కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ ఆమోదం
న్యూఢిల్లీ: ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదముద్ర వేశారు. వీరిలో 2027 సెప్టెంబర్‌లో జస్టిస్ బివి నాగరత్న భారతదేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సు ప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34. కాగా ప్రస్తుతం పది ఖాళీలు ఉన్నాయి. తొమ్మిది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేస్తే సర్వోన్నత న్యాయస్థానంలో మరో ఖాళీ ఉండనుంది. ఇక న్యాయమూర్తుల నియామకం గురించి న్యాయశాఖ గురువారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. ఇలా ఉంటే సుప్రీంకోర్టు కొలీజియం గతవారం ముగ్గురు మహిళలు సహా తొమ్మిది పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సుచేసిన విషయం తెలిసిందే. కర్నాటక హైకోర్టు మూడో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్నతోపాటు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, గుజరాత్ ఐదో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేదిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి (62) సెప్టెంబర్ 1న పదవీ విరమణ పొందనున్నారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. వీరు కాకుండా జస్టిస్ సిటి రవికుమార్ (కేరళ హైకోర్టు), జస్టిస్ ఎంఎం సుందరేశ్ (మద్రాస్ హైకోర్టు)కు సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. ఇక సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేశారు. అయితే సుప్రీంకోర్టు బార్ నుంచి నేరుగా న్యాయమూర్తిగా నియమితులైన వారిలో ఈయన ఆరోవారు కావడం విశేషం. వివిధ హైకోర్టులకు చెందిన ప్రధాన న్యాయమూర్తులను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులగా నియమించారు. వారు… జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా (కర్నాటక హైకోర్టు), జస్టిస్ విక్రమ్ నాథ్ (గుజరాత్ హైకోర్టు), జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి (సిక్కిం హైకోర్టు).
తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బివి నాగరత్న!
1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిస్ బివి నాగరత్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇఎస్ వెంకటరామయ్య కూతురు. 1987 అక్టోబర్ 28న ఆమె బెంగళూరులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2008 ఫిబ్రవరి 18న నాగరత్న కర్నాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2010 ఫిబ్రవరి 17న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమె 2027 అక్టోబర్ 29 వరకు సేవలందించే అవకాశం ఉంది. అయితే 2027 సెప్టెంబర్ 23 తర్వాత ఆమె ఒకనెల రోజులపాటు భారతదేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తులు
జస్టిస్ ఫాతిమా బీవి 1989 అక్టోబర్ 6న సర్వోన్నత న్యాయస్థానం తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఏడుగురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వారు… సుజాతా వసంత్ మనోహర్, రుమా పాల్, జ్ఞానసుధా మిశ్రా, రంజనా దేశాయ్, ఆర్. భానుమతి, ఇందు మల్హోత్రా, ఇందిరా బెనర్జీ.
సుప్రీంకోర్టు @ 9
RELATED ARTICLES