కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే
ఎన్నికల బరిలో తేలాల్సిన పరిష్కారాలు ఈ విధంగానా…?
ప్రధానమంత్రి మోడీకి తొమ్మిదిమంది ప్రతిపక్ష నాయకుల లేఖ
హైదరాబాద్ : ఢిల్లీ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికమని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తొమ్మిదిమంది ప్రతిపక్షనాయకులు లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ప్రధానమంత్రికి ఆదివారం రాసిన లేఖలో నాయకులు విమర్శించారు. “ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే” అని ఆ లేఖలో విమర్శించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా ఎన్‌సిపి నాయకుడు శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌పార్టీ నాయకుడు ఫారూక్ అబ్దుల్లా, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నాయకుడు తేజస్వి యాదవ్, శివసేన యుబిటి నాయకుడు ఉద్ధవ్ థాక్రే, సమాజ్‌వాదీపార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ప్రధానమంత్రికి సంయుక్త లేఖ రాసినవారిలో ఉన్నారు. దర్యాప్తుసంస్థలను చాలా దారుణ దుర్వినియోగానికి కేంద్రం పాల్పడుతోందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. “ప్రతిపక్ష సభ్యులకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది, మనం క్రమంగా ప్రజాస్వామ్య దశనుండి నియంతృత్వ పాలన దిశగా పరివర్తన చెందినట్లు కనిపిస్తున్నది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల యుద్ధంలో జరగవలసిన పరిష్కారాలను దానికి వెలుపలే తేల్చుకోవడానికి కేంద్రం దర్యాప్తు సంస్థ్లలను, గవర్నర్ వంటి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం చాలా తీవ్ర ఖండనీయాంశం, ఎందుకంటే ఇది మన ప్రనజాస్వామ్య వ్యవస్థకు ఏ మాత్రం మంచిదికాదు. ఈ కేసులో సిబిఐ ప్రధానంగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియయా అరెస్టును ప్రముఖంగా చిత్రీకరించింది, మద్యం విధాన రూపకల్పనలో అక్రమాలు, అకతవకలు జరిగాయని పేర్కొంటూ ఆప్ నాయకులకు వ్యతిరేకంగా చార్జిషీటు నమోదు చేశాయడం పూర్తిగా నిరాధారం, ముమ్మాటికీ రాజకీయ కుట్ర” అని ప్రధానమంత్రికి రాసిన లేఖలో ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు. సిసోడియా అరెస్టుతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సిసోడియా విద్యాశాఖామంత్రిగా ఢిల్లీరాష్ట్రంలో పాఠశాల విద్యలో గొప్ప పరివర్తన తీసుకువచ్చి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు, ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని భ్రష్టుత్వం పట్టించడంకోసం చేస్తున్న రాజకీయ వేట, రాజకీయ మంత్రవిద్య తప్ప మరోటి కాదని చెప్పడానికి ఇదో ఉదాహరణ, బిజెపి ప్రభుత్వ నియతృత్వ పరిపాలనాకాలంలోభారతదేశంలోని ప్రజాస్వామ్య విలువలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి సందేహాలను నివృత్తి చేయడానికి సిసోడియా అరెస్టు ఘటన ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది” అని ప్రతిపక్ష నాయకులు ఆ లేఖలో విమర్శించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, టిఎంసి మాజీ నాయకులు సువేందు అధికారి, ముకుల్ రాయ్ లాటి నాయకులు బిజెపిలో చేరకముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు వారిపై నమోదు చేసి వెంటాడి వేధించాయి. వారు అసెంబ్లీ ఎన్నికలముందు బిజెపిలో చేరిన తరువాతవారిపై కేసులు నత్త నడకన నడుస్తునాయి, ప్రతిపక్షాలపై మాత్రం ఆరోపణలు చేసి చేస్తున్న దాడులు చేస్తున్నారు” అని లేఖలో వారు పేర్కొన్నారు. “2014 నుండి దేశంలో దర్యాప్తు సంస్థల దాడులు పెరిగిపోయాయి, ప్రతపక్షాలపై దాడులు, వారిపై కేసులు నమోదు చేయడం పెరిగింది, లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్‌జెడి), సంజయ్ రౌత్ (శివసేన), అజామ్ ఖాన్ (సమాజ్‌వాదీపార్టీ), నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్‌సిపి), అభిషేక్ బెనర్జీ (టిఎంసి) లాంటి నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తరచు చేసిన దాడులు, వేధింపులన్నీ గమనస్తే, ఈ దర్యాప్తు సంస్థలు కేంద్రంలోని ప్రభుత్వానికి, అధికార పార్టీకి అనుబంధ విభాగాలుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నది” అని లేఖలో ప్రతిపక్షాలు విమర్శించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ ప్రాధాన్యతలు విస్మరించి ప్రవర్తిస్తున్నాయని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోందని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఫోరెన్సిక్ ఫైనాన్సియల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, ఎస్‌బిఐ, ఎల్‌ఐసి రెండూ రూ.78,000 కోట్ల మేరకు మార్కెట్ పెట్టుబడుల షేర్లు నష్టపోయాయి, ఎందుకంటే కొన్ని సంస్థల కారణంగానే ఇది జరిగిందని లేఖ పేర్కొంది. కాగా తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు గురించి ప్రస్తావిస్తూ, ఆయా రాష్ట్రాలలో వారి అధికారిక కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, తరచుగా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని కూడా ప్రతిపక్ష నాయకులు ఆ లేఖలో విమర్శించారు. ఫిబ్రవరి 26వ తేదీన సిబిఐ అధికారులు రెండో విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి పిలిచి ఏడు గంటలపాటు ప్రశ్నించారు. ఆయన అధికారులకు సహకరించడంలేదనే వంకతో అదేరోజు సాయంత్రం అరెస్టు చేశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2021 మద్యం విధానాన్ని లిక్కర్ యజమానులకు మేలు చేసేవిధంగా రూపొదించారని, దీనివల్ల ఆప్ పార్టీకి భారీగా ముడుపులు ముట్టాయని, ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లి ఉండేదని చార్జిషీటులో సిబిఐ, ఇడి పేర్కొన్నాయి. ఈ కేసులో సిసోడియా కీలక సాక్ష్యాలను మాయం చేశారని చార్జిషీటులో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
అవినీతి ప్రతిపక్షాల మధ్య
పరస్పరం సహకారం ః బిజెపి ధ్వజం
అవినీతిలో కూరుకుపోయిన ప్రతిపక్షాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని బిజెపి ధ్వజమెత్తింది. సిసోడియా అరెస్టు అప్రజాస్వామికమని విమర్శిస్తూ ప్రధానమంత్రికి తొమ్మిది ప్రతిపక్ష నాయకులు లేఖ రాయడాన్ని బిజెపి అధికార ప్రతినిధి సుధాంషు త్రివేదీ తప్పు పట్టారు. న్యూఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రికి లేఖ రాయడం ద్వారా ప్రతిపక్షాలు కేంద్ర దర్యాప్తు సంస్థలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్న విషయం మాత్రం స్పష్టమైపోయిందని ఆయన విమర్శించారు. ఈ లేఖలో సంతకాలు చేసిన నాయకులలో ఎక్కువమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే కావడం హాస్యాస్పదంగా మారిందని అన్నారు. ఈ ఆరోపణలు చేసినవారంతా అవినీతి ఆరోపణల్లో కూరుకున్నవారేనని విమర్శించారు. “మేం దేశం కోసం పనిచేస్తాం, కానీ ప్రతిపక్షాలు తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పరస్పరం సహకరించుకుంటాయి” అని విమర్శించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు అవినీతికి పాల్పడటం తమ హక్కు అని నమ్ముతున్నాయని విమర్శించారు. దేశం యావత్తూ అభవృద్ధి బాటలో దూసుకుపోతుంటే ప్రతిపక్షాలు మాత్రం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి పరస్పరం కాపాడుకోవడానికే కట్టుబడి ఉన్నాయని సుధాంషు త్రివేదీ విమర్శించారు.
సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం
RELATED ARTICLES