HomeNewsBreaking Newsసిపిఐ ‘చలో రాజ్‌భవన్‌' తీవ్ర ఉద్రిక్తత

సిపిఐ ‘చలో రాజ్‌భవన్‌’ తీవ్ర ఉద్రిక్తత

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నం
అడ్డగింత, పలువురు నాయకులతో పోలీసుల వాగ్వాదం
పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సహా పలువురు సీనియర్‌ నేతల అరెస్టు
వివిధ పోలీస్‌ స్టేషన్‌లకు తరలింపు
రాష్ట్ర నలుమూలల నుంచి రాజ్‌భవన్‌కు వస్తున్న సిపిఐ శ్రేణులు ఎక్కడికక్కడే కట్టడి…
ప్రజాపక్షం/హైదరాబాద్‌
గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సిపిఐ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాజ్‌భవన్‌ వైపునకు దూసుకెళ్ళేందుకు ప్రయత్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి సహా వందలాది మంది సిపిఐ, ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఏడు పోలీసు స్టేషన్‌లకు తరలించారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వివిధ జిల్లాల నుండి భారీగా సిపిఐ శ్రేణులు బుధవారం హైదరాబాద్‌కు తరలి వచ్చారు. వారంతా ఉదయం 10:30 గంటల ప్రాంతంలోనే ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఖైరతాబాద్‌ చౌరస్తాలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అక్కడి నుండి రాజ్‌భవన్‌ వైపునకు నిరసన ప్రదర్శనగా బయలు దేరిన సిపిఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సిపిఐ శ్రేణులు పోలీసులను తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్‌భవన్‌ వైపు నాయకులు, కార్యకర్తలు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోగా తోపులాట చోటు చేసుకుంది. పంజాగుట్ట రోడ్డు, ఖైరతాబాద్‌ ఫ్లు ఓవర్‌ వైపు నుంచి రాజ్‌భవన్‌ రోడ్డు వైపు దూసుకెళ్లారు. సిపిఐ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. అరెస్టులను అడ్డుకునేందుకు ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో పలువురు నాయకులకు గాయాలు అయ్యాయి. ‘చలో రాజ్‌భవన్‌’కు నేతృత్వం వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి, మాజీ ఎం.పి. సయ్యద్‌ అజీజ్‌ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్‌.బాల మల్లేశ్‌, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌ రావు, కళవేన శంకర్‌, బాల నర్సింహా, బాగం హేమంత్‌ రావు, ఇటి నరసింహ, వివిధ జిల్లాల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్‌ చేసి, నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే సిపిఐ కార్యకర్తలు నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా బైఠాయించారు.
నారాయణ పరామర్శ : అరెస్టయిన సిపిఐ నాయకులు, కార్యకర్తలను నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పరామర్శించారు. గవర్నర్‌ వ్యవస్థపై సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పోరాటాన్ని ప్రారంభించడం పట్ల అభినందనలు తెలియజేశారు. గవర్నర్‌లను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపెట్టుకొని బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తెలంగాణ, కేరళ, తమిళనాడులో గవర్నర్‌ల వ్యవహరిస్తున్న తీరు ఇందుకు అద్దం పడుతుందన్నారు. కాగా, బుధవారం నారాయణ జన్మదినం అని తెలియడంతో సిపిఐ కార్యకర్తలు అప్పటికప్పుడు కేక్‌ తెప్పించి పోలీస్‌ స్టేషన్‌లోనే కట్‌ చేయించారు.
ఎక్కడికక్కడే అరెస్ట్‌లు… పోలీస్‌ స్టేషన్‌లలో సిపిఐ శ్రేణుల నిరసనలు
ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి, పోలీస్‌ స్టేషన్‌లను తరలించారు. జూబ్లీబస్‌స్టేషన్‌, సికింద్రాబాద్‌ రైల్యేస్టేషన్‌, తార్నాక వైపు నుంచి ఖైరతాబాద్‌ వస్తున్న సిపిఐ శ్రేణులను అక్కడే అడ్డుకొని, సికింద్రాబాద్‌ పరిధిలోకి వచ్చే రామ్‌గోపాల్‌ పేట్‌, మహంకాళీ, మార్కెట్‌, గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, బేగంపేట్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడివారిని అక్కడే అరెస్ట్‌ చేసి, ఆయా పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. పోలీసుల అక్రమ అరెస్టులకు నిరసనగా పోలీస్‌ స్టేషన్‌లలోనే నాయకులు, కార్యకర్తలకు నిరసనకు దిగారు. రాజ్‌భవన్‌కు వెళ్తుండగా ఖైరతాబాద్‌ చౌరస్తాలో అరెస్టయిన వారిలో సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి విజయసారథి, జనగామ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రాజారెడ్డి, ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జున్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి బాలకిషన్‌, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శులు బి.వెంకటేశం, పల్లా దేవేందర్‌ రెడ్డి, మహ్మద్‌ ఇమ్రాన్‌, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, నాయకులు పుస్తకాల నర్సింగ్‌రావు, పంజాల రమేశ్‌, మహిళా సమాఖ్య అధ్యక్షులు ఉస్తేలా సృజన, ప్రధాన కార్యదర్శి ఎన్‌.జ్యోతి, ఛాయాదేవి, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్‌, బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు రంగాచారి, ఇన్సాఫ్‌ నాయకులు ఫయాజ్‌, ఎఐవైఎఫ్‌ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, నాయకుల సత్యప్రసాద్‌, నిర్లేకంటి శ్రీకాంత్‌, ఎఐఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, గళ్స్‌ వింగ్‌ కన్వీనర్‌ నాగజ్యోతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మినారాయణ ‘చలో రాజ్‌భవన్‌ ’ అంటూ రాసిన పాటను పల్లె నర్సింహా పాడుతుండగా ఖైరతాబాద్‌ చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌ చలో రాజ్‌భవన్‌కు బయలు దేరి వస్తుండగా ఆయన నివాసం వద్ద కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments