టిఆర్‌ఎస్ ఎంపీల్లో టికెట్ల గుబులు
16 స్థానాల్లో సగానికిపైగా కొత్తవారిని పోటీకి దింపే అవకాశం
15, 16 తేదీల్లో సిట్టింగ్ ఎంపీలతో టిఆర్‌ఎస్ అధినేత సమావేశం
ఆ తరువాతే అభ్యర్థుల ప్రకటన
ప్రజాపక్షం/ హైదరాబాద్: టిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపిల్లో టెన్షన్ మొదలైంది. మరో సారి పోటీ చేసేందుకు అవకాశం వస్తుం దా? లేదా అని సిట్టింగ్ ఎంపీలు పార్టీ ముఖ్యుల ద్వారా ఆరా తీస్తున్నారు. టిఆర్‌ఎస్ పోటీ చేయనున్న16 లోక్‌సభ స్థానాల్లో సగం మంది కొత్తవారు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నెల 15,16న సిట్టింగ్ ఎంపిలతో టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ స్వయం గా సమావేశం కానున్నారు. వారితో భోజనం చేస్తూ మాట్లాడాలని నిర్ణయించారు. అప్పటి వర కు లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉండబోదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరిని ఎక్కడి నుంచి బరిలో దింపాలనే విషయమై కెసిఆర్ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఇదివరకే స్థానిక ఎంఎల్‌ఎల అభిప్రాయాలను తీసుకున్నారు. సిట్టింగ్‌లను మార్చే పరిస్థితి వస్తే సదరు సిట్టింగ్ ఎంపికి ప్రత్నామ్యాయ అవకాశాలను కల్పిస్తామని కెసిఆర్ హామీనిచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక ఎంపిని ఇతర నియోజకవర్గానికి మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వని నేతలకు మాత్రం కెసిఆర్ సంకేతాలు అందజేసినట్లు తెలిసింది. ఎంపి టికెట్‌ను ఆశించవద్దని, భవిష్యత్తులో ఇతర అవకాశాలు ఉంటాయని పలువురు ఆశావహులకు ముఖ్య నేతల ద్వారా సమాచారాన్ని చేరవేశారు. ప్రధానంగా స్థానిక ఎంఎల్‌ఎలతో మంచి సంబంధాలు ఉన్నవారిని, స్థానికంగా వ్యతిరేకత లేనివారిని మాత్రమే బరిలో దింపాలని కెసిఆర్ నిర్ణయించారు. అలాగే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించిన, అభ్యర్థుల విజయానికి కృషి చేయని ఎంపిలను పక్కన పెట్టనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మహబూబ్‌నగర్ నుంచి జితేందర్ రెడ్డిని తప్పిస్తే ఇక్కడ ఔషధ సంస్థల అధినేత ఎంఎస్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బదులుగా పారిశ్రామిక వేత్త రాజేంద్రప్రసాద్ పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును పరిశీలించినప్పటికీ ఒక వేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం దక్కకపోతే ఆయనను నల్లగొండ నుంచి అవకాశం లభించవచ్చని, అలాగే మరో వ్యాపార వేత్త నర్సింహారెడ్డి పేరును కూడా టిఆర్‌ఎస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ నుంచి మాజీమంత్రి పి.రాములు, పెద్దపల్లి నుంచి ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్ పేర్లు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నప్పటికీ పెద్దపల్లి విషయంలో మరో వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. చేవేళ్ల ఎంపిగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నప్పటికీ సబిత మాత్రం ఆ స్థానాన్ని తన కొడుకు కార్తీక్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని సిఎం కెసిఆర్‌కు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి రంజిత్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ సీటును తన కుమారుడు సాయికిరణ్‌కు ఇవ్వాలని ఇది వరకే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ దృష్టికి తీసుకెళ్లగా అందుకు సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. మహబూబాబాద్ సీటును మాజీ ఎంఎల్‌ఎ మాలోతు కవిత ఆశిస్తుండగా సిట్టింగ్ ఎంపి ప్రొఫెసర్ సీతారంనాయక్ మరోసారి అవకాశం దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు. కాగా మెదక్,నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, భువనగిరి,ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో సిట్టింగులే మరోసారి పోటీ చేయనున్నారు.