HomeNewsBreaking Newsసిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

మూడో వన్డేలోనూ భారత్‌దే విజయం..
వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ స్థానానికి

ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 295 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. కివీస్‌కి ఒక్క విజయం కూడా దక్కకుండా సిరీస్‌ను ఊడ్చేసింది. అంతేకాదు.. ఈ విజయంతో ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ అగ్రస్థానానికి ఎగబాకింది. ఆల్రెడీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న భారత్‌.. ఇప్పుడు వన్డేల్లోనూ అగ్రస్థానం కైవసం చేసుకొని, అరుదైన రికార్డు నెలకొల్పింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (101), శుభ్‌మన్‌ గిల్‌ (112) మెరుపు శతకాలతో విరుచుకుపడి.. భారత్‌కి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే.. అదే జోరుని కొనసాగించడంతో ఇతర భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఒక దశలో విరాట్‌ కోహ్లీ (36) బాగానే రాణించాడు కానీ, ఆ వెంటనే ఔటయ్యాడు. ఇతరులు సైతం వచ్చినట్టే వచ్చి పెవిలియన్‌ దారి పట్టడంతో.. భారత్‌ స్కోర్‌ నెమ్మదించింది. అయితే.. చివర్లో హార్దిక్‌ పాండ్యా (54) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో, భారత్‌ భారీ స్కోరు (385/9) చేయగలిగింది. అనంతరం 386 లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు.. ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. అయితే.. డెవాన్‌ కాన్వే (138), నికోల్స్‌(42) కలిసి అదరొట్టేశారు. రెండో వికెట్‌కి వీళ్లు 106 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. కానీ, నికోల్స్‌ ఔటయ్యాక కివీస్‌ కాస్త కష్టాల్లో పడింది. ఇక డెవాన్‌ ఔటయ్యాక ప్రత్యర్థి జట్టు పూర్తిగా ఆశలు కోల్పోయింది. మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో.. కివీస్‌ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌ చెరో 3 వికెట్లు తీయగా.. చాహల్‌ 2, హార్ధిక్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments