సూపర్‌స్టార్ రజనీకాంత్
వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తాం
పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి
చెన్నై: తనకు ఏనాడు ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షలేదని, అది తన కల కూడా కాదని సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం చెన్నైలో చెప్పారు. 2017 డిసెంబర్ 31 తర్వాత ఆయన తొలిసారిగా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన పార్టీ రాజకీయాల్లోకి వస్తుందని, గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని, అయితే ముఖ్యమంత్రిగా ఓ విద్యావంతుడినే తమ పార్టీ నుంచి ఎన్నుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తన పార్టీలో 45 ఏళ్లకన్నా తక్కువ వయస్సు ఉన్న యువతకు తగిన ప్రాధాన్యత ఇస్తానన్నారు. యువత తర్వాత మిగతావారు… రిటైర్డ్ జడ్జిలు, ఐఎఎస్‌లు, ఐపిఎస్ వంటి పదవులు నిర్వహించిన వారు పార్టీలో ఉంటారన్నారు. ‘నేనే స్వయంగా వారిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తాను’ అని కూడా చెప్పారు. ఇదిలా ఉండగా ఆయన తన పార్టీకి సంబంధించిన గట్టి నిర్ణయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. రాజకీయాల్లోకి వస్తానని, యువతకు ప్రాధాన్యత ఇస్తానని మాత్రమే చెప్పారు. తన పార్టీకి మూడంచెల ఫార్ములాను ప్రతిపాదిస్తానన్నారు. తన పార్టీ లంచం తీసుకోని పార్టీగా పనిచేస్తుందన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీచేయనున్నట్లు సమాచారం. ‘రాజకీయ మార్పు, ప్రభుత్వ మార్పు…ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ సాధ్యం కాదు’ అని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎఐఎడిఎంకె, డిఎంకె నేతలు జయలలిత, కరుణానిధి మరణానంతరం ఓ రాజకీయ శూన్యం తమిళనాడులో ఏర్పడిందన్నారు. తమిళనాడులో మార్పుకు ఇదే తగిన అదను అన్నారు. ‘ఇది మంచి అవకాశం. ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి. యువత, ప్రజల నుంచే ఉద్యమం పుట్టాలి’ అని చెప్పారు. ‘మార్పనేది రాకుంటే…తన పార్టీకి కేవలం 15 నుంచి 20 శాతం ఓట్టే వస్తాయి’ అన్నారు. 71 ఏళ్ల వయస్సు ఉన్న రజనీకాంత్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని తెలుస్తోంది. తనకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఛాన్స్ ఒకటే ఉందని ఆయన భావోద్వేగంతో చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త నెత్తురును ఎక్కించాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు. అవినీతి రహిత, సౌభాగ్యవంతమైన తమిళనాడును తాను కోరుకుంటున్నానన్నారు. తన ఉద్దేశాలు గ్రహించి ప్రజలు తనకు మద్దతునివ్వాలన్నారు. 234 సభ్యులుండే తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది(2021)లో ఎన్నికలు జరగనున్నాయి.
సిఎం కావాలన్న కాంక్ష లేదు
RELATED ARTICLES