రెండు మృతదేహాల గుర్తింపు
ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్‌శాఖ వెల్లడి
భవనాన్ని కూల్చివేయాలని మంత్రి తలసాని ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్ సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ మాల్ ఆరు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాద సంఘటనలో డ్రోన్ కెమెరాల ద్వారా రెండు మృతదేహాలు గుర్తించారు. మరో వ్యక్తి మృతదేహం కూడా భవనంలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నప్పటికీ అధికారులు ఇంకా నిర్థారించలేదు. అయితే
భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురు కార్మికులు బీహార్ రాష్ట్రానికి చెందిన వసీం, జహీర్, జునైద్ అని అధికారులు తెలిపారు. భవనం వెనక భాగంలో ఉన్న శిథిలాలలో ఈ మృతదేహాలు గుర్తించినట్లు డ్రోన్ కెమెరా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు తెలియజేశారు. గురువారం ఉదయం ఈ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి శుక్రవారం రాత్రి వరకూ మంటలు అదుపులోకి రాలేదు. సెల్లార్‌లోని గోడౌన్లో మంటలు చోటుచేసుకుని భవనం అంతటకూ మంటలు వ్యాపించడంతో భవనంలోని పలు అంతస్తులు బుగ్గి అయ్యాయని స్థానికులు అధికారులు వెల్లడించారు. రెగ్జిన్ మెటీరియల్, స్పోర్ట్ యూనిఫారమ్స్, ప్లాస్టిక్ వస్తువులు, సింథటిక్ రసాయనిక పదార్థాలు ఈ మంటల్లో కాలిబూడిదయ్యాయి. గోడౌన్లో భారీయెత్తున నిల్వలు ఉంచటంతో తీవ్రస్థాయి అగ్ని ప్రమాదానికి కారణమైందని అధికారులు, కాలనీవాసులు తెలియజేశారు. తొలుత క్రేన్ సహాయంతో మొదటి అంతస్థులోపల గాలించిన అధికారులు హైడ్రాలిక్ క్రేన్‌ను బిల్డింగ్ పైనుంచి ఉపయోగించి పరిశీలించినా ఫలితం లేకపోవడంతో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. దాదాపు 24 గంటలకు పైగా సమయం తీసుకున్నా మంటలు అదుపులోకి రాని నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బిల్డింగ్‌ను కూలగొట్టి చుట్టుపక్కల భవనాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను పిలిపించుకుని సమీక్షించారు. భవనం నిర్మాణం కోసం 2006లో యజమానులు సెల్లార్ గ్రౌండ్, 4 అంతస్తులకు అనుమతి తీసుకుని భవన నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత 2016లో బిఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని జిహెచ్ఎంసి సంబంధిత ఉన్నతాధికారులు తెలియజేశారు.
భవననిర్మాణం వీక్‌గా ఉంది
వరంగల్ ఎన్ఐటి ప్రొఫెసర్ రమణారావు
జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు భవనం స్టెబిలిటీని గుర్తించేందుకు వరంగల్ జిల్లాకు చెందిన నిపుణులు నిట్ ప్రొఫెసర్ రమణారావును పిలిపించారు. ప్రొఫెసర్ రమణారావు నేతృత్వంలోని నిపుణుల బృందం భవనంలో పరిస్థితిని క్రేన్ సహాయంతో పరిశీలించింది. డెక్కన్ మాల్ భవనం వీక్‌గా ఉందని నిర్థారించారు. బిల్డింగ్‌ను కూలగొడితే చుట్టుపక్కల భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని వివరించారు.
కూల్చివేతకు మూడునాలుగు రోజులు?
మాలిక్ ట్రేడింగ్ సంస్థ ప్రతినిధులు
భవనాన్ని కూల్చివేయాలన్న మంత్రి తలసాని ఆదేశం మేరకు జిహెచ్ఎంసి అధికారులు మాలిక్ ట్రేడింగ్, డిమాలిషన్ సంస్థను సంప్రదించారు. సంస్థ ప్రతినిధులు డెక్కన్ నైట్‌వేర్ స్టోర్ భవనం ఎత్తు, ఆకారం, గదుల నిర్మాణం పరిశీలించారు. కూల్చివేతకు మూడు లేదా నాలుగు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణం కాదు
శాఖ డివిజనల్ ఇంజినీర్ శ్రీధర్
డెక్కన్ నైట్‌వేర్ స్టోర్ భవనంలో అగ్ని ప్రమాదానికి షాట్ సర్యూట్ కారణం కాదు. గురువారం ఉదయం 11గంటలకు అగ్నిప్రమాదం సమాచారం అందింది. వెంటనే భవనానికి విద్యుత్ సరఫరా నిలిపివేశాం. షార్ట్ సర్క్యూట్ అయినట్లయితే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అవుతుంది. మంటలు వ్యాపిస్తే తీగలు, పూర్తిగా కాలిపోయి ఉండేవి. మంటలు వ్యాపిం చిన సమయంలో మీటర్లో కరెంట్ ఉన్నది. షార్ట్ సర్యూట్ వల్ల అగ్నిప్రమాదం అనేది వాస్తవం కానేకాదు.
సెల్లార్ నుంచే అగ్నిప్రమాదం
డిసిపి రాజేశ్చంద్ర
మంటలు వ్యాపించింది సెల్లార్ నుంచే అని మాకు అందిన సమాచారం. షాప్ ఓపెన్ చేసినప్పుడు సెల్లార్లో మంటలు రావడంతో పై ఫ్లోర్లో ఉన్న సరుకును తీసుకువచ్చేందుకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు ప్రమాదంలో చిక్కుకుపోయారని తెలిసింది. భవనం మొత్తం మంటలు అంటుకున్నాయి. అదుపులోకి రావడానికి చాలా సమయం పడుతోంది. ఈ భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటున్నాం. ఎఫ్ఐఆర్తో పాటు రిపోర్టులు అన్నీ తీసుకుని కేసును పటిష్టంగా రూపొందించి కోర్టుకు సమర్పిస్తాం. పోలీస్ శాఖ చుట్టు పక్కల వారిని అలెర్ట్ చేసి వారికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకుంది. బిల్డింగ్ కూల్చివేసినా నష్టం జరగకుండా అన్ని కోణాలలో జాగ్రత్తలు వహిస్తాం.
నిబంధనలకు విరుద్ధంగా భవనాల రెగ్యులరైజేషన్
కిషన్‌రెడ్డి
అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ వద్దకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేరుకున్నారు. పరిస్థితికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులతో మాట్లాడారు. తమ బడ్జెట్‌ను పెంచుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను పాటించకుండా విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చింది. అక్రమకట్టడాలను రెగ్యులరైజ్ చేస్తోంది. అగ్నిప్రమాదంలో నష్టపోయిన సమీపంలోని బస్తీ వాసులను ప్రభుత్వం ఆదుకోవాలి. పరిహారం అందజేయాలి.
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన రంగంలోకి డ్రోన్లు
RELATED ARTICLES