HomeNewsTelanganaసిఎంఆర్‌లో రైస్‌ మిల్లర్ల అక్రమాలు

సిఎంఆర్‌లో రైస్‌ మిల్లర్ల అక్రమాలు

సూర్యాపేటలో మొండికేస్తున్న రైస్‌ మిల్లర్లు
ములుగులో మిల్లుకు చేరాల్సిన ధాన్యం పక్కదారి
వనపర్తిలో పుట్టగొడుగుల్లా రైస్‌ మిల్లులు
అధికారులు నోటీసులు ఇచ్చినా బేఖాతర్‌
ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి 12 నెలలు దాటినా ఇవ్వని వైనం
ప్రజాపక్షం/ సూర్యాపేట ప్రతినిధి / ప్రజాపక్షం / పెబ్బేరు / ములుగు ప్రతినిధి :
రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సిన రైస్‌ మిల్లర్లు రకరకాల అవకతవలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. కొంత మంది రైస్‌ మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సిఎంఆర్‌) ను ప్రభుత్వానికి అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరి కొంతమంది బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గత రెండు మూడు సీజన్ల సిఎంఆర్‌ను మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించకుండా జాప్యం చేస్తుండడమే ఇందుకు కారణమని రైతులు, అధికారులు అంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సిన మిల్లర్లు మొండికేస్తున్నారు. పౌర సరఫరాల అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా రాజకీయ నాయకుల అండదండలతో భేఖాతర్‌ చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు గత ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని 70 మంది మిల్లర్లకు సిఎంఆర్‌ కోసంకేటాయించారు. వీరికి ధాన్యం అప్పగించి 12 నెలలు అవుతున్నా ఇందులో 18 మంది మిల్లర్లు నేటికి ఎఫ్‌సిఐ, సివిల్‌ సప్లుకి రూ.27.75 కోట్ల విలువైన సిఎంఆర్‌ను అప్పగించలేదు. ఈ 18 మంది రైస్‌ మిల్లర్స్‌ అధికారులు 3042.360 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేటాయించగా వీరు 67 శాతం సిఎంఆర్‌ను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అంటే 2038.380 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అప్పగించాలి. బాకీపడి ఉన్న మిల్లర్లలో అత్యధికంగా కోదాడ ప్రాంతానికి చెందిన వారు 8 మంది ఉండగా, రెండవ స్థానంలో హూజుర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల ప్రాంతానికి చెందిన ఇద్దరు మిల్లర్లు, మూడవ స్థానంలో తిరుమలగిరి ప్రాంతానికి చెందిన నాలుగు మిల్లర్లు, సూర్యాపేట ప్రాంతంలోని నలుగురు మిల్లర్లు ప్రభుత్వానికి సిఎంఆర్‌ ఇవ్వాల్సి ఉంది. వీరి అక్రమాలకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు కొమ్ముకాయడంతోనే సిఎంఆర్‌ బకాయి ప్రభుత్వానికి అప్పగించడంలేదనే పలువురు అధికారులు వాపోతున్నారు. అక్రమాలకు అలవాటు పడ్డ మిల్లర్లు ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరి బియ్యం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో బిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులతో అంటకాగిన కొందరు మిల్లర్లు ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకుల వద్దకు వెళ్లి తమ తప్పులను అధికారులు బయటపెట్టకుండా ఉండేందుకు కాకపడుతున్నారు. సిఎంఆర్‌ పెండింగ్‌పై పలువురు మిల్లర్లు ప్రశ్నిస్తే ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇచ్చిందని అప్పటిలోగా బియ్యం అప్పగిస్తామని కొందరు మిల్లర్లు చెబుతుండగా మరికొంతమంది మిల్లర్లు పెట్టకుంటే ఏం చేస్తారు. అయితే కేసులే పెడతారుగా.. మాకు కేసులు కొత్తకాదు…. జైలూ కొత్త కాదంటూ తెగేసి చెబుతున్నారు.
మిల్లుకు చేరాల్సిన ధాన్యం పక్కదారి
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నల్లగుంట గ్రామంలో సోమవారం రాత్రి ఐకెపి సెంటర్‌ నుండి మిల్లుకు చేరాల్సిన ధాన్యం బస్తాలను మధ్యలో వాహనం నుండి ఆటోలోకి మార్చి తరలిస్తుండగా రైతులు పట్టుకున్న తీరును చూస్తే మరో కొత్త మోసానికి తెరతీసినట్లు కనిపిస్తుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగుంట గ్రామానికి చెందిన పేర్ల శ్రీనివాస్‌ అనే రైతుకు చెందిన ధాన్యం నల్లగుంట ఐకెపి సెంటర్‌ నుండి డిసిఎం ద్వారా వెలుతుర్లపల్లిలోని రైస్‌మిల్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నల్లగుంట పాలంపేట గ్రామాల మధ్య డిసిఎం వ్యాన్‌ డ్రైవర్‌, ఆటో వ్యక్తితో కలిసి ధాన్యాన్ని కాజేస్తున్నట్లు అనుమానం వచ్చిన రైతులంతా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళారు. దీనితో డిసిఎం డ్రైవర్‌ పారిపోగా ఆటో డ్రైవర్‌ను పట్టుకుని వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. కాగా ఇప్పటికే రాజీ కోసం మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రైతుల శ్రమ దోపిడికి పాల్పడే ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని తోటి రైతులు కోరుతున్నారు.
పుట్టగొడుగుల్లా రైస్‌ మిల్లులు
వనపర్తి జిల్లాలో రైస్‌ మిల్లర్ల అక్రమ సంపాదనకు అడ్డు అదుపూ లేకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రభుత్వ పెట్టుబడితో, మిల్లు యజామానులు అక్రమ మార్గాన కోట్లు సంపాదిస్తున్నారు. కొన్ని రైస్‌ మిల్లులకు ఇంకా విద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఏర్పాటు రాకముందే, మిల్లులో ఒక షెడ్డు ఉంటే చాలు మిషనరీ పూర్తి స్థాయిలో లేకపోయినా లక్షల బస్తాలను అటువంటి మిల్లులకు కేటాయింపులు చేయడంలో అధికారుల విశ్వనీయత, నిజాయితీలపై ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 2020 నుంచి 2024 వరకు వానాకాలం, రబీ సీజన్లలో మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని సిఎంఆర్‌ చేసి ఎఫ్‌సిఐకి లేదా సివిల్‌ సప్లు శాఖకు తిరిగి అందించాల్సి ఉండగా, కొంత మంది రైస్‌ మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని పక్క రాష్ట్రాలలో ఎక్కువ ధరలకు అమ్మి కోట్ల రూపాయల అక్రమ సంపాదన కూడగట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం అమ్ముకున్న రైస్‌ మిల్లర్లు ఈ ఏడాది కేటాయించిన ధాన్యంతో గత ఏడాదికి సంబంధించిన సిఎంఆర్‌ బియ్యాన్ని ప్రబుత్వానికి అప్పజెబుతున్నారు. తద్వారా వారు అమ్ముకున్న ధాన్యం బస్తాల కొరత అలాగే కొనసాగుతున్నట్లు కనబుడుతన్నది. ఈ కొరతను పూర్తిచేయడం కోసం చాలా మంది రైస్‌ మిల్లర్లు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అక్రమ రీస్లుకింగ్‌కు పాలల్పడుతున్నారు. కోట్లాది రూపాయల విలువచేసే సిఎంఆర్‌ బకాయిపడిన రైస్‌ మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments