న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ముద్రవేసిన ప్రసం గ పాఠాన్ని అక్షరం పొల్లుపోకుండా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చదవి విన్పించారు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలను చవిచూస్తున్న పౌరసత్వ సవరణ చట్టం అద్భుతం, చారిత్రాత్మకమంటూ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం పట్ల సభలో గందరగోళం నెలకొన్నది. సిగ్గుసిగ్గు అం టూ ప్రతిపక్షపార్టీల సభ్యులు ఎద్దేవా చేస్తుండగానే, కోవింద్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మహాత్మాగాంధీ ఆకాంక్షలు నెరవేర్చేందుకే కొత్త పౌరసత్వ చట్టాన్ని తీసుకువచ్చినట్లు కోవింద్ చెప్పారు. ఇది చారిత్రాత్మకమని చెప్పుకొచ్చారు. నిరసనల పేరుతో హింస సృష్టించడం సరికాదన్నారు. అది సమాజాన్ని, దేశాన్ని బలహీన పరుస్తుందని అన్నా రు. రాష్ట్రపతి ప్రసంగంలో సిఎఎ అంశమే ప్రధానంగా చోటు చేసుకుంది. పాకిస్థాన్‌లో మైనారిటీల కు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులను కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని నిరసి స్తూ ప్రతిపక్ష సభ్యులు నల్లబ్యాడ్జీలతో ‘సిగ్గుసిగ్గు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బిజెపి సభ్యులు లేచినిలబడి, రాష్ట్రపతి ప్రసంగాన్ని సమర్ధిస్తూ బల్లలు చరిచారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. సిఎఎకు తమ వ్యతిరేకతను తెలియజేస్తూ తొలి వరుసలో కూర్చోవాల్సిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజ్యసభలో ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్‌లు వెనుక బెంచీలో కూర్చొన్నారు. రాష్ట్రపతి ప్రసంగం హిందీలో 70 నిమిషాలపాటు సాగింది. పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ శతాబ్దం భారతీయ శతాబ్దమని, ఈ దశాబ్దం భారతీయ దశాబ్దమని అభివర్ణించారు. అన్ని రకాల విశ్వాసాలను దేశంలో గౌరవిస్తారని, అయితే దేశ విభజన సమయంలో భారత్‌లో ఎక్కువమంది విశ్వసించే (మెజారిటీ మతస్థులు) వారిపై దాడి జరిగిందని చెప్పారు. పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కులు అక్కడ బతకాలని అనుకోవడం లేదని, వారంతా భారత్‌లోకి రావాలని ఆశిస్తున్నారని, వారికి సాధారణ జీవితాన్ని ప్రసాదించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై వుందని అన్నారు. అందుకే పౌరసత్వ చట్టాన్ని సవరించినట్లు చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ, భవిష్యత్ మరింత గొప్పగా వుండేలా స్థానిక ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం వుందన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా వున్నాయని, విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయని చెప్పా రు. సుప్రీంకోర్టు అయోధ్యపై ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత బలం చేకూర్చిందని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజలకు అన్ని హక్కులు కల్పించిన ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజల్లో ఆనందాన్ని నింపిందని చెప్పారు.