HomeNewsBreaking Newsసిజెఐగా జస్టిస్‌ లలిత్‌ ప్రమాణ స్వీకారం

సిజెఐగా జస్టిస్‌ లలిత్‌ ప్రమాణ స్వీకారం

49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందన : తండ్రి ఆశీర్వాదం
న్యూఢిల్లీ :
భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యుయు లలిత్‌ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, పదవీ విరమణ చేసిన 48వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, కిరెన్‌ రిజిజు సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ ప్రమాణం అనంతరం రాష్ట్రపతి ఆయనకు అభినందనలు తెలియజేశారు. 90 ఏళ్ళు దాటిన తండ్రి ఉమేశ్‌ రఘునాథ్‌ లలిత్‌ ఆశీర్వాదాన్ని జస్టిస్‌ లలిత్‌ తీసుకున్నారు. లలిత్‌ తండ్రి ఉమేశ్‌ 1975లో బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. సోలాపూర్‌ పర్యటనకు వచ్చిన మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూలకు ఉమేశ్‌ అధ్యక్షతనే వారికి పౌర సన్మానాలు జరగడం ఒక విశేషం. జస్టిస్‌ లలిత్‌ ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘బార్‌’ నుండి నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన రెండవ వ్యక్తి జస్టిస్‌ యుయు లలిత్‌. 74 రోజులు అతి తక్కువ సమయం మాత్రమే ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నవంబరు 8వ తేదీన లలిత్‌ పదవీ విరమణ చేయనున్నారు. అప్పటికి ఆయన వయసు 65 ఏళ్ళు పూర్తవుతాయి. సుప్రీంకోర్టులో ఉన్న ఆరుగురు అత్యంత అనుభవజ్ఞులైన న్యాయమూర్తులలో లలిత్‌తోపాటు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కూడా ఒకరు. అయితే చంద్రచూడ్‌ ఈ పదవిని అలంకరించే రేసులో లేరు. 1971లో మొదటిసారి జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రి సుప్రీంకోర్టు అత్యున్నత 13వ ప్రధాన న్యాయమూర్తి పదవిని నేరుగా అలంకరించిన మొదటి న్యాయవాదిగా రికార్డు సాధించారు. 1964లో జస్టిస్‌ సిక్రి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా నియమితులయ్యారు. ఆయన తరువాత లలిత్‌ ఈ ఘనత పొందారు. 2014 ఆగస్టు 13వ తేదీన అత్యున్నత న్యాయస్థానంలో నియమితులయ్యేవరకూ సీనియర్‌ న్యాయవాదిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. త్రిపుల్‌ తలాక్‌ చెల్లదని, అది చట్టవిరుద్ధమని జస్టిస్‌ లలిత్‌ సారథ్యంలోని ధర్మాసనమే తీర్పు ఇచ్చింది. దీంతోపాటే ఆయన సారథ్యంలోని ధర్మాసనం ఎన్నో మైలురాళ్ల వంటి తీర్పులు వెలువరించింది. శరీరం మధ్య నేరుగా అనుసంధానం ఉన్నప్పుడే అత్యాచారంగా పరిగణించాలని దుస్తులు తొలగించకుండా జరిగే ప్రయత్నం లైంగికదాడి పరిధిలోకి రాదని, అది నేరం కాదని పోస్కో చట్టం కింద బోంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పు సరైనది కాదంటూ జస్టిస్‌ లలిత్‌ కొట్టివేశారు.
ముఖ్యమైన కేసులకు ప్రాధాన్యం…రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటు
భవిష్యత్‌ ప్రణాళికను జస్టిస్‌ లలిత్‌ ప్రకటించారు. అత్యంత ప్రాధాన్యంగల కేసులకు విచారణ తేదీలు ప్రకటించడం, తక్షణ ప్రాతిపదికపై పరిష్కరించవలసిన కేసులను గుర్తించి పరిష్కరించడంతోసహా మూడు అంశాలపై తాను 74 రోజుల పదవీకాలంలో ప్రధానంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని జస్టిస్‌ లలిత్‌ ప్రకటించారు. కీలకమైన ఎన్నో కేసులు విచారణ తేదీలకు నోచుకోకుండా ఉండిపోతున్నాయని, వాటిని పరిశీలించి జాబితాలో చేర్చడానికి సమయం లేకపోయిందని, ప్రతిరోజూ తాము అగ్నిమాపకదళ సిబ్బంది తరహాలో మునివేళ్ళపై పనిచేయవలసి వస్తోందని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శుక్రవారం పదవీ విరమణ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. విస్తృత ధర్మాసనాల ఏర్పాటుకు కృషి చేస్తానని లలిత్‌ అన్నారు. ఏడాది అంతటా అవిరామంగా పనిచేసేలా కనీసం ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు తాను గట్టిగా పాటుపడతానన్నారు. దీంతో లలిత్‌ పదవీకాలంలో అతిముఖ్యమైన ఎన్నో కేసులు తెరమీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జమ్మూ కశ్మీరులో 370వ అధికరణ రద్దు అంశం, కర్మాటకలో హిజాబ్‌ ధారణ అంశం, రాజ్యాంగంలోని 103వ అధికరణ సవరణ అంశం (ఆర్థిక బలహీనవర్గాలకు రిజర్వేషన్లు), వాట్సాప్‌ గోప్యతా విధానం, చట్టసభల్లో సభ్యులు ఓటు వేసేందుకు లేదా ప్రసంగించడానికి లంచం తీసుకోవడాన్ని నేరంగా పరిణించకుండా రక్షణ పొందటం వంటి అనేక అంశాలు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాల పేరిట పెండింగ్‌లో ఉన్నాయి. ఆగస్టు 29 నుండి ఐదుగురు సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేస్తారు. రాజ్యాంగంతో ముడిపడి ఉన్న కీలకమైన కేసులను ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనాలకు రిఫర్‌ చేయాలని ఇటీవలనే సర్వోన్నత న్యాయస్థానం నోటిఫై చేసింది. ఇలాంటి కేసులు సుమారు 25 పైగా ఉన్నాయి.
ఈమధ్య నుండే లలిత్‌ సారథ్యంలో ఉన్న ధర్మాసనం కోర్టు సమయానికి ఒక గంట ముందుగానే విధులకు హాజరై కేసుల విచారణ చేపడుతున్నది. ఉదయం 9 గంటలకే కోర్టు విధులకు వస్తే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, అదే ఆదర్శవంతమైన సమయమని, సాయంత్రం ఇంటికి వెళ్ళి రేపటి కేసుల ఫైళ్ళ అధ్యయనానికి, ఇతర పనులకు మనకు గంపెడంత సమయం ఉంటుందని లలిత్‌ గట్టి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఆయన ఉదయం 9.30 గంటలకే ఇటీవల కాలంలో ఆయన విధులకు హాజరవుతున్నారు. “మన పిల్లలు ఉదయం ఏడు గంటలకే లేచి తయారై స్కూళ్ళకు వెళుతున్నప్పుడు మనం ఎందుకు అదే సమయానికి తయారై ఉదయం 9.00 గంటలకల్లా కోర్టు విధులకు హాజరుకాలేం?” అని ఆ మధ్య ఒక కేసు విచారణ సందర్భంగా లలిత్‌ ప్రశ్నించారు.1957 నవంబరు 9వ తేదీన మహారాష్ట్ర సోలాపూర్‌లో జన్మించిన లలిత్‌ ముంబయి ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయవాది పట్టా తీసుకున్నారు. 1985 వరకు రెండేళ్ళు బోంబే హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. నాగపూర్‌ ధర్మాసనంలోఅదనపు న్యాయమూర్తిగా పనిచేశారు.1986లో ఢిల్లీ వచ్చారు. 2004 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఎదిగారు. 2జి స్రెక్ట్రమ్‌ కేసు విచారణ నిమిత్తం ఆయనను సిబిఐ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా నియమించారు. జస్టిస్‌ లలిత్‌ తో కలిపితే దేశంలో ప్రధాన న్యాయమూర్తులుగా 100 రోజులలోపు పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారు ఇప్పటివరకూ ఆరుగురు అవుతారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments