సర్వత్రా ఇదే చర్చ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు
ప్రజాపక్షం/ ఖమ్మం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క పదాన్ని ఉపయోగించడం.. దానికి విదేశీ కుట్రను లింక్ కలపడంతో రాష్ట్రంలోని వరద వ్యవహారం పక్కదారి పట్టింది. వరద నష్టం తదనంతర పరిణామాలు వదిలి క్లౌడ్ బరస్ట్‌పై అధికార, విపక్ష పార్టీల విమర్శల పర్వం సాగుతుంది. ఆదివారం భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు ప్రాంతా ల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో క్లౌడ్ బరస్ట్ జరిగిందని అనుమానం వెలిబుచ్చటమే గాక విదేశీ కుట్ర ఉందన్న అనుమా నం వ్యక్తం చేశారు. ఆ నిమిషం నుంచి వరదల వ్యవహారం పక్కదారి పట్టింది. కెసిఆర్ ఆ మాటలను యధాలాపంగానో, అనకూడదనుకునే అనలేదు. మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం లేదా పరిస్థితిని తన వైపుకు తిప్పుకోవడం కెసిఆర్‌కు కొత్తేమీ కాదు. గోదావరికి వరదలు ప్రారంభమైన నాటి నుండి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యంగా కాంగ్రెస్, బిజెపి రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగాయి. కోట్ల రూపాయలు నీళ్ల పాలయ్యాయంటూ విమర్శలు చేయడంతో పాటు వరద బాధిత ప్రజలను ఆదుకోవడంలో కానీ అంచనాలు వేయడంలో కానీ ప్రభుత్వం విఫలమైందందని విపక్షాలు ఆరోపించాయి. 36 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వచ్చిన వరదను తట్టుకునేవిధంగా అధికార యంత్రాంగం సన్నద్ధం కాలేదన్న విమర్శ వచ్చింది. ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని, కనీసం బాధితులను పరామర్శించ లేదని ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో కెసిఆర్ భద్రాచలం పర్యటనకు వచ్చారు. బాధితులకు హామీ, ఇతర వ్యవహారాలు ఎలాగున్నా క్లౌడ్ బరస్ట్ చేయడం వల్లే గోదావరి పరీవాహక ప్రాంతం ముంపునకు గురైందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీని వెనుక విదేశీ కుట్ర ఉందనడంతో ఈ మాటలు జాతీయ స్థాయి చర్చకు కూడా దారి తీశాయి. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, దాని పరిణామం ఎలా ఉంటుందన్న దానిపై ఒక్కసారిగా తెలంగాణ సమాజం దృష్టిసారించింది. క్లౌడ్ బరస్ట్ (మేఘాల విస్పోటనం) జరిగితే నిర్థిష్ట ప్రాంతంలో వర్షం కురవదని గోదావరికి వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ వల్ల వచ్చినవి కాదని వాతావరణ నిపుణులు తేల్చారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఇబ్బందులు పడ్డారన్న చర్చ పక్కదారి పట్టి క్లౌడ్ బరస్ట్ అనుకూల, వ్యతిరేక ప్రకటనలకు వేదికైంది. బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఇది అతిపెద్ద జోకుగా వర్ణిస్తే… కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మరో విధంగా స్పందించారు. దీనికి టిఆర్‌ఎస్ నేతల ఖండనలు. మొత్తంగా వరద నష్టం బాధితుల ఇబ్బందులు మొత్తం కూడా క్లౌడ్ బరస్ట్ వైపు మళ్లాయి. దటీజ్ కెసిఆర్ అంటూ కొంత మంది వ్యాంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గోదావరికి వరదలు రావడానికి అంతర్జాతీయ కుట్ర అన్న దానిపై సోషల్ మీడియాలో కెసిఆర్ లక్ష్యంగా పోస్టింగ్‌లు ప్రచారమవుతున్నాయి. కెసిఆర్ మాటతో ఒక కొత్త చర్చ మొదలైందన్నది వాస్తవం.
డైవర్ట్ రాజకీయాలు
ప్రజాపక్షం/హైదరాబాద్ భారీ వర్షాలు పడడం అంతర్జాతీయ కుట్ర అని సిఎం కెసిఆర్ చెప్పడం బాధాకరమని కాంగ్రెస సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి అన్నారు. కెసిఆర్ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2009 సంవత్సరంలో నాటి రోశయ్య ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద 20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఆ ప్రాజెక్టు తట్టుకుందని, కానీ బాహుబలి పంప్‌లతో నిర్మించామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మాత్రం పంప్‌లు నీటమునిగాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మర్రిశశిధర్ రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ చెబుతున్నట్టుగా క్లౌడ్ బరస్ట్ జరిగితే, గంటకు వంద మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదు కావాలని, కానీ ఉత్తరాఖండ్‌లో కూడా క్లౌడ్ బరస్ట్ జరగలేదని వివరించారు. వర్షపాతాన్ని నిర్దిష్టంగా కొలిచే పరికరాలు మనవద్ద లేవన్నారు. రాష్ట్ర విభజనకు ముందు రీజినల్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని, 2009లో కర్ణాటక, మహారాష్ట్రలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఆ వర్షానికి భారీ వరద మనకు వచ్చిందని గుర్తు చేశారు. కెసిఆర్ పర్యటనలో సిఎస్ తోకలెక్క కుర్చున్నారన్నారు. విపత్తుల సమయంలో అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని, కానీ ఆ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో విపత్తుల నిర్వహణ సమావేశం జరగలేదన్నారు. రానున్న రోజుల్లో నగరాలు, పట్టణాల్లో భారీ వరదలు వస్తాయని, విపత్తును ఎదుర్కొనేందుకు గైడ్ లైన్స్ పాటించాలని సూచించారు. తమ హయంలోనే డిజాస్టర్ మెనేజ్‌మెంట్ వచ్చిందని మర్రిశశిధర్ రెడ్డి గుర్తుచేశారు
ఏ దేశం కుట్ర చేసింది?: కొండా
ప్రజాపక్షం/హైదరాబాద్
వరదల నియంత్రణ కోసమే కాళేశ్వరం ప్రా జెక్ట్‌ను నిర్మించామని చెప్పారని, కానీ వరదలతోనే కాళేశ్వరం పంప్‌హౌస్ మునిగిపోయిందని బిజెపి నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం డిజైనే తప్పు అని, రిజర్వాయర్లు కట్టలేదని, నీళ్లు ఎక్కడ ఎత్తి పోస్తరని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు శ్రీశైలం పంప్‌హౌస్ ఒక్కసారే మునిగిపోయిందని గుర్తు చేశారు. క్లౌడ్ బరస్ట్ ఎలా జరిగిందని, ఏ దేశం కుట్ర చేసిందని, చైనానా?, పాకిస్తానా?, దీనిపైన సిఎం కెసిఆర్ మరింత స్పష్టత, సమాచారంతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. వరదలతో నష్టపోయిన వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గతంలో ఇచ్చిన మాటలకు విలువ లేకుండాపోయిందని, జిహెచ్‌ఎంసి వరద బాధితులు రూ.10వేలు ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించారు. భద్రాచలం దేవాలయానికి గతంలో రూ.100 కోట్లు ఇస్తామని, ఇవ్వలేదని, ఇప్పుడు దానికి సున్నాను కలిపి రూ.1000 కోట్లు ఇస్తామని ప్రకటించారన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. క్లౌడ్ బరస్ట్ ఎక్కడ పడితే అక్కడ కాదని, పైగా దీని ద్వారా వర్షం రోజంతా పడదని, కొన్ని గంటలు మాత్రమే ప్రభావం ఉంటుందని వివరించారు.