ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీలకు శిక్ష
చెరో రూ. 5 లక్షల జరిమానా
28 ఏళ్ల తరువాత సిబిఐ కోర్టు తుదితీర్పు వెల్లడి
తిరువనంతపురం: కేరళలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ (21) హత్య కేసులో సిబిఐ కోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులు ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీలకు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పిం ది. దీంతో పాటు వీరిద్దరికీ చెరో రూ. 5 లక్ష ల జరిమానా విధించింది. 1992 మార్చి 27 న సిస్టర్ అభయ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా.. 28ఏళ్ల తర్వాత నిందితులకు శిక్ష పడటం గమనార్హం. కొట్టాయంలోని బిసిఎం కాలేజీలో చదివే సిస్టర్ అభయ అక్క డే హాస్టల్‌లో ఉండేది. 1992 మార్చి 27 తెల్లవారుజామున అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్‌లోకి వెళ్లగా అక్కడ ఫాదర్ కొట్టూర్, ఫాదర్ పూథ్రకయాల్, నన్ సెఫీ అభ్యంతరకర రీతిలో కన్పించారు. దీంతో తమ విషయం బయటపడుతుందని భయపడిన ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీ.. అభయ తలపై కర్రతో బలంగా కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సిస్టర్ అభయ మృతదేహాన్ని బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ కేసును తొలుత స్థానిక పోలీసులు, ఆ తర్వాత క్రైం బ్రాంచ్ దర్యాప్తు జరిపి ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే, దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మానవహక్కుల కార్యకర్త జోమన్ పుతిన్‌పురక్కల్ సహా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 1993లో కేసును సిబిఐకి అప్పగించారు. దీనిపై విచారణ జరిపిన సిబిఐ ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీ, ఫాదర్ పూథ్రకయాల్‌ను నిందితులుగా పేర్కొంది. వీరికి నార్కో అనాలసిస్ పరీక్షలు కూడా నిర్వహించింది. అనంతరం 2009లో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఫాదర్ కొట్టూర్, సెఫీని దోషిగా తేలుస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బుధవారం శిక్ష ఖరారు చేసింది. కాగా.. రెండేళ్ల క్రితం ఫాదర్ పూథ్రకయాల్‌కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కాగా.. విచారణ సమయంలోనే సిస్టర్ అభయ తల్లిదండ్రులు చనిపోయారు. ఇదిలా ఉండగా, నాటి ఘటనకు సంబంధించి చిల్లర దొంగతనాలు చేసే రాజు అనే వ్యక్తి సాక్ష్యం కీలకంగా నిలిచింది. హత్య జరిగిన రోజు ఆ హాస్టల్‌కు దొంగతనానికి వెళ్లాడు. అక్కడ తాను నిందితులను చూసినట్లు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. విచారణ మొత్తంగా తాను ఆరోజు ఏం చూసిందీ చెబుతూ గట్టిగా నిలబడ్డాడు. ప్రస్తుతం ఓ పేద కాలనీలో ఉంటున్న రాజు విలేకరులతో మాట్లాడుతూ.. సిస్టర్ అభయ తన బిడ్డలాంటిదని, ఇప్పటికి ఆమెకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో తాను సాక్ష్యాన్ని మార్చి చెబితే కోట్ల రూపాయలు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని.. తాను వేటికీ లొంగలేదని చెప్పారు.
సిస్టర్ అభయ కేసులో దోషులకు జీవితఖైదు
RELATED ARTICLES