ఏడోర్యాంకు సాధించిన మిర్యాలగూడ విద్యార్థి వరుణ్‌రెడ్డి
అంకితా చౌదరికి 14వ ర్యాంకు
టాపర్‌గా కటారియా, మహిళా టాపర్‌గా శృతి దేశ్‌ముఖ్
న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ 2018 ఫలితాలు వెలువడ్డాయి. ఐఐటి బొంబాయి కి చెందిన బిటెక్ కుర్రాడు కనిష్క కటారియా నెంబర్‌వన్ టాపర్‌గా నిలిచాడు. శృతి దేశ్‌ముఖ్ ఐదవ ర్యాంకు సాధించి, మహిళల్లో టాపర్‌గా నిలిచారు. యుపిఎస్‌సి శుక్రవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో మొత్తం 759 మంది అభ్యర్థులు విజేతలుగా నిలిచినట్లు తెలిపింది. ఇందులో 577 మంది పురుషులు, 182 మంది మహిళలు వున్నారు. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర సివిల్ సర్వీసులకు వీరంతా ఎంపికయ్యారు. తెలంగాణలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి ఏడవ ర్యాంకు సాధించి సత్తా చూపారు. అలాగే, అంకితా చౌదరి 14వ ర్యాంకు సాధించారు. ఆమె కూడా తెలుగుబిడ్డ కావడం విశేషం. దేశ అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం యుపిఎస్‌సి నిర్వహించిన సివిల్స్- 2018 పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 759 మందిని ఎంపిక చేసినట్టు ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ -అక్టోబర్ మాసంలో సివిల్స్ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు పూర్తిచేసి తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో కనిష్క్ కటారియా ప్రథమ స్థానంలో నిలవగా.. అక్షత్ జైన్ రెండో ర్యాంకు, జునైద్ అహ్మద్‌కు మూడో ర్యాంకుల్లో నిలిచారు. కర్ణాటి వరుణ్‌రెడ్డ్డి ఏడో ర్యాంకు, అంకితా చౌదరి 14వ ర్యాంకులు సాధించారు. కటారియా ఎస్సీ కేటగిరీలో మ్యాథమెటిక్స్ ఆఫ్షనల్ సబ్జెక్ట్‌తో తొలి ర్యాంకు సాధించారు. ఇక దేశ్‌ముఖ్ భోపాల్‌లోని రాజీవ్‌గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయంలో బి.ఇ (కెమికల్ ఇంజినీరింగ్) చదువుతున్నారు. ఈసారి సివిల్స్‌కు 10,65,552 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 4,93,972 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక వారిలో 10,468 మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. టాప్-25లో 15 మంది పురుష అభ్యర్థులుండగా, 10 మంది మహిళా అభ్యర్థులుండటం విశేషం.