HomeNewsBreaking Newsసిబిఐ కస్టడీకి సిసోడియా

సిబిఐ కస్టడీకి సిసోడియా

ఐదు రోజుల కస్టడీకి అనుమతించిన
నా అరెస్టు వెనుక రహస్య కారణాలున్నాయా
దేశవ్యాప్తంగా ఆప్‌ కార్యకర్తల ఆందోళనలు
న్యూఢిల్లీ :
ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసిన ఎక్సైజు విధానం (2021 లో అవినీతి జరిగిందన్న కేసులో అరెస్టయిన ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సిబిఐ ఐదు రోజులపాటు కస్టడీలోకి తీసుకుంది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ను ఆశ్రయించిన సిబిఐ సిసోడియాను కస్టడీలోకి తీసుకుని ఉధృతంగా ప్రశ్నిస్తేగానీ నిజాలువెల్లడయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది. దాంతో ఉభయపక్షాల వాదనలు విన్న స్పెష ల్‌ జడ్జీ ఎం.కె.నాగపాల్‌ ఐదు రోజులపాటు సిసోడియాను సిబిఐ కస్టడీకి అనుమతించారు. “నేను ఆర్థిక మంత్రిని, నిన్న ఒక్కరోజులో ఏ మార్పులు వచ్చేశాయి? ఎందుకుఅరెస్టు చేశారు? నా అరెస్టుకు సాక్ష్యాలు లేవు, అరెస్టు చట్ట విరుద్ధం, నా అరెస్టు వెనుక ఏవైనా నిగూఢమైన, రహస్య కారణాలు ఉన్నాయా?” అని సిసోడియా న్యాయమూర్తితో అన్నారు. సిసోడియానుఅరెస్టు చేయాల్సిన అవసరం లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ఆయనను అరెస్టు చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవని సిసోడియా తరపు న్యాయవాది ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. “సెల్‌ఫోన్లను మార్చేశారని సిబిఐ వాదిస్తోంది, సెల్‌ఫోన్‌ మార్చేయడం, కొత్త ఫోన్‌ తీసుకోవడం నేరమేమీ కాదే?” అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వద్ద సలహా లు స్వీకరించిన తరువాతే నాటి ఎక్సైజు విధానాన్ని అమలుచేశారని సిసోడియా తరపు న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం లో ఉన్నవారు ఎప్పుడైనా ఎవరితోనైనా సంప్రదింపులు చేస్తారని, అది అనివార్యమైన విషయమని అందువల్ల మద్యం విధానం రూపొందించడంలో కుట్రకు అవకాశమే లేదని న్యాయవాది కోర్టుకు చెప్పారు. మార్చి 4వ తేదీ వరకూ సిసోడియా వారి కస్టడీలో ఉంటారు. కాగా సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపారు. ఢిల్లీలో బిజెపి కేంద్ర కార్యాలయం ఎదుట పార్టీ నేత పిలుపు మేరకు ఆప్‌ కార్యకర్తలు భారీ ప్రదర్శనకు
దిగారు. తొలుత కోర్టు ఈ ఉత్తర్వులను వెలువరించకుండా రిజర్వులో ఉంచింది. సిసోడియాను ఆదివారం ఉదయం నుండి ఏడు గంటలపాటు సిబిఐ అధికారులు ప్రశ్నించిన అనంతరం రాత్రి ఆయన్ను అరెస్టు చేశారు. ఆయన సమాధానాలు సంతృప్తికరంగా లేవని, అరెస్టుచేసి ఉధృతంగా ప్రశ్నింస్తేగానీ నిజం చెప్పే అవకాశాలు లేవనే వంకతో ఆయనను అరెస్టు చేసినట్లు ప్రత్యేక కోర్టులో సిబిఐ వాదించింది. గంటసేపు కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులూ వాదనలు వినిపించారు. ఆనాటి ఎక్సైజు విధానంలో చేసిన మార్పులు చేర్పులను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా ఆమోదించారని, ఆ తరువాతే కేంద్ర దర్యాప్తు సంస్థ ఢిల్లీ ప్రభుత్వాన్ని విచారించేందుకు సిద్ధపడిందని సిసోడియా తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. తన అరెస్టుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని సిసోడియా న్యాయమూర్తితో అన్నారు. తన రిమాండ్‌కు సిబిఐ విజ్ఞప్తి చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. “నేను ఆర్థికమంత్రిని, నేను బడ్జెట్‌ సమర్పించవలసి ఉంటుంది, ఒక ఆర్థికమంత్రిని సిబిఐ కస్టడీలో ఉంచవలసినంతగా నిన్న ఒక్కరోజులో ఏ మార్పు జరిగిపోయింది? ఇక ఆ తర్వాతి రోజుల్లో ఆర్థికమంత్రి అందుబాటులో ఉండడని వారి ఉద్దేశమా? లేక నా అరెస్టు వెనుక, కస్టడీలోకి తీసుకోవడం వెనుక ఏవైనా నిగూఢమైన, రహస్య కారణాలు ఉన్నాయా? ఈ కేసు ఒక వ్యక్తిమీద చేసిన దాడి, ఒక వ్యవస్థ మీద చేసిన దాడి, నన్ను రిమాండ్‌ చేయడం ద్వారా ఒక సందేశం వెలువడుతుది, రిమాండ్‌ను తిరస్కరించడానికి ఇదే సరైన కేసు” అని సిసోడియా తరపున ఆయన న్యాయవాది జడ్జీ ఎదుట వాదన వినిపించారు. ఢిల్లీ ప్రభుత్వంలో సిసోడియా ఒక కీలక పాత్రధారిగా ఉన్నారని, అందువల్ల ఈ నిర్ణయంపై ఆయన్ను ప్రశ్నిచకూడదని, ఆయనకు దీన్ని ఆపాదించకూడదని న్యాయవాది పేర్కొన్నారు. “నేను ఏమీ చేయలేను, ఎందుకంటే సంబంధిత అథారిటీ (లెఫ్టినెంట్‌ గవర్నర్‌) దీనికి ఆమోదం తెలియజేశారని అన్నారు. అయితే దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది మాత్రం, “ఈ కేసులో విచారణను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయనను కస్టడీలోకి తీసుకోవడం అవసరం” అని కోర్టుకు చెప్పారు. ఈ కేసులో తనకు ఎలాంటి పాత్రా లేదని సిసోడియా న్యాయమూర్తికి చెప్పారు. కానీ ఈ దర్యాప్తును చూస్తే మాత్రం ఏదో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఉందని అన్నారు. కోర్టు ఆవరణ వెలుపల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిసోడియా అరెస్టుకు చాలామంది
సిబిఐ అధికారులు వ్యతిరేకం ః కేజ్రీవాల్‌ వెల్లడి
తమ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్టుకు చాలామంది సిబిఐ అధికారులు ఇష్టంతో లేరని, వారంతా సిసోడియా అరెస్టును వ్యతిరేకించారని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అయితే కేవలం రాజకీయ ఒత్తిడి కారణంగానే తప్పని పరిస్థితుల్లో అధికారులు సిసోడియాను అరెస్టు చేశారని అన్నారు. “చాలామంది సిబిఐ అధికారులకు సిసోడియా అంటే చాలా గౌరవం, వారు ఆయన అరెస్టుకు వ్యతిరేకం, ఎందుకంటే ఆయన అరెస్టుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, కేవలం రాజకీయ ఒత్తిడి వల్లే ఆయన్ను అరెస్టు చేయాల్సి వచ్చింది” అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. అయితే కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను బిజెపి ఎంపి మనోజ్‌ తివారీ విమర్శించారు. ఆయనపై ఎదురుదాడికి దిగారు. కేజ్రీవాల్‌ అన్నీ తనకే తెలుసునన్నట్టుగా మాట్లాడుతున్నారని ఆయన రాసింది, చెబుతున్నది అంతా కల్పితమని అందరికీ తెలుసునని విమర్శించారు. గుజరాత్‌లో కూడా ఐబి కి సంబంధించి కేజ్రీవాల్‌ ఇదేవిధంగా తప్పడు వార్తలు ట్వీట్‌ చేశారని అన్నారు. చట్టం తన పని తానుచేస్తుందని, చట్టాన్ని తన పని తాను చెయ్యనివ్వాలని అన్నారు. 2022 అక్టోబరులో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, “ఒక ఐబి నివేదిక ప్రకారం, ఆమ్‌ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో స్వల్ప మెజారిటీతో అయినాగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అబద్ధపు ప్రచారాలుచేశారు” అని విమర్శించారు.
బ్లాక్‌ డే గా పాటించిన ఆప్‌
ఎంపి,ఎంఎల్‌ఎ,మంత్రి సహా 80 శాతం పార్టీ నేతలు అరెస్టు
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్టు, రిమాండ్‌కు తరలింపు రోజైన సోమవారాన్ని ఆమ్‌ ఆద్మీపార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే గా పాటించారు. పార్టీకి చెందిన 80 శాతం నాయకులను పోలీసులు అరెస్టు చేశారని ఆప్‌ పార్టీ ప్రకటించింది. అరెస్టును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆ పార్టీకి బలం ఉన్న ప్రతిచోటా భారీగా నిరసన ప్రదర్శనలు చేశారు. చండీగఢ్‌, ఢిల్లీ, భోపాల్‌ సహా పలు ఇతర నగరాలలో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. కాగా ఢిల్లీలో బిజెపి కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది బిజెపి కేంద్ర కార్యాలయం ఎదుట గుమిగూడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. డిడియుకు వెళ్ళే మార్గంలో పలుచోట్ల రహదార్లపై ఢిల్లీ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పారామిలిటరీ దళాలను మోహరించారు. ఆప్‌ ఎంపి సంజయ్‌ సింగ్‌, మంత్రి గోపాల్‌ రాయ్‌, ఎంఎల్‌ఎ త్రిలోక్‌పురి రోహిత్‌ కుమార్‌ మెహ్రూలియా మరో ఎంఎల్‌ఎ దినేశ్‌ మోహనియాలతో సహా 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments