అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన విమర్శనాత్మకమైన తీరులను కూడా ఎలాంటి భయాందోళనలు లేకుండా 130 కోట్ల మంది భారతీయులు నిండు హృదయంతో స్వాగతించారని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. ఢిల్లీలోని సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సు 2020 ప్రారంభోత్సవంలో ‘న్యాయవ్యవస్థ, మారుతున్న ప్రపంచం’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక విమర్శనాత్మక తీర్పులపై మాట్లాడారు. రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య కేసును కూడా ఆయన ప్రస్తావించారు. లింగ న్యాయం లేకుండా ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆచరణీయ అభివృద్ధిని సాధించలేదని మోడీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్‌జెండర్ల చట్టం, ముస్లిం మహిళల ట్రిపుల్ తలాక్‌కు సంబంధించిన చట్టం, దివ్యాంగుల హక్కులకు సంబంధించిన చట్టం గురించి ప్రస్తావించారు. సైన్యంలో మహిళల హక్కుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అంతేకాక వారికి 26 రోజుల చెల్లింపు ప్రసవ సెలవు కూడా ఇస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను కాపాడ్డంలో న్యాయవ్యవస్థ ఇస్తున్న పునర్నిర్వచనాన్ని కూడా ఆయన ప్రశంసించారు. సాంకేతికత, ఇంటర్నెట్ ఉపయోగం గురించి మోడీ నొక్కి చెబుతూ అవి కోర్టు విధాన నిర్వహణకు తోడ్పడతాయని, ఎక్కువ మందికి న్యాయం అందేలా చూస్తాయని అన్నారు. మానవ మేధస్సుకు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తోడైతే న్యాయం సత్వరంగా అందుతుందన్నారు. మారుతున్న కాలంలో డేటా భద్రత, సైబర్ నేరాలు వంటి సమస్యలు న్యాయవ్యవస్థకు కొత్త సవాలుగా నిలిచాయని, వాటి పరిష్కారానికి కృత్రిమ మేధస్సు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు అన్ని రంగాలపై ప్రభావం చూపగలదని ప్రధాని మోడీ అన్నారు. సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ అందించిన సేవలను ఆయన ప్రస్తుతించారు. ‘గాంధీజీ తన జీవితం సత్యం, సేవకు అంకితం చేశారు. ఏ న్యాయవ్యవస్థకైనా అవే పునాది అని మీ అందరికీ తెలుసు. గాంధీజీ స్వయంగా బారిస్టర్. ఆయన మీ న్యాయవాదుల కోవకే చెందిన వారు’ అని మోడీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. మన రాజ్యాంగానికి శాసనసభ, కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థ మూడు స్తంభాలుగా ఉన్నాయని మోడీ అన్నారు. దేశం ఎదుర్కొన్న అనేక సవాళ్లను ఇవి పరిష్కరించాయన్నారు. ‘భారత్‌లో మనం ఇంతటి ఉన్నత సంప్రదాయాన్ని కలిగి ఉన్నందుకు గర్విస్తున్నాం. ఈ సంప్రదాయంపైనే దేశంలోని వివిధ సంస్థలు మరింత బలపడ్డాయి’ అన్నారు. భారత రాజ్యాంగం సమానత్వ హక్కు కింద లింగ సమానత్వానికి హామీనిస్తోందన్నారు. ‘స్వాతంత్య్రం లభించిన నాటి నుంచి మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చిన దేశాల్లో భారత్ ఒకటి’ అని ఆయన చెప్పారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం ‘బేటీ బచావో, బేటి పడావో’ అనే కార్యక్రమాన్ని కూడా ఆరంభించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళల కోసం అనేక మార్పులు ప్రభుత్వం తెచ్చిందని, మిలిటరీలో కూడా మహిళల నియామకం, ఎంపిక విషయమే కాకుండా గనులలో కూడా మహిళలకు రాత్రివేళల్లో పనిచేసే స్వేచ్ఛను కల్పించిందని చెప్పుకొచ్చారు.
ఉగ్రవాదులు, అవినీతిపరులకు గోప్యత హక్కులేదు: కేంద్ర మంత్రి
సదస్సులో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉగ్రవాదులు, అవినీతిపరులకు వ్యక్తిగత గోప్యత హక్కులేదని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని ఉటంకించారు. వ్యవస్థను వారు దుర్వినియోగంచేయడానికి అనుమతించబోమన్నారు. పాలనాధికారం అనేది ప్రజా ప్రతినిధులకు, తీర్పులిచ్చే అధికారం న్యాయమూర్తులకు వదిలేయాలన్నారు. చట్టం స్థిర సూత్రాలను జనాకర్షణ ఉల్లంఘించకూడదని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు.
భారత్ విభిన్న సంస్కృతుల సమ్మేళనం: ప్రధాన న్యాయమూర్తి
సదస్సులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే మాట్లాడుతూ.. ‘మన దేశ రాజ్యాంగం ఒక దృఢమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థను సృష్టించింది. దాని ప్రాథమిక లక్షణాలను చెక్కుచెదరకుండా ఉంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. భారత్ విభిన్న సంస్కృతుల సమ్మేళనం. న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య సంస్థలకు కూడా ఇదే వర్తిస్తుంది. అన్ని నాగరికతలకు సంబంధించిన చట్టపరమైన సంస్కృతులను మేం సమీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మొగలులు, పోర్చుగీసులు, ఫ్రెంచి, డచ్, ఇంగ్లీష్ న్యాయ సంస్కృతులను కూడా మనం మమైకం చేసుకున్నాం. రాజ్యాంగ సమస్యల పరిష్కారం కోసం 1950 నుంచి భారత న్యాయవ్యవస్థ ప్రపంచ దేశాల నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన తొలి కేసు అయిన ఎకె గోపాలన్ కేసులో అమెరికా, జపాన్, ఐర్లాండ్, కెనడా ఇంగ్లీష్ కోర్టుల చట్టాలను భారత సుప్రీంకోర్టు ప్రస్తావించింది. నాటి నుంచి స్ఫూర్తి పొందడంలో మేము ఎలాంటి మొహమాటానికి తావు ఇవ్వడంలేదు’ అని చెప్పుకొచ్చారు. ‘ఇలాంటి సదస్సుల వల్ల అంతర్జాతీయ న్యాయవ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి ఏకాభిప్రాయాన్ని, సముచిత వ్యక్తీకరణను పొందవచ్చు. మా దేశంలో న్యాయవ్యవస్థ విజయం…ఎదురయ్యే సవాళ్లకు సంబంధించి కోర్టుల స్పందన, పరిష్కారాలపైనే ఆధారపడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు’ అన్నారు.
సుప్రీంకోర్టు కీలక తీర్పులు
RELATED ARTICLES