ప్రజాపక్షం / ఖమ్మం: సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, రైతుసంఘం నేత తుల్లూరి వెంకయ్య చౌదరి (టివి చౌదరి) (80) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కమ్యూనిస్టు ఉద్యమంతో సుదీర్ఘ అనుబంధం కలిగిన చౌదరి ఖమ్మం జిల్లా తనికెళ్ళ గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. యువజన ఉద్యమంలో పనిచేసిన చౌదరి.. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలంపాటు పనిచేశారు. పువ్వాడ నాగేశ్వరరావు నుంచి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన టివి చౌదరి.. సుమారు 15 సంవత్సరాల పాటు జిల్లా కార్యదర్శిగా కొనసాగి పలు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా భూ పోరాటాలు చౌదరి కాలంలో ఉధృతంగా సాగాయి. రైతు సమస్యల పట్ల అవగాహన కలిగిన చౌదరి ఉమ్మడి రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి మంగళవారం ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చౌదరి మృతి పట్ల సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఖమ్మం జిల్లా నాయకులు భాగం హేమంతరావు, ఎస్‌కె సాబీర్ పాషా, పోటు ప్రసాద్‌లు సంతాపం తెలిపారు. చౌదరి మృతదేహాన్ని బుధవారం ఖమ్మంలోని గిరిప్రసాద్‌కు తీసుకురానున్నారు. అనంతరం అంత్యక్రియలు జరగనున్నాయి.
సీనియర్ కమ్యూనిస్టు నేత టివి చౌదరి కన్నుమూత
RELATED ARTICLES