HomeNewsBreaking Newsసిబిఎస్‌ఇ ప్రశ్నాపత్రంపై రగడ

సిబిఎస్‌ఇ ప్రశ్నాపత్రంపై రగడ

స్త్రీలను కించపరచే పాసేజ్‌పై సర్వత్రా నిరసన
ప్రశ్న తొలగింపు : విద్యార్థులకు పదికి పది మార్కులు
సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు వెల్లడి
న్యూఢిల్లీ : స్త్రీలను కించపరచేవిధంగా, కేవలం వారిని కుటుంబంలో దాసీలుగా అణగిమణగి ఉండే వ్యక్తిగా చిత్రీకరించే తిరోగామి భావాలకు అనుగుణంగా సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) పదోతరగతి పరీక్షల ఇంగ్లీషు సాహిత్యం ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ‘కాంప్రెహెన్షన్‌ పాసేజ్‌’ పై వివాదం చెలరేగింది. ఈ ఇంగ్లీషు ప్రశ్నాపత్రంలో ఉన్న పాసేజీలో ఉన్న పేరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పెద్ద వివాదానికి దారి తీసింది. దీంతో సిబిఎస్‌సి బోర్డు అప్రమత్తమైంది, దానిని ప్రశ్నాపత్రం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులందరికీ ఈ ప్రశ్నకు సంబంధించిన పదికి పది మార్కులను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రశ్నాపత్రంలో స్త్రీని కేవలం దాసీగా, పాతకాలపు తిరోగామి భావాలు ప్రతిబింబించే వంటింటి సేవకురాలుగా పేర్కొనే ఒక కాంప్రెహెన్షన్‌ పాసేజ్‌ను సిబిఎస్‌ఇ ప్రశ్నాపత్రంలో పొందుపరిచారు. విద్యార్థుల గ్రహణ శక్తిని పెంపొందించేందుకు వీలుగా ఈ పాసేజ్‌ చదివి ఆ దిగువన ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. దీనికి పది మార్కులు కేటాయించారు. విద్యార్థులలలో ఈ విధంగా తిరోగమన భావాలను రెచ్చగొట్టే ధోరణులు, ఆ తరహా ప్రశ్నలపైన తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై రగడ రేగడంతో సిబిఎస్‌ఇ మేలుకొని ఆ ప్రశ్నాపత్రం నుండి ఆ కాంప్రెహెన్షన్‌ పాసేజ్‌ను ఉపసంహరించామని, విద్యార్థులు నష్టపోకుండా వారికి పదికి పది మార్కులు వేసేస్తామని ప్రకటించింది. సిబిఎస్‌సి ఈ విషయాన్ని ఆదివారంనాడు నిపుణుల కమిటీకి రిఫర్‌ చేసింది. వారి అభిప్రాయాలను తెలియజేయాలని, దాన్నిబట్టి మార్పులు చేర్పులకు వీలు ఉంటుందని పేర్కొంది. గడచిన శనివారంనాడు (డిసెంబరు 11వ తేదీ) ఈ పరీక్ష జరిగింది. “స్త్రీలకు దాస్య విముక్తి జరగడంవల్ల పిల్లలపై తల్లితండ్రుల ఆధిపత్యం ధ్వంసమైపోయింది. ఇలా దాస్య విముక్తి ఇచ్చే అంశం కేవలం కుటుంబంలో భర్త అనుసరించే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. భర్త సమ్మతికి అనుగుణంగానే స్త్రీకి ఇంట్లో దాస్య విముక్తి ఉంటుంది. ఇంట్లో భర్త చెప్పినట్టు భార్య నడుచుకోవాలి. అతడి అడుగు జాడల్లో నడవాలి. అప్పుడే ఇంట్లో తల్లి పిల్లల ఆదరాభిమానాలను చూరగొంటుంది, అలాగే స్త్రీగానీ, తల్లిగానీ భక్తి మార్గాన్ని అనుసరించినప్పుడే ఆ కుటుబంలో తల్లికి గౌరవం ఉంటుంది. ఆమె పిల్లలకు ఆమె పట్ల గౌరవ భావం ఉండేది కూడా అప్పుడే” అనే భావాలను వ్యక్తం చేసే పాసేజీలోని ఇంగ్లీషు వాక్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో ఈ విషయం పార్లమెంటు దాకా వెళ్ళింది. అయితే ఇది సిబిఎస్‌ఇ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని, దానికి అనుగుణంగా ప్రశ్నాపత్రం రూపొందలేదని రగడ జరిగింది. ఈ నేపథ్యంలో సంబంధిత నిపుణులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీకి ఇప్పటికే సిబిఎస్‌ఇ రిఫర్‌ చేసింది. దీనిపై సమగ్ర విశ్లేషణ చేసి, తగిన సిఫార్సులు ఇవ్వాలని కోరిందని సిబిఎస్‌ఇ పరీక్షల నియంత్రనాధికారి శాన్యం భరద్వాజ్‌ చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఆయన అన్నారు. ఈ ప్రశ్నకు జవాబు రాసిన విద్యార్థులకు పదికి పది మార్కులు ఇచ్చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం క్షమాపణకు సోనియాగాంధీ డిమాండ్‌
సిబిఎస్‌ఇ ఇంగ్లీషు సాహిత్యం పరీక్ష ప్రశ్నాపత్రంలో స్త్రీని కించపరచేవిధంగా, పాతకాలపు భావాలకు స్త్రీలను కట్టిపడేసేలా ప్రోత్సహించేవిధంగా ఉన్న కాంప్రెహెన్షన్‌ పాజేజ్‌లోని వాక్యాలపట్ల సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభ శూన్యగంట సమయంలో సోనిగాంధీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ విషయంపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్త్రీలకు అవమానకరమైన ఈ పేరాలోని వాక్యాలు ఉద్దేశపూర్వకంగానే బిజెపి ప్రభుత్వం రూపొందించిందని విమర్శించారు. దీనికి కారకులైనవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు. గడచిన శనివారంనాడు ఈ పరీక్ష జరిగింది.వెంటనే ప్రభుత్వం ఈ పాసేజ్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇది ప్రభుత్వం చేసిన తీవ్ర తప్పిదమని ఆమె ధ్వజమెత్తారు. దీనివల్ల విద్యార్థులు, యువతరం ఆత్మవిశ్వాసం కోల్పోతారని, వారి విజయాలకు, కెరీర్‌కు ఇది ఆటంకంగా ఉంటుందని అన్నారు. భార్యలు అందరూ భర్త అడుగు జాడల్లో నడిస్తే, భార్యలు భర్తకు దాసీగా ఉండినప్పుడే కుటుంబంలో పిల్లలు కూడా క్రమశిక్షణతో పెరుగుతారని, పిల్లలకు కూడా క్రమశిక్షణ అలవడుతుందని, భార్య విధేయంగా ఉండాలని ఈ పాసేజ్‌లోని వాక్యాల్లో వ్రాశారు. కాలం చెల్లిన అభిప్రాయాలతో ఆ పాసేజ్‌ను నింపేశారని, ఇది చాలా అపహాస్యంగా ఉందని ఆమె మండిపడ్డారు. స్త్రీ పురుష సమానత్వ భావనను ఇది అపహాస్యం చేస్తోందని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆమె కోరారు. ఇదే అంశాన్ని డిఎంకె, ఉయుఎంఎల్‌, ఎన్‌సిపి సభ్యులు కూడా లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విషయంపై నేషనల్‌ కాన్షరెన్స్‌తో సహా పైన పేర్కొన్న ప్రతిపక్షాలన్నీ నిరసన తెలియజేస్తూ సభ నుండి వాకౌట్‌ చేశాయి. విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి, దేశంలో యువతరంలో, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేవిధంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీ ఈ సందర్భంగా అన్నారు. సభలో తాను ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పారు. సిబిఎస్‌ఇ పరీక్షలను సజావుగా, జాగ్రత్తగా నిర్వహించేందుకు ఒక మార్గం కనుగొనాలన్నారు. వెంటనే ఈ పాసేజ్‌ను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సిబిఎస్‌ఇని కోరానన్నారు. స్త్రీ పురుష సమానత్వ అంశంపైన సున్నితమైన ఈ అంశంపైన సమీక్ష జరగాలని, విశ్లేషణ చేయాలని కూడా విద్యా మంత్రిత్వశాఖను కోరినట్లు ఆమె చెప్పారు.
ఇది బిజెపి పనే :
రాహుల్‌, ప్రియాంకా ఖండన
సిబిఎస్‌ఇ ప్రశ్నాపత్రలోని తిరోగామి భావాలపై కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాకాగాంధీ వాద్రా వేరు వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. వెంటనే ప్రభుత్వం దీనిపై సమీక్ష జరపాలని, విద్యారంగంలో స్త్రీ పురుష సమానత్వంపై విశ్లేషణ చేయాలని పేర్కొన్నారు. ఇది కుట్రపూరితంగా చేసినదేనని, బిజెపి ఈ పనికి పూనుకున్నాయని విమర్శించారు. ఈ మేరకు వారు వేరు వేరుగా ట్వీట్‌లు చేశారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments