భూపోరాటాలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎంపిని అడ్డుకున్న పోలీసులు
వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన పార్టీ శ్రేణులు, గుడిసెవాసులు
హన్మకొండలో ఉద్రిక్తత…
భూములు పంచేవరకు
పోరాటం ఆపేదిలేదన్న బినోయ్
ప్రజాపక్షం / వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వామపక్షపార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటాలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి, ఎంపి బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసిన పా్రంతాలను, ఉద్యమిస్తున్న గుడిసెవాసులను బినోయ్ విశ్వం కలవకుండా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, సిపిఐ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కమ్యూనిస్టు పార్టీ పేదల భూపోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, అనేక భూపోరాటాలకు
ఊపిరిలూదిన పోరాటాల గడ్డ ఓరుగల్లు నుండే మరో భూపోరాటానికి సిపిఐ నాంది పలికిందని ఎంపి బినోయ్ విశ్వంఈ సందర్భంగా చెప్పారు. పేదలందరికి భూములు పంచే వరకు పోరాటం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. భూపోరాటాలకు సంఘీభావం తెలిపేందుకు బుధవారం వరంగల్‌కు వచ్చిన బినోయ్ విశ్వం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం గుడిసెవాసుల ప్రాంతాలకు వెళుతుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బినోయ్ విశ్వంతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, వరంగల్, హన్మకొండ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రె భిక్షపతి, రెండు జిల్లాల సహాయ కార్యదర్శులు షేక్‌భాష్ మియా, పనాస ప్రసాద్, తోట భిక్షపతి, మాజీ ఎంఎల్‌ఎ పోతరాజు సారయ్య తదితర నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో భూకబ్జాదారులు, అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే సిపిఐ నాయకులను అడ్డుకుంటున్నారని సిపిఐ నాయకులు మండి పడ్డారు.
పోలీస్ స్టేషన్ ముట్టడి
అరెస్టు చేసిన సిపిఐ నాయకులను సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించిన విషయం తెలుసుకున్న సిపిఐ కార్యకర్తలు, గుడిసెవాసులు సుమారు వెయ్యి మంది అక్కడకు చేరుకుని పోలీసు స్టేషన్‌ను ముట్టడించి, స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ నాయకుల అరెస్టు, పోలీసు స్టేషన్ ముట్టడితో హన్మకొండలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు సిపిఐ కార్యకర్తలను శాంతింపజేసి ఎంపి బినోయ్ విశ్వం, ఇతర నాయకులతో మాట్లాడించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంజాల రమేష్, మండ సదాలక్ష్మి, ఆదరి శ్రీనివాస్, ఉట్కూరి రాములు, మద్దెల ఎల్లేష్, దండు లక్ష్మన్, గన్నారపు రమేష్, సంగి ఎలేందర్, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్ తదితరులు పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు. సిపిఐ నాయకుల అక్రమ అరెస్టులను జిల్లా వ్యాప్తంగా పలువురు పార్టీలు, నాయకులు ఖండించారు.
భూపోరాటాలకు సంపూర్ణ మద్దతు
హామీల అమలులో కెసిఆర్ విఫలం : ఎంపి బినోయ్ విశ్వం
వరంగల్ జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి, ఎంపి బినోయ్ విశ్వం చెప్పారు. ఈ భూపోరాటాలలో సిపిఐ ముందు వరుసలో నిలబడి మరో చరిత్ర సృష్టిస్తున్నదని చెప్పారు. వరంగల్ పర్యటనలో భాగంగా తొలుత ఆయన హరిత కాకతీయ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. దేశంలో భూ సమస్య ప్రధానమైనదని, స్వాతంత్య్రం వచ్చి 70 గడిచినా నేటికీ కోట్లాది మంది పేదలకు నివసించడానికి భూమి దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని డిల్లీలో బుల్డోజర్‌లు పెట్టి పేదల ఇండ్లు కూల్చివేస్తున్న దయనీయమైన పరిస్థితి ందన్నారు. అందరికీ భూమి పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని చెప్పారు. ఎన్నికల్లో అనేక హామీలిచ్చి తెలంగానాలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పాలకుల వైఫల్యం వల్లనే మళ్లీ భూపోరాటాలు పురుడు పోసుకుంటున్నాయన్నారు. వరంగల్ నగరంలో అనేక చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల అండతో రియల్ ఎస్టేట్ మాఫియా చెలరేగిపోతోందని ఆయన విమర్శించారు. నేడు సిపిఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు
వరంగల్, హనుమకొండ నగరాల్లో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న భూ పోరాట ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు బినోయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. అక్రమ అరెస్టులను ఖండిస్తూ, లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే పంపిణీ చేయాలని, 58 జిఓ ప్రకారం అర్హులైన వారికి ఇండ్ల సర్టిఫికేట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సిపిఐ పిలుపునిచ్చింది. అన్ని జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ చర్యలు సహించేదిలేదు
సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం ఖండన
ప్రజాపక్షం/న్యూఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో సిపిఐ చేపట్టిన భూపోరాటాలలో పాల్గొనేందుకు వెళ్ళిన సిపిఐ జాతీయ కార్యదర్శి, ఎంపి బినోయ్ విశ్వంను పోలీసులు నిర్భంధించి అనంతరం అరెస్ట్ చేయడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం తీవ్రంగా ఖండించింది. ప్రజా ఉద్యమాన్ని అణిచివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ చర్యలను సిపిఐ సహించేది లేదని సిపిఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బినోయ్ విశ్వం నిర్బంధానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాలని అన్ని రాష్ట్ర యూనిట్లకు సిపిఐ పిలుపునిచ్చింది. విశ్వం అరెస్టు వార్త తెలియగానే సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎంపి బినోయ్ విశ్వం తో ఫోన్లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
బినయ్ విశ్వం అరెస్టుకు చాడ ఖండన
సిపిఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు బినోయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు అరెస్టును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. హనుమకొండ హరిత
హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, వారిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్లో తరలించడం దారుణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలను కలిసి వారికి న్యాయబద్ధమైన ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరడానికి వచ్చిన సిపిఐ నాయకులు బినయ్ విశ్వ, టి.శ్రీనివాసరావు, సిపిఐ వరంగల్ ,హనుమకొండ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రే బిక్షపతి తదితర పార్టీ కార్యకర్తలను శాంతిభద్రతల సమస్య పేరుతో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బినయ్ విశ్వం అరెస్ట్ అప్రజాస్వామికం: ప్రొఫెసర్ కోదండరామ్
గుడిసెలు వేసుకున్న బాధితులకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన సిపిఐ ఎంపి బినోయ్ విశ్వంను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ జన సమితి (టిజెఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ఖండించారు. ప్రజల పక్షాన పోరాటం చేసేవారిని, బాధితులను పరామర్శించే నాయకుల పట్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారిస్తోందని విమర్శి ంచారు. ఉద్యమ పునాదులపైన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కనీసం నిరసన, సంఘీభావం తెలిపే ప్రజాస్వామ్యం హక్కు కూడా లేకుండా పోయిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖండన
వరంగల్ భూ పోరాటంలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఐ ఎంపి బినయ్ విశ్వం, సిపిఐ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావుతో పాటు సిపిఐ, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్. బాలమల్లేష్ ఖండించారు. రాష్ర్టంలో పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని పోరాటాలు చేయడం తప్పా అని వారు ప్రశ్నించారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం అరెస్ట్
RELATED ARTICLES