న్యూఢిల్లీ: పౌరసత్వం (సవరణ) చట్టానికి సంబంధించిన సమస్యలు భారతదేశానికి చెందినవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారని నొక్కి చెప్పారు.తన పర్యటన రెండవ(చివరి) రోజున మోడీతో సమగ్ర చర్చలు జరిపిన ట్రంప్ ‘ఈ రెండు రోజులు గొప్పవి, అద్భుతమైనవి’ అని అన్నారు.‘నేను వివాదాస్పదంగా ఉండదలచుకోలేదు. ఎందుకంటే… ఒక ప్రశ్నకు జవాబిచ్చి నేను తేనెతుట్టను కదపదలచుకోలేదు. జాన్ వంటి వారు నన్నో చిన్న ప్రశ్న అడుగుతారు. మీరు దాన్ని గోరంతలు కొండంతలు చేస్తారు. దాంతో నా పర్యటన మొత్తం వివాదాస్పదంగా మారిపోతుంది. మీరేమి అనుకోకుంటే నేను నా సమాధానాలివ్వడంలో సాంప్రదాయికంగా ఉంటాను’ అని ట్రంప్ విలేకరుల సమావేశంలో అన్నారు. కశ్మీర్ సమస్య భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న పెద్ద సమస్య అని ట్రంప్ చెప్పారు. ఇరు పక్షాల ప్రజలకు అది ముల్లు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సడలించేందుకు తాను మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమే’అని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ‘మధ్యవర్తిత్వానికి అవకాశం ఉంటే తప్పక నేను చేస్తాను’ అన్నారు. తాను మోడీతో జరిపిన చర్చల్లో కశ్మీర్ విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు. ‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కూడా నాకు మంచి సంబంధమే ఉంది. వారు సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు’ అన్నారు. మోడీతో జరిపిన సమగ్ర చర్చల సందర్భంగా తాను మత స్వేచ్ఛ గురించి చర్చించానని, ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని భారత నేత కోరుకుంటున్నారని తెలిపారు. భారత్‌లో ముస్లింల పట్ల వివక్ష ఆరోపణపై ప్రశ్నించినప్పుడు ట్రంప్ ‘ దీనిపై మేము చర్చించాము. ముస్లింలతో చాలా సన్నిహితంగా తాము పనిచేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు’ అని సమాధానం ఇచ్చారు. మోడీని ‘అద్భుతమైన‘ నాయకుడిగా, భారత్‌ను ‘అద్భుతమైన దేశం‘ గా ట్రంప్ అభివర్ణించారు. ‘మేము మత స్వేచ్ఛ గురించి మాట్లాడాము. భారతదేశంలో ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారు … మీరు వెనక్కి తిరిగి చూస్తే , భారత్ మత స్వేచ్ఛ కోసం ఎంతో కృషి చేసిందని తెలుస్తుంది’ అని ట్రంప్ అన్నారు.
కొత్త పౌరసత్వ చట్టం(సిఎఎ) గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ప్రతిస్పందిస్తూ ‘నేను సిఎఎపై ఏమీ చెప్పదలచుకోలేదు. ఇది భారత్‌కు సంబంధించింది. భారత్ తన ప్రజల విషయంలో సరైన నిర్ణయమే తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను’ అని జవాబిచ్చారు. ‘తన పర్యటన సందర్భంగా జరుగుతున్న హింస సంఘటనలపై చర్చించారా?’ అని అడిగిన ప్రశ్నకు, తాను వ్యక్తిగత దాడుల గురించి చర్చించలేదని, ‘అది భారత్‌కు సంబంధించింది’అని చెప్పారు. అమెరికా నుంచి భారత్ పెద్ద మొత్తంలో మిలిటరీ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేస్తోందని అన్నారు.
సిఎఎ భారత్ స్వవిషయం మత స్వేచ్ఛకు మోడీ కృషి
RELATED ARTICLES