పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి
పెన్షనర్ల సమస్యలు
పరిష్కరించండి ఎంప్లాయీస్ జెఎసి
ప్రజాపక్షం/హైదరాబాద్
ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలను గత ప్రభు త్వం పరిష్కరించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా వెంటనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి, వాటిని పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జెఎసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సమస్యల పరిష్కారానికి మరో 15 రోజులలో తమ కార్యాచరణను రూపొందిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమించడానికైనా సిద్ధమేనని జెఎసి స్పష్టం చేసింది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగుల చందాలతో కూ డిన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలని, నాలుగు పెండింగ్ డిఎలను విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ ఎంప్లాయీ జెఎసి అధ్యక్షుడు,టిఎన్‌జిఒ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జెఎసి ప్రధాన కార్యదర్శి టిజిఒ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రా వు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టిఎన్‌జిఒ భవన్‌లో సోమవారం ‘తెలంగాణ ఎంప్లాయీస్ జెఎసి సన్నాహక సమావేశం’ జరిగింది. ఈ సమావేశంలో జెఎసి నాయకులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్(తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం), కె.రామకృష్ణ (డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ), ఎం.పర్వత్ రెడ్డి, జి.సదానందం గౌడ్(ఎస్‌టియు టిఎస్), శ్రీపాల్ రెడ్డి(పిఆర్‌టియుటిఎస్),మారెడ్డి అంజిరెడ్డి (టిఆర్‌టిఎఫ్), గో ల్కొండ సతీష్(టివిఆర్‌ఒ అసోసియేషన్)తో పాటు దాదాపు 53 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. 15 మందితో కూడిన స్టీరింగ్ కమిటీని జెఎసి నియమించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తదితర సమస్యల పరిష్కారానికి త్వరలోనే మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించింది. గచ్చిబౌలి టిఎన్‌జిఒ రెండవ దఫలోని 101.02 ఎకరాల స్థలాన్ని సొసైటీకి యాజమాన్య హక్కులు కల్పించాలని, ఉద్యోగ ,ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల పెన్షనర్లకు ఆదాయ పన్ను పరిమితిని పెంచేలా కేంద్ర ప్రభుత్వంపైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, సచివాలయంలో పిహెచ్‌ఒడి నుంచి 12.05 శాతం కోటను అమలు చేసి ఉద్యోగులను పంపించాలని, 317 జిఒలోని లోపాలను సవరించి, పిఒ 2018తో భవిష్యత్ ఉద్యోగ నియామకాలకు వర్తించినట్టుగా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. అంతర్ జోనల్ భార్య భర్తల బదిలీలు చేపట్టాలని, మెరుగైన ఫిట్‌మెంట్ పిఆర్‌సిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. సమావేశనంతరం జెఎసి ప్రతినిధులు మీడియాకు వివరాలను వెల్లడించారు.