ఏకాభిప్రాయం లేకుండానే రిషికుమార్ శుక్లా నియామకం
ఇది చట్ట ఉల్లంఘనే..
అసమ్మతి తెలియజేస్తూ ప్రధానికి ఖర్గే లేఖ
రిషికుమార్ శుక్లా మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ డిజిపి
న్యూఢిల్లీ: చట్టాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ మోడీ సర్కారు మరోసారి సిబిఐ చీఫ్ నియామకం జరిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ డిజిపి రిషికుమార్ శుక్లా కేంద్ర దర్యాప్తు విభాగం (సిబిఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన రెండేళ్లపాటు ఆ పదవీకాలం లో వుంటారు. కేంద్ర సిబ్బంది మంత్రి త్వ శాఖ శనివారంనాడు ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. 1983 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన శుక్లా ప్రస్తుతం భోపాల్ కేంద్రం గా నడుస్తున్న మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జనవరి 10న సిబిఐ డెరక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అలోక్ కుమార్ వర్మ స్థానంలో శుక్లా సిబిఐ చీఫ్‌గా నియమితులయ్యారు. శుక్లా ఈ మధ్యనే మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవి నుంచి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జనవరి 24, ఫిబ్రవరి 1న జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశాల్లో శుక్లాను సిబిఐ చీఫ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగిన రెండో సమావేశంలోనే శుక్లా పేరును ఖరారు చేశారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌తోపాటు ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పాల్గొన్నారు. అయితే ఖర్గే ఈ సమావేశంలో శుక్లా పేరును తిరస్కరించారు. ఈ విషయాన్ని ఖర్గే బహిరంగంగానే వెల్లడించారు. పైగా ప్రధానమంత్రికి ఒక అసమ్మతి నోట్‌ను పంపించారు. అవినీతి నిరోధక కేసుల్లో ఏ మాత్రం అనుభవం లేని ఒక వ్యక్తిని సిబిఐ చీఫ్‌గా నియమించడానికి తాము వ్యతిరేకిస్తున్నామని ఖర్గే స్పష్టంచేశారు. పైగా అతని నియామకం చట్టంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఎంపిక ప్రాతిపదికను మోడీ క్షీణింపజేశారని వ్యాఖ్యానించారరు. రెండు పేజీల అసమ్మతి నోట్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. ఈ నియామకం సిబిఐ, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తున్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (డిఎస్‌పిఇ)ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నదని ఖర్గే ఆరోపించారరు. అందుకే తాను శుక్రవారం జరిగిన సమావేశంలో శుక్లా నియామకాన్ని వ్యతిరేకించినట్లు చెప్పారు. అయినప్పటికీ, మోడీ ఏకపక్షంగా ఈ నియామకాన్ని జరిపారని అన్నారరు. మధ్యప్రదేశ్ డిజిపిగా ఉన్న శుక్లాను అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రోజుల క్రితమే బదిలీ చేసింది. వెంటనే సిబిఐ చీఫ్‌గా పదోన్నతి కల్పించడం విచిత్రం. సీనియారిటీ ఒక్కటే ప్రాతిపదిక కాదని, అవినీతి నిరోధక కేసుల్లో దర్యాప్తు చేసిన అనుభవం కచ్చితంగా వుండాలని, శుక్లాకు అలాంటి ఒక్క కేసు దర్యాప్తు చేసిన అనుభవం కూడా లేదని ఖర్గే స్పష్టం చేశారు. సిబిఐకి తాత్కాలిక డైరెక్టర్ నియామకానికి తాము సుముఖంగా లేమని, రెగ్యులర్ చీఫ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తన అభిప్రాయాన్ని వ్యక్తిచేసిన 24 గంటల్లోపే ఈ నియామకం జరగడం గమనార్హం. సిబిఐ డైరెక్టర్ పదవి చాలా సున్నితమైనది, ముఖ్యమైనదిగా మారిన నేపథ్యంలో తాత్కాలిక డైరెక్టర్ వంటి నియామకాలు జరపడం సరికాదని, దీనిపై కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నదో అర్థం కావడం లేదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలోక్‌వర్మ అనూహ్య నిష్క్రమణ తర్వాత జనవరి 10వ తేదీ నుంచి ఈ పదవి ఖాళీగానే వుంది. అవినీతి ఆరోపణలకు సంబంధించి అలోక్ వర్మ గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి రాకేష్ ఆస్థానాతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సిబిఐలో మోడీ సర్కారు జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కేంద్రం వర్మకు ఉద్వాసన పలికి ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక సిబిఐ డైరెక్టర్‌గా నియమించింది. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో వర్మ తిరిగి సిబిఐ డైరెక్టర్ అయ్యారు. కానీ మోడీ సర్కారు వేధింపులు మరీ ఎక్కువైపోవడంతో పాటు ఆయనను మోడీ ప్రభుత్వం ఆయనను అగ్నిమాపక దళానికి బదిలీ చేశారు. ఆ తర్వాత అతనే స్వయంగా రాజీనామా చేసి వెళ్లిపోయారు. వాస్తవానికి వర్మ 2017 ఫిబ్రవరి 1 నుంచి సిబిఐ చీఫ్‌గా వున్నారు. రెండేళ్ల పదవీకాలం కూడా ఈ శుక్రవారమే ముగిసింది.
సిబిఐకి కొత్త బాస్
RELATED ARTICLES