రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా విభజన
ప్రతి పంటకు డిమాండ్
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కల్తీరహిత ఉత్పత్తులు
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతం
మహిళల భాగస్వామ్యాన్ని పెంచుదాం
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై సమీక్షలో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం / హైదరాబాద్ : “రాష్ట్రాన్ని కచ్చితంగా పంటల కాలనీగా విభజించాలి. రైతు పండించే ప్రతి పంటకు డిమాండ్ లభించేలా చూడాలి. రాష్ట్రంలో నెలకొల్పనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ప్రభుత్వ పరం గా నమ్మకమైన, కల్తీరహిత బ్రాండెడ్ ఉత్పత్తులు జరగాలి. రైతులు నియంత్రణా విధానంలోనే పంటలు పండించాలి” అని సిఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆహార, వ్యవసాయ రంగానికి సం బంధించిన పలు విషయాల్లో సరైన గణాంకాలు లేనందున రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని అధిగమించాల్సిన ఆవశ్యకత వుంద ని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై కోట్లాది మంది అధారపడి వున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా ఆ శాఖలు పనిచేయాలని సిఎం చెప్పారు. రైతుల సాంప్రదాయబద్ధమైన కొన్ని అలవాట్లలో కొంతమార్పు రావలసిన అవసరం వుందని, రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయటం వల్ల జరిగే లాభనష్టాలను క్షుణంగా అధ్యయనం చేయాలని ఆయన అధికారులను కోరారు. పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ తీరుతెన్నులపై, భవిష్యత్తులో అవలంభించాల్సిన విధానాలపై, మహిళా సంఘాలను పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులలో భాగస్వాములను చేయటంపై, తెలంగాణలోని వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంఒ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, స్మితాసభర్వాల్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్ శర్మ, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, శాసనమండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌సి శ్రీనివాసరెడ్డి, ఎంఎల్‌ఎలు మహేశ్వర్ రెడ్డి, ఆనంద్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.