కోర్టు ధిక్కరణ కేసులో 12న హాజరు కావాలని హుకుం
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం గత ఏడాది సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించిన నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ కింద సమన్లు జారీచేసింది. ఈనెల 12న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించిం ది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ అత్యాచారం కేసును విచారిస్తున్న సిబిఐ అధికారి ఎకె శర్మను బదిలీ చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు చూడగానే తెలుస్తోందని (ప్రైమఫేసి ఉన్నట్లు) ఆయనకు తెలిపింది. ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ముం దు హాజరు కావాలని సిబిఐ ప్రాసిక్యూషన్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ ఎస్. భసురామ్‌ను కూడా కోర్టు ఆదేశించింది. ఎకె శర్మను బదిలీ చేయడంలో ఏయే అధికారుల హస్తం ఉందో వారందరి పేర్లను కూడా ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ముజఫర్‌పూర్ బాలికల సంరక్షణాలయం కేసును విచారిస్తోన్న అధికారి ఎకె శర్మను బదిలీ చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానిస్తూ, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని మండిపడింది. సిబిఐకి నాగేశ్వరరావు తాత్కాలిక డైరెకర్‌గా వ్యవహరించిన కాలంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. శర్మను బదిలీ చేసిన వ్యవహారంలో ఏయే అధికారుల పాత్ర ఉందో తేల్చాలని సిబిఐకి సూచించింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ అయిన శర్మ ముజఫ్ఫర్‌పూర్ సంరక్షణాలయానికి సంబంధించిన కేసులను విచారిస్తోన్న సీనియర్ అధికారి. విచారణ ముగిసే వరకు ఆయన్ను బదిలీ చేయొద్దని గతంలోనే కోర్టు ఆదేశించింది.