దేశంలో నేరపరిశోధన అత్యున్నత సంస్థ సిబిఐసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది అధికారంలోని వారి పెంపుడు పిల్లిగా పనిచేస్తోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. సిబిఐ కేంద్రప్రభుత్వ “పంజరంలో చిలుక” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి ఎంతోకాలం కాలేదు. ఇంతలోనే అది ఉన్నతస్థాయి అవినీతిలో కూరుకుపోవటం దిగ్భ్రాంతికరం. అయితే గతంలో అవినీతి లేదని గుండెమీద చేయివేసుకుని చెప్పగలవారు లేరు. ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ఒకటి, రెండు స్థానాల్లోని వ్యక్తుల మధ్య ఆరోపణలు బజారు కెక్కటంవల్ల దానిలోని అవినీతిలోతులు చర్చనీయాంశమవుతున్నాయి. ఒకరు సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ. ఆయన ఢిల్లీ పోలీసు కమీషనర్ తిహార్ జైల్ డిజిపిగా పనిచేశారు. కాగా స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి. ప్రధాని మోడీ స్వయంగా ఆయన్ను సిబిఐలోకి తెచ్చారు. ఆస్తానా లంచం తీసుకున్నట్లు వర్మ ఆరోపించగా, అక్రమాలకు పేరుపొందిన మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషికి సంబంధించిన అవినీతి కేసు దర్యాప్తును వర్మ అడ్డుకుంటున్నాడన్నది ఆస్తానా ఆరోపణ. విజయమాల్యా, అగస్టా, ఐఆర్ వంటి ప్రముఖ కేసుల దర్యాప్తులో వర్మ జోక్యం చేసుకుంటున్నట్లు ఆస్తానా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫిర్యాదు చేశాడు. ఖురేషి దుబాయి భాగస్వాములు ఆస్తానాకు దాదాపు రూ.5కోట్లు చెల్లించినట్లు ఆరోపణకు గురికాగా ఖురేషీపై కేసు దర్యాప్తును అడ్డుకున్నందుకు వర్మకు కోట్లు ముట్టాయన్నది ప్రత్యారోపణ. ఆస్తానా దర్యాప్తు బృందంలోని డిప్యూటీ సూపరింటెండెంట్ దేవిందర్ కుమార్ సోమవారం అరెస్ట్ చేయటంతో ఈ అవినీతి భాగోతం ప్రభుత్వాన్ని కదిలించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకుని (సిబిఐ ప్రధానమంత్రి కింద పనిచేస్తుంది) డైరెక్టర్ అలోక్ పిలిపించి మాట్లాడారు. “నేను తినను, ఇతరులను తిననివ్వను” అనే ప్రసిద్ధ నినాదంతో అవినీతిపట్ల చండశాసనుడన్న ప్రతిష్టను తనకుతాను ఆపాదించుకున్న నరేంద్రమోడీ పాదాలకిందనే సిబిఐ ఇంతపెద్ద అవినీతిలో కూరుకుపోవటం ప్రధానికీ మచ్చ. అవినీతి ప్రభుత్వమన్న భావన ప్రజల్లోకి వెళితే అది పాలకపార్టీని రాజకీయంగా దెబ్బతీస్తుంది. యుపిఎ ప్రభుత్వం అతి తక్కువ సంఖ్యలో ఎంపిలకు దిగజారటం అటువంటి భావన పర్యవసానమే కదా! ఒకవైపు రాఫెల్ కుంభకోణం ఆరోపణలు, మరోవైపున పలువురు బిజెపి ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు, ఇప్పుడీ సిబిఐ అవినీతి కుమ్ములాట, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన అసమర్థ పాలనకు తోడై మోడీ ప్రభుత్వాన్ని పెద్ద సంకటంలో పడేశాయి. అందువల్లనే సిబిఐ కంపులో మోడీ ఎవరినీ సమర్థించలేక “చట్టం దాని పని అది చేసుకుపోతుంది” అనే వైఖరి తీసుకున్నారని చెప్పబడుతున్నది.
సిబిఐ అంతర్గత అవినీతి కుమ్ములాట మంగళవారం కోర్టులకు చేరింది. అరెస్టు చేసిన డిఎస్ దేవేందర్ సిబిఐ పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచింది. ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం లోపలి నుంచే బెదిరించి డబ్బు గుంజే కుంభకోణం నడుస్తున్నట్లు అంగీకరించిన సిబి ఐ, దేవేందర్ కుమార్ కస్టడీ కోరింది. కాగా ఎఫ్ కొట్టి వేయాల్సిందిగా కుమార్ ఆస్తానా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాకేశ్ ఆస్తానాకు మంచి ట్రాక్ రికార్డుంది. సిబిఐ ధన్ పనిచేసినపుడు లాలుప్రసాద్ పశుదాణాకేసు దర్యాప్తు చేసింది ఆయనే. మళ్లీ గుజరాత్ క్యాడర్ వెళ్లిన ఆయన గోద్రా రైలు దగ్ధం తదితర కేసులు దర్యాప్తు చేశారు. అనంతరం మోడీ ప్రధాని అయినాక తనకు విధేయుడైన ఆస్తానాను సిబిఐ స్పెషల్ డైరెక్టర్ నెం.2నియమించారు. సిబిఐ సిట్ నాయకత్వం వహిస్తున్న ఆయన యుపిఎ ప్రభుత్వం నాటి అరడజను కేసులు దర్యాప్తు చేస్తున్నాడు. బొగ్గుగనుల కేటాయింపు కుంభకోణం, బ్యాంకులను దోచుకున్న విజయమాల్యాకేసు, పి.చిదంబరం కుమారుడు కార్తికి ప్రమేయమున్నట్లు ఆరోపించబడిన ఎయిర్ మాక్సిస్ కేసు వాటిలో ఉన్నాయి. లాలుకు శిక్షపడటం మినహా మిగతా కేసుల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేదు. రాజకీయంగా వేధింపు కేసులకు అస్తానాను మోడీ ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ప్రస్తుత మాంసం వ్యాపారి కేసులో డబ్బు చేతులు మారటం నిరూపణ అవుతుందా? అయితే అది ఎవరివద్దకు దారితీస్తుంది? అలోక్ పదవీకాలం 2019 జనవరిలో ముగుస్తుంది. కాబట్టి అవినీతి లోతుపాతులు బయటకు లాగటానికి ఆయనకున్న సమయం తక్కువ. ఇంతకు సిబిఐ నెం.1, నెం.2లలో ఎవరు నిజాయితీపరులని ప్రధాని మోడీ భావిస్తున్నారన్నది ముఖ్యం. ఆస్తానా విధేయుడైనప్పటికీ అతన్ని సమర్థించడానికి పరిస్థితులు సానుకూలంగా లేవని, అందువల్ల నెం.1 అలోక్ నెంబర్.2 రాకేశ్ ఆస్తానా లను పక్కనబెట్టి ఎవరు నీతిమంతులో దర్యాప్తు చేసే బాధ్యతను నెం.3కి అప్పగించటం ఉత్తమమని కొందరు మోడీకి సలహా ఇస్తున్నారట! ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూదాం! ఏమైనా సిబిఐ, తద్వారా ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. సిబిఐలో విశ్వాస పునరుద్ధరణకు తీవ్రమైన చర్యలను ప్రజలు ఆశిస్తారు.
సిబిఐలో అవినీతి కుంపటి
RELATED ARTICLES