ధర్నాలు, రాస్తారోకోలు, రాష్ట్ర బంద్ కార్యక్రమాలు
అఖిలపక్షంతో చర్చించి బిసి రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాలి
ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో బిసి నేతల హెచ్చరిక
ప్రజాపక్షం / హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒను తక్షణం ఉపసంహరించుకోవాలని బిసి నాయకులు డిమాండ్ చేశారు. బిసి సంఘాల నాయకులు, అఖిలపక్ష నేతలు, న్యాయనిపుణులతో చర్చిం చి రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాలని పంచాయతీ ఎన్నికలను 34 శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సిఎం స్పందించకుంటే రాజకీయాలకతీతంగా ఉమ్మడి ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటామని, ధర్నాలు, రాస్తారోకోలు, రాష్ట్ర బంద్ వంటి ఆందోళన కార్యక్రమాలను దశలవారీగా చేపడుతామని హెచ్చరించారు. బిసి రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడానికి వ్యతిరేకంగా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద బిసిలు మహాధర్నా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ ధర్నాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, జాతీయ బిసి కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బిసి హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పాండురంగాచారి, చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ), బిసి సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఆదరించిన బిసిలపైనే ముఖ్యమంత్రి కెసిఆర్ కక్షగట్టారని విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసి రిజర్వేషన్లను 34 నుండి 23 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారన్నా రు. రిజర్వేషన్ల సమస్యపై 24 గంటల్లోగా అఖిలపక్షం, మేధావులు, బిసి సంఘా లు, న్యాయనిపుణులతో చర్చించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశారు.