కార్యవర్గంలోకి కన్హయ్యకుమార్
తిరోగమన శక్తులపై పోరాడుతాం : రాజా
ప్రజాపక్షం/న్యూఢిల్లీ ; భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు డి. రాజా ఎన్నికయ్యారు. సురవరం సుధాకరరెడ్డి స్థానంలో ఆయన ఆ బాధ్యతలను చేపట్టారు. మూడు రోజులపాటు ఢిల్లీలోని అజయ్‌భవన్‌లో జరిగిన సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఈ మేరకు రాజాను ప్రధాన కార్యదర్శిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారంనాడు జరిగిన పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని సురవరం సుధాకరరెడ్డి ప్రకటించారు. అలాగే, విద్యార్థి, యువజన నాయకుడు కన్హయ్యకుమార్‌ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఇటీవల షమీమ్‌ఫైజీ మృతిచెందడంతో ఏర్పడిన ఖాళీని కన్హయ్యకుమార్‌తో భర్తీ చేశారు. కృష్ణఝాను క్యాండిడేట్ సభ్యునిగా, మరో విద్యార్థి, యువజన నాయకుడు రామకృష్ణ పాండా (ఒడిశా), ఆలిండియా ఆదివాసీ మహాసభ నాయకుడు మనీష్ కుంజమ్ (ఛత్తీస్‌గఢ్)లను కార్యవర్గంలోకి ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డి.రాజా మీడియాతో మాట్లాడుతూ, దేశంలో తిరోగమన శక్తులకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరును కొనసాగిస్తుందని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫాసిస్టు పాలనలో దేశం క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందని విమర్శించారు. “ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలు చాలా తక్కువ స్థానాలు గెలిచివుండవచ్చు. పార్లమెంటులో మా బలం తక్కువై వుండవచ్చు. అంటే దానర్థం దేశంలో వామపక్షాలు క్షీణించిపోవ డం కాదు, అలాగే మా సైద్ధాంతిక, రాజకీయ ప్రభావం తగ్గిపోవడం దానర్థం కాదు” అని డి.రాజా అన్నారు. ఈ దేశ ప్రజలపై తాము ఎంతో ఆశాభావంతో వున్నట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఐక్యంగా పోరాడుతాయని రాజా చెప్పారు. “బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికల పోరులో మాత్రమే గెలిచి ఉండవచ్చు. అది సామాజిక, రాజకీయ విజయం కాదు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని మేం కోరుకుంటున్నాం. అలాగే కొత్త వ్యూహాలను రచిస్తాం” అని డి.రాజా చెప్పారు.