HomeNewsBreaking Newsసిరీస్‌పై కన్నేసిన టీమిండియా

సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

నేడు ఆస్ట్రేలియాతో మూడో వన్డే
మధ్యాహ్నం 1:30 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాంచీ: ఆస్ట్రేలియాపై వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఇక సిరీస్‌పై కన్నేసింది. శుక్రవారం ఆసీస్‌తో జరిగే మూడో వన్డేలో గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు ఎలాగైన ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలని ఆస్ట్రేలియా కలలు కంటుంది. ప్రస్తుతం టీమిండియా వన్డేల్లో ఎదురులేని శక్తిగా ఉంది. ఈ సంవత్సరం ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో హాట్‌ ఫేవరేట్‌గా ఉన్న భారత్‌ స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాణించి తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా 2 ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డేలో హ్యాట్రిక్‌ విజయం సాధించి తమ ఉనికిని చాటుకోవాలని పట్టుదలతో ఉంది. ఇటీవలే విదేశీ పర్యటనలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను వారి సొంత మైదానాల్లో చిత్తు చేసి వచ్చిన టీమిండియా అదే జో రును స్వదేశంలోనూ కనబర్చుతుంది. పొట్టి ఫార్మాట్‌లో నిలకడగా ఆడకపోయినా వన్డే సిరీసుల్లో మాత్రం తమ సత్తా చాటుతోంది. వరుస విజయాలతో పటిష్టమైన జట్లను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం భారత్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నది. ఇక్కడ ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేస్తే భారత్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకునే చాన్స్‌ ఉంది. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ తొలి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో భారత్‌కే ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పటికే ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లు అభిప్రాయ పడుతున్నారు. రాంచీలోని జెఎస్‌సిఎ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 నుంచి భారత్‌ మధ్య మూడో వన్డే ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ ధోనీకి ప్రత్యేకమని, సొంత మైదానంలో ధోనీకి ఇదే చివరి వన్డే మ్యాచ్‌ అని, వరల్డ్‌కప్‌ తర్వాత ధోనీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడని వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. కానీ దీనిపై ధోనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
బ్యాటింగ్‌ తడబాటు..
వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. బౌలర్లు పర్వాలేదనిపించినా.. బ్యాట్స్‌మెన్స్‌ మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నారు. ఒకరిద్దరు మినహా మిగతా ఆటగాళ్లు బ్యాటింగ్‌లో తడబడుతున్నారు. ప్రస్తుతం టీమిండియాకు బ్యాటింగ్‌ సమస్య కలవరపెడుతోంది. ఓపెనర్ల నుంచి, లోయర్‌ ఆర్డర్‌ వరకు అందరూ ప్రతి మ్యాచ్‌లో ఆడలేక పోతున్నారు. ఒక మ్యాచ్‌లో రాణించన వారు తర్వాతి మ్యాచ్‌లో విఫలమవుతున్నారు. అందరూ కలిసికట్టుగా రాణిస్తేనే ఉత్తమజట్టుగా పేరు వస్తుంది. కానీ ఇది టీమిండియా బ్యాటింగ్‌ దళంలో మాత్రం ఈ ఫార్ములా పనిచేయడంలేదు. దాదాపు మ్యాచుల్లో ఎవరో ఒకరు ఆపద్భాందవుడుగా మ్యాచ్‌ను ఆదుకుంటున్నారు. తప్ప మిగతా వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే జరిగిన విదేశీ పర్యటనలో మెరుగ్గా రాణించిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌ ఇక్కడ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. త్వరలో జరగనున్న ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి ప్రదర్శనలు టీమిండియా యాజామన్యానికి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో భారత్‌ రెండు వరుస విజయాలతో మంచి ప్రదర్శన చేసింది. టి20 సిరీస్‌ను 0 కోల్పోయిన భారత్‌ ఇప్పుడు వన్డే సిరీస్‌లో మళ్లీ జోరందుకుంది. బ్యాటింగ్‌లో లోయర్‌ ఆర్డర్‌ నుంచి మరింత సహకారం అందాలని కెప్టెన్‌ కోహ్లీ ఆశిస్తున్నాడు. ఆసీస్‌ చివరి బ్యాట్స్‌మెన్స్‌లాగా మన బ్యాట్స్‌మెన్స్‌ కూడా రాణించి జట్టుకు అండగా ఉండాలని భావిస్తున్నాడు.
ఓపెనర్లకు ఏమైంది..
భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన భారత స్టార్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌కు ఇప్పుడు ఏమైందో అర్థం కావడంలేదు. ఇద్దరూ నిలకడగా ఆడలేక పోతున్నారు. ఒక మ్యాచ్‌లో రోహిత్‌ చెలరేగిపోతే.. ఆ మ్యాచ్‌లో ధావన్‌ తేలిపోతున్నాడు. మరో మ్యాచ్‌లో ధావన్‌ మెరుగ్గా ఆడితే.. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ చేతులెత్తేస్తున్నాడు. ఈ సమస్యే టీమిండియాను కలవరపెడుతుంది. ఇద్దరూ తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించడంలో వరుసగా విఫలమవుతున్నారు. ప్రపంచకప్‌కు ముందు వారికి ఇదే చివరి అవకాశం. మళ్లీ తమ పాత ఫామ్‌ను అందుకుంటే జట్టుతో పాటు వారికి కూడా మంచిదని విశ్లేషకులు చేబుతున్నారు. ప్రస్తుతం యువ క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి సమయంలో ధావన్‌కు ఈ సిరీస్‌ పరీక్షగా మారింది. ధావన్‌ తన చివరి వన్డే మ్యాచుల్లో కేవలం 2 అర్ధ శతకాలు మాత్రమే చేశాడు. మరోవైపు రాహుల్‌ ఫామ్‌లో ఉండడం ఇతని చోటుపై సందేహాలు పుట్టిస్తున్నది. ఇక మిగిలిన మ్యాచుల్లోనైనా ఈ జోడీ భారత్‌కు శుభారంభాన్ని అందిస్తారని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. వీరిద్దరూ చెలరేగితే ఏ జట్టుకైనా వీరిని అడ్డుకోవడం కష్టమే. వీరు త్వరలో తమ పాత ఫామ్‌ను అందుకుంటారని భారత సారథి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. భారత్‌ భారీ పరుగులు చేయాలంటే వీరు మంచి ఆరంభం ఇవ్వాల్సిందే. మూడో వన్డేలో రోహిత్‌, ధావన్‌ నిలకడగా ఆడాలని ఆశిస్ధాం.
రాయుడు నిలబడాలి..
ఓపెనర్లు విఫలమైనా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌ ఆదుకోవాల్సి ఉంటుంది. కానీ టాప్‌ ఆర్డర్‌లో అంబటి రాయుడు వరస మ్యాచుల్లో విఫలమవుతున్నాడు. ఆసీస్‌ పర్యటనలో మెరుగ్గా ఆడిన ఈ హైదరాబాదీ స్వదేశంలో మాత్రం మంచి ప్రదర్శన చేయలేక పోతున్నాడు. ఆసీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో రాయుడు ఇరవై పరుగుల మార్కును కూడా దాటలేక పోయాడు. కీలక సమయంలో బాధ్యతగా ఆడాల్సిన అతను పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచకప్‌ జట్టులో తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితుల్లో రాయుడు పుంజుకోక పోతే అతని స్థానానికి ఎసరు ఖాయమనే చెప్పాలి. మిడిల్‌ ఆర్డర్‌లో గొప్పగా ఆడిన రాయుడు.. ఇప్పుడు టాప్‌ ఆర్డర్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. కానీ రాయుడులో ఆ సత్తా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేయగలడు. రాయుడు ఇకనైన మళ్లీ ఫామ్‌ను అందుకుని జట్టుకు అండగా నిలబడాలని అందరూ ఆశిస్తున్నారు. మరోవైపు కెప్టెన్‌ కోహ్లీ, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌, కేదార్‌ జాదవ్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిపైనే టీమిండియా బ్యాటింగ్‌ విభాగం ఆధారపడి ఉంది.
బౌలర్లపైనే భారం..
టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత బౌలర్లు మరో సిరీస్‌ అందించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తమ అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొడుతున్న భారత బౌలింగ్‌ దళం మరో సిరస్‌పై కన్నేసింది. భారత జట్టులో పేసర్లతో పాటు స్పిన్నర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా జస్ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ బౌలర్‌గా ఉన్న బుమ్రా నిలకడమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు కీలక వికెట్లు తీస్తూ భారత్‌ విజయాల్లో ప్రధాన భూమిక వహిస్తున్నాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ఇతనికి ఎదురేలేకుండా పోయింది. ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ విజృంభించి బౌలింగ్‌ చేస్తున్నాడు. చివరి ఓవర్లలో ఇతని బౌలింగ్‌ అమోఘం. చక్కనైన లైన్‌ అండ్‌ లెన్త్‌తో పాటు యార్కర్లు విసరడం ఇతనికి సాటిలేరనే చెప్పాలి. ప్రస్తుతం టీమిండియాకు దొరికి ఆణిముత్యంగా అభివర్ణించక తప్పదు. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో బుమ్రా పది ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మహ్మద్‌ షమీ కూడా ఫామ్‌లో రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. గత కొన్ని మ్యాచుల్లో నిలకడగా బౌలింగ్‌ చేస్తూ షమీ తన సత్తా చాటుకుంటున్నాడు. ఆరంభపు ఓవర్లలో.. ముఖ్యమైన చివరి ఓవర్లో మెరుగైన బౌలింగ్‌తో బుమ్రాకు తోడుగా ఉంటున్నాడు. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచుకున్న టీమిండియా మూడో వన్డేలో షమీ బదులు మరో పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచకప్‌ దృశ్య భూవీకి చాన్స్‌ ఇస్తున్నట్టు సమాచారం. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే ప్రపంచ అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా ఎదుగుతున్న చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ భారత బౌలింగ్‌ విభాగంలో కీలక స్పిన్నర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో నిలకడైన ప్రదర్శనలతో తన ఆటను మెరుగుపర్చుకుంటున్నాడు. గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. మరోవైప ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేస్తూ జట్టుకు అండగా ఉంటున్నాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌లోనే పటిష్టంగా ఉందని చెప్పాలి. ఆసీస్‌తో శుక్రవారం జరిగే మూడో వన్డేలో భారత్‌ రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. మరోవైపు ఎలాగైన గెలిచి సిరీస్‌లో నిలవాలని ఆసీస్‌ కసరత్తులు చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌ కూడా హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

జట్ల వివరాలు (అంచనా)
భారత్‌ : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్‌ ధోనీ (వికెట్‌ కీపర్‌), కేదర్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, యాజువేంద్ర చాహల్‌, రిషభ్‌ పంత్‌, సిద్దర్థ్‌ కౌల్‌, కెఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా.
ఆస్ట్రేలియా : ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), డిఆర్సీ షార్ట్‌, షాన్‌ మార్ష్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, అలెక్స్‌ క్యారీ, పీటర్‌ హాండ్స్‌కాంబ్‌, అష్టన్‌ టర్నర్‌, ఆడమ్‌ జంపా, జాసన్‌ బెహ్‌ర్నాడార్ఫ్‌, జై రిచర్డ్‌సన్‌, పాట్‌ కమ్మిన్స్‌, ఆండ్రూ టై, నాథన్‌ కల్టర్‌నైల్‌, నాథన్‌ లియాన్‌.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments