న్యూఢిల్లీ: సిబిఐ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్నిసుప్రీంకోర్టు తప్పుపట్టడంతో విపక్షాలు కేంద్రం విమర్శలు పెంచాయి. ప్రధాని మోడీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సుప్రీం పక్కన పెట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ప్రధాని అక్రమ ఆదేశాలు ఇచ్చారంటూ సుప్రీంకోర్టు వాటిని పక్కన పెడుతూ ఇలా నిర్ణయం తీసుకోవడం మోడీ విషయంలోనే జరిగిందని, ఇలా జరిగిన తొలి ప్రధాని ఆయనేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ.. సంస్థల సమగ్రతను కోర్టు కాపాడిందనే విషయాన్ని మోడీ గుర్తుంచుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ ఝా పార్లమెంటు ఎదుట విలేకరులతో అన్నారు. కోర్టు తీర్పు ప్రధాని మోడీపై ప్రత్యక్ష నేరారోపణ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను దెబ్బతీసిందన్నారు. రాఫెల్ ఒప్పందంపై విచారణను ఆపేందుకు సిబిఐ డైరెక్టర్‌ను రాత్రికి రాత్రి తప్పిస్తారా అంటూ ట్విటర్లో ప్రశ్నించారు. సుప్రీం తీర్పు ఆలోక్ వర్మకు పాక్షిక విజయం అని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు.
సుప్రీం తీర్పు.. ప్రభుత్వానికి చెంపపెట్టు
RELATED ARTICLES