నల్ , డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సహా తొమ్మిదిమంది ఆర్మీ సిబ్బంది గాయపడ్డారన్నారు. గత వారం జైషే మహ్మద్ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నింపిన వాహనంలో వచ్చి సిఆర్‌పిఎఫ్ బస్సును ఢీకొట్టి ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన ప్రాంతానికి దాదాపు 12 కిలోమీటర్ల ఉన్న పింగ్లాన్ ప్రాంతంలో తాజాగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు, ముగ్గురు జైషే మహ్మద్ టెర్రరిస్టులు, ఒక పౌరుడు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. బలగాలు హతమార్చిన ఉగ్రవాదులను జైషే మహ్మద్ టాప్ కమాండర్, పాకిస్థాన్‌కు చెందిన కమ్రాన్‌గా, స్థానిక ఉగ్రసంస్థ రిక్రూట్ చేసిన హిలాల్ ఆహ్మద్‌గా గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. మూడవ ఉగ్రవాది ఎవరు అనేది గుర్తించాల్సి ఉంది. కాగా, సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో కమ్రాన్ పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఓ సీనియర్ పోలీసు అధికారి స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిలో మేజర్ విఎస్ ధోండియాల్, హవల్దార్ షియోరామ్, సిపాయిలు హరిసింగ్, అజయ్ కుమార్, ఒక హెడ్‌కానిస్టేబుల్ ఉన్నారు. పింగ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారి తెలిపారు. బలగాలు గాలిస్తున్న సమయంలో ఓ ఇంట్లో నక్కి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారని, దీంతో బలగాలు ఎదురు కాల్పులు చేయడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందన్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 14న జరిగిన 2500 మంది జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా వారి కానాయ్‌ని లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడి తాము చేసిందేనని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రకటించుకున్నది.