న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన రూ. 13,384.80 కోట్ల రూపాయల సీతారామ లిఫ్ట్‌ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించిందని సీనియర్ కేంద్ర ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. మూడు జిల్లాల్లో 2.72 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించడానికి గోదావరి నదీజలాలను మళ్లించే లక్ష్యంతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు ఇఎసి సిఫార్సు మేరకు ఇదివరకే ఎక్స్‌పర్ట్ అప్రయిజల్ కమిటీ ఆమోదం తెలిపిందని,తాజాగా కేంద్ర పర్యావరణ శాఖ తుది పర్యావరణ అనుమతి (ఇసి) మంజూరు చేసిందని ఆ అధికారి తెలిపారు. మూడేళ్లలో పూర్తిచేయాల్సిన ఈ ప్రాజెక్టు వల్ల 1,930 హెక్టార్ల ప్రాంతం ముంపునకు గురవుతుందని, అంటే 157 గ్రామాల్లో 9,696 కుటుంబాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈ పర్యావరణ అనుమతి పదేళ్లపాటు వుంటుందని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఐదేళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పర్యావరణ ప్రభావంపై అంచనా వేసేందుకు ఒక స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేపట్టాల్సివుంటుందని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాబ్ జిల్లాల్లో 2,72,921 హెక్టార్ల సాగుభూమికి నీటిని అందించేందుకు ప్రస్తుతమున్న దుమ్ముగూడెం ఆయకట్టు ఎగువ ప్రాంతం నుంచి గోదావరి జలాలను మళ్లించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనదని ఆ అధికారి పేర్కొన్నారు.
సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి
RELATED ARTICLES