14న మహా ప్రదర్శన, బహిరంగసభ
నగర ముస్తాబుకు రేయంబవళ్లూ శ్రమిస్తున్న పార్టీ శ్రేణులు
అమరావతి : విజయవాడ నగరంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు జరగబోతున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలకు ఏర్పాట్లు శరవేగం గా సాగుతున్నాయి. మహాసభల ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పార్టీ శ్రేణులు రేయంబవళ్లూ శ్రమిస్తున్నా రు. మహాసభల ప్రారంభరోజున 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బిఆర్‌టిఎస్ రోడ్డు ఉత్తరం వైపు చివర మీసాల రాజారావు బ్రిడ్జి, పండ్ల మార్కెట్) నుంచి వేలాది మందితో మహా ప్రదర్శన జరగనుంది. ఈ ప్రదర్శనకు ఎపిలోని 26 జిల్లాలతో పాటు తెలంగాణా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో సిపిఐ, అనుబంధ సంఘాలకు చెందిన కార్మికులు, కర్షకులు, మహిళలు, యువతీయువకులు తరలి వస్తున్నారు. వీరందరూ ప్రదర్శనలో ఎర్రజెండా చేతబూని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ను ఎండగట్టేలా ప్లకార్డులు, జెండాలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 20 వేల జెండా కర్రలు తెప్పించారు. వీటన్నింటికి వలంటీర్లు జెం డాలు తగిలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మహా ప్రదర్శన అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం వరకు సాగుతుంది. అదే స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. ఈ ప్రదర్శన కొనసాగే రోడ్డు మార్గమంతా కమ్యూనిస్టు పార్టీ తోరణాలు, జెండాలు, బ్యానర్లు, ప్లెక్సీలు, హోర్డింగ్‌లతో ఎరుపు మయం చేసే పనిలో పార్టీ శ్రేణులు తలమునకలయ్యారు. అలాగే బహిరంగ సభా స్థలం జరిగే స్టేడియంలో కూడా అందరికీ సౌకర్యంగా ఉండేలా విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే ముఖ్య అతిథులు, విదేశాల నుంచి హాజరుకానున్న సౌహార్ద్ర ప్రతినిధులు సభాస్థలికి సునాయాసంగా చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రెస్ గ్యాలరీతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కోసం ప్రత్యేక వేదికను నిర్మిస్తున్నారు. సభా వేదికను సుమారు 100 మంది ఆశీనులవడానికి వీలుగా అత్యంత విశాలంగా, ఆకర్షణీయంగా ముస్తాబు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అలాగే ప్రజానాట్యమండలి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కోసం వేదికపై ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగే ఈ బహిరంగ సభలో ఉపన్యాసకులుగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, పార్లమెంటరీ పక్ష నాయకులు వినయ్ విశ్వం, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, అమర్‌జిత్ కౌర్, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ సిపిఐ సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణ మూర్తి పాల్గొంటారు. అలాగే ప్రఖ్యాత సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్ ఈ బహిరంగ సభలో విప్లవ గేయాలను ఆలపించనున్నారు. ఆహ్వాన సంఘం కోశాధికారి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ఈ ఏర్పాట్లన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈనెల 15వ తేదీ నుంచి 18 వరకు నాలుగు రోజులపాటు ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రతినిధుల సభలు జరుగనున్నాయి. ఇందుకోసం బందరు రోడ్డు నుంచి వేదిక వరకు ఆ వీధులన్నింటినీ స్వాగత బ్యానర్లు, పార్టీ తోరణాలతో ఆకర్షణీయంగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఇతర వామపక్ష పార్టీల ప్రధాన కార్యదర్శులు ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. మహాప్రదర్శనలో వేలాది మంది రెడ్‌షర్ట్ వలంటీర్లు, జనసేవాదళ్ సభ్యులు, విభిన్న కళాకారులు పాల్గొననున్నారు.
సిపిఐ జాతీయ మహాసభలకు ముమ్మర ఏర్పాట్లు
RELATED ARTICLES