ప్రజాపక్షం/హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలకు బొగ్గు గనుల నిలయం, కార్మికోద్యమ కాణాచి మంచిర్యాల వేదిక కానుంది. ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్మాణ మహాసభలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే మంచిర్యాల నగరమంతా ఎర్రజెండాలు, బ్యానర్‌లతో అలంకరించారు. నగరంలోని కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో మూడు రోజుల పాటు మహాసభలను నిర్వహిస్తున్నారు. మహాసభ ప్రాం గణానికి ఇటీవల మరణించిన రైతు ఉద్యమ నాయకులు, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ గుర్రం యాదిగిరిరెడ్డి పేరు, సమావేశం జరిగే హాల్‌కు ప్రముఖ పాత్రికేయులు సి.రాఘవాచారి పేరు, ప్రాంగణానికి వచ్చే కాలేజీ రోడ్డుకు ట్రేడ్ యూనియన్ ఉద్యమ దిగ్గజం గురుదాస్ దాస్ గుప్తా పేరుతో నామకరణం చేశారు. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా నిర్మాణ మహాసభలను ప్రారంభిస్తారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గం భేటీ అయి మహాసభలో ప్రవేశపెట్టాల్సిన కార్యదర్శి నివేదిక, రాజకీయ, నిర్మాణ నివేదికలకు తుది మెరుగులు దిద్దుతుంది. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు సిపిఐ రాష్ట్ర సమితి సమావేశంలో ముసాయిదా నివేదికలను ఆమోదిస్తారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మహాసభలకు ముఖ్యఅతిథి డి.రాజాతో పాటు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా సందేశాలిస్తారు. అనంతరం ప్రతినిధుల సభలో చాడ వెంకట్‌రెడ్డి కార్యదర్శి, ఇతర నివేదిక ముసాయిదాలు ప్రవేశపెడతారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరుకానున్నారు. ఒకవైపు దేశంలో అధికార బిజెపి ఫాసిస్టు పోకడలను అనుసరిస్తుండడం, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పయనిస్తుండడం, మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం, ఆర్‌టిసి సమ్మె, ప్రజాస్వామ్య ఉద్యమాలను అణిచివేయడం, ఉద్యోగ నియామకాలు జరగకపోవడం వంటి పరిణామాలపై మహాసభ సమగ్రంగా చర్చించనుంది. అలాగే ఎన్నిక ఫలితాలపై ఆత్మవలోకనం చేసుకోనుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు, సైద్ధాంతిక అవగహనను కింది శాఖ నుండి పైవరకు పెంపొందించుకునే ప్రధాన ఉద్దేశ్యంతో నిర్మాణ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజైన ఫిబ్రవరి 24వ తేదీన నాయకత్వ ఎన్నిక జరుగుతుంది.
సిపిఐ నిర్మాణ మహాసభలు రేపటి నుంచే
RELATED ARTICLES