HomeNewsTelanganaసిఎఎతో భారతదేశ ఉనికికే ప్రమాదం

సిఎఎతో భారతదేశ ఉనికికే ప్రమాదం

సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌పాషా
హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఇన్సాఫ్‌ నిరసన
ప్రజాపక్షం / హైదరాబాద్‌ ఎంతో వివాదాస్పదమైన సిఎఎ చట్టాన్ని కేం ద్రంలోని బిజెపి ప్రభుత్వం మళ్లీ తీసుకురావడమనేది ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న విలువను ఔన్నత్యాన్ని తగ్గిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపి, ఆల్‌ఇండియా తంజీమ్‌ ఎ ఇన్సాఫ్‌ జాతీయ అధ్యక్షులు సయ్యద్‌ అజీజ్‌పాషా, ఇన్సాఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మునీర్‌ పటేల్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండి ఫయాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సిఎఎతో భారతదేశం ఉనికి ప్రమాదంలో పడుతుందని వారు హెచ్చరించారు. సిఎఎ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఇన్సాఫ్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లిబర్టీ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్‌పాషా, ఎస్‌ఎండి ఫయాజ్‌, మునీర్‌ పటేల్‌ మాట్లాడుతూ 2019లో కూడా ఇలాగే సిఎఎ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తే దేశంలోని మైనారిటీలు, కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు తదితర అనేక వర్గాలకు చెందిన ప్రజలంతా పెద్దఎత్తున ప్రతిఘటించి ఢిల్లీ నగరంలో షహీన్‌బాగ్‌ వద్ద నెలల తరబడి నిర్విరామ ఉద్యమం కొనసాగించారని, ఆ ఉద్యమంతో వెనుకడుగు వేసి న బిజెపి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని ప్రధాని మోడీ ప్రభుత్వం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు. సిఎఎ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో అమలు చేయనీయబోమని ఇన్సాఫ్‌ నేతలు ప్రకటించారు. ఇంతకుముందు జరిగిన ఆందోళనలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు బలి తీసుకోవడానికి బిజెపి ప్రభు త్వం ఈ రకమైన చట్టాలను తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం లౌకిక దేశమని సకల భాషలు, సకల జీవన విధానాలు, అనేక మతాలు, అనేక కులాలతో కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే భారతదేశంలో కులం మతం పేరుతో చిచ్చు పెట్టి ప్రజల మధ్య విభజన రేఖను గీసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న మోడీ ఎన్‌డిఎ ప్రభుత్వ విధానాలను కొనసాగించబోమని ఈ అంశంపై పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఇది కేవలం ఒక ముస్లిం మైనారిటీలకు సంబంధించిన అంశమే కాదని, ఇది మొత్తం భారతదేశానికి సంబంధించిన విషయమని, ఇందులో దేశాన్ని ప్రేమించే ప్రతి పౌరుడు స్పందించి ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ ఫ్యూడల్‌ భావజాల విధానాన్ని తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్‌ రాష్ట్ర నాయకులు సంశుద్దీన్‌, హైకోర్టు అడ్వకేట్‌ అఫ్జల్‌ ఖాసిం, ఉజ్మ షకీర్‌ తైమస్‌, నదీమ్‌, ఎండి.యూసుఫ్‌, ఎండి.రుక్మత్‌, పెద్ద సంఖ్యలో మహిళలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments